Let's talk: editor@tmv.in
భారత్ రష్యా మైత్రిలో కొంగొత్త రాగాలు

భారత్ రష్యా మైత్రిలో కొంగొత్త రాగాలు

Dr.Chokka Lingam
9 డిసెంబర్, 2025

ప్రపంచ రాజకీయాల్లో మార్పులు ఇప్పుడు వేగంలో మాత్రమే కాదు, దిశలోను విపరీతమైన పునర్వ్యవస్థీకరణను సూచిస్తున్నాయి. శీతల యుద్ధం తర్వాత ఏర్పడిన పాశ్చాత్య ఆధిపత్యం క్రమంగా బలహీనపడుతుండగా, చైనా - రష్యా కూటమి వేగంగా బలోపేతం అవుతోంది. మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు కూడా తమ విదేశాంగ విధానాన్ని కొత్త మిత్రబంధాల దిశగా మలుచుకుంటున్నాయి. ఈ పరిణామాల మధ్య భారత విదేశాంగ విధానం ముందు నిలిచిన ముఖ్యమైన పరీక్ష తన సంప్రదాయ వ్యూహాత్మక స్వతంత్రతను నిలుపుకుంటూనే, బహు ధృవ ప్రపంచంలో తగిన స్థానం ఎలా సంపాదించుకోవాలి?

ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతుంటే భారత్ - రష్యా సంబంధాలు తిరిగి అంతర్జాతీయ చర్చల్లో ప్రముఖస్థానం దక్కించుకున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించగా, మాస్కో తన వాణిజ్యాన్ని కొత్త భాగస్వాముల వైపు మళ్లించడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో భారత్ పెద్ద ఎత్తున రష్యా క్రూడ్ ఆయిల్‌ను కొనుగోలు చేయగా, ఇది పాశ్చాత్య దేశాలకు అసహనంగా మారింది. అయినప్పటికీ భారత్ మాత్రం తన ధోరణిలో స్పష్టతను చూపిస్తూ, “ఆర్థిక ప్రయోజనాలు మరియు ప్రజల అవసరాలు మొదటి ప్రాధాన్యం” అనే సందేశంతో ముందుకు సాగింది.

ఇంధనం భారత ఆర్థిక వ్యవస్థకు మూలాధారం. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగి, ద్రవ్యోల్బణం ఉధృతమవుతున్న సమయంలో రష్యా అందించిన రాయితీలు భారతదేశానికి ఆర్థికంగా గొప్ప ఊరటనిచ్చాయి. పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రణలో ఉండటానికి, రవాణా ఖర్చులు అధికం కాకుండా చూడటానికి, పరిశ్రమల్లో ఉత్పత్తి వ్యయాలు విపరీతంగా పెరగకుండా ఉంటటానికి ఈ చౌక క్రూడ్ కీలక పాత్ర పోషించింది. అయితే ఇంధన రంగంలో ఒకే దేశంపై అధికంగా ఆధారపడకాన్ని వ్యూహాత్మకంగా ప్రమాదకరంగా భావించే వర్గాలు కూడా ఉన్నాయి. పాశ్చాత్య ఆంక్షలు పెరుగుతున్న కొద్దీ రష్యా సరఫరాలు చెల్లింపుల విధానాలు, షిప్పింగ్ బీమా, బ్యాంకింగ్ మార్గాలు, మధ్యవర్తుల ద్వారా జరిగే లావాదేవీలపై సంక్షోభాన్ని పెంచుతున్నాయి. తాత్కాలికంగా మొత్తం వ్యవహారం భారత ప్రయోజనాలకు అనుకూలంగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో ఈ ఆధారపడటం భారత శక్తి భద్రతకు అడ్డంకిగా మారే అవకాశం ఉంది.

రష్యాతో భారత సంబంధాలు ఇంధనంతో మాత్రమే పరిమితం కావు. దశాబ్దాలుగా రెండుదేశాల మధ్య రక్షణ సహకారం బలమైన పునాది. సోవియట్ యుగం నుంచి భారత సైన్యానికి ఆధారంగా ఉన్న అనేక శస్త్ర వ్యవస్థలు, యుద్ధవిమానాలు, సబ్‌మెరైన్‌ల నుంచి ఆధునిక క్షిపణి వ్యవస్థల వరకు రష్యా అందించిన సాంకేతిక సామర్థ్యం అపారమైనది. గత కొన్నేళ్లలో భారత్ రక్షణ దిగుమతులను వైవిధ్యపరిచినప్పటికీ, రష్యా ఇంకా ప్రధాన భాగస్వామిగానే మిగిలింది. బ్రహ్మోస్ క్షిపణి, అణు సబ్‌మెరైన్‌లు, అంతరిక్ష సహకారం, ఎస్–400 వ్యవస్థ వంటి అంశాలు ఈ భాగస్వామ్యానికి నిదర్శనం.

అయితే ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయాలు ఈ సంబంధాలను పరీక్షించే పరిస్థితులను తీసుకొచ్చింది. రష్యా–చైనా వ్యూహాత్మక సాన్నిహిత్యం భారత్ కు ఆందోళన కలిగిస్తోంది. చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నపుడు రష్యా బీజింగ్‌ సంబంధాలు బలోపేతం కావడం భారత్‌కు వ్యూహాత్మకంగా సంక్లిష్టతను పెంచుతోంది. రష్యా భారతదేశానికి అనుకూలమైనది కావాలన్న ఆశ న్యాయం అయినప్పటికీ, అంతర్జాతీయ ఒత్తిడి, ఆర్థిక పరిమితులు, చైనా ఆధిపత్యం వంటి అంశాలు మాస్కోను కొత్త సమీకరణాల వైపు నడిపిస్తున్నాయి. భారత్ ఈ మార్పును జాగ్రత్తగా గమనిస్తూ, తనకు అనుకూలంగా దౌత్యాన్ని మలచుకుంటోంది.

ఇక అమెరికా, యూరప్‌లతో భారతదేశ సంబంధాలు మరో వైపున అత్యంత కీలక దశలో ఉన్నాయి. వాణిజ్యం, సాంకేతికత, విద్య, భద్రత, సముద్ర సహకారంలో పాశ్చాత్య దేశాలతో భారతదేశం గాఢంగా ముడిపడి ఉంది. ఐటీ రంగం, పెట్టుబడులు, స్టార్ట్–అప్ ఇకోసిస్టమ్, రక్షణ ఉత్పత్తి రంగాలలో పాశ్చాత్య దేశాల పాత్ర అపారం. ఈ నేపథ్యంలో అమెరికా తరచూ భారత్‌ను “ప్రజాస్వామ్య భాగస్వామ్యం” పేరిట పాశ్చాత్య శిబిరానికి దగ్గర చేస్తూ ఒత్తిడి తెస్తోంది. అయితే భారతదేశం మాత్రం శిబిర రాజకీయాలు కాదు, జాతీయ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యమని ఒకే మాట చెబుతోంది.

ఈ ద్వంద్వ ఒత్తిడుల మధ్య భారతదేశం తీసుకోవాల్సిన మార్గం నిశితమైనది. ఇంధన రంగంలో విభిన్నీకరణ అత్యవసరం. మధ్యప్రాచ్య దేశాలు, ఆఫ్రికా, అమెరికా, దక్షిణ అమెరికా వంటి ప్రాంతాల నుంచి ఇంధన వనరులను పెంచడం భవిష్యత్ శక్తి భద్రతకు అవసరమైనది. పునర్వినియోగ శక్తి, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులను విస్తృతం చేయడం భారతం దీర్ఘకాలిక స్వాతంత్ర్యానికి దారితీస్తుంది. రక్షణ రంగంలో సాంకేతికతను దేశీయంగా అభివృద్ధి చేసుకోవడం మరియు పలు దేశాలతో సమాంతరంగా సహకారం పెంచుకోవడం ద్వారా కొన్ని దేశాలపై మాత్రమే ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

దౌత్య రంగంలో బహుదిశా వ్యూహం కొనసాగించడం అత్యంత కీలకం. అమెరికా, రష్యా, యూరప్, జపాన్, ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్యం ప్రతి ప్రాంతంతో సమతుల్య సంబంధాలు నిర్వహించడం మారుతున్న ప్రపంచంలో భారతానికి అవసరమైన స్థిరత్వాన్ని అందిస్తుంది. అంతర్జాతీయ వేదికల్లో, ముఖ్యంగా G20, BRICS, SCO వంటి సమాఖ్యల్లో భారత్ మరింత నాయకత్వ పాత్రను ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. గ్లోబల్ సౌత్ దేశాల ఇంధన అవసరాలు, ఆర్థిక అసమానతలు, అభివృద్ధి సవాళ్లపై భారతం బలమైన స్వరం వినిపించగలదు.

మొత్తానికి, భారత్–రష్యా సంబంధాలు ప్రపంచ మార్పుల దిశను బట్టి రూపాంతరం చెందుతున్నాయి. పాత స్నేహం ప్రస్తుత పరిస్థితుల్లో కూడా విలువైనదే అయినప్పటికీ, భవిష్యత్ వ్యూహాలలో ఇది ఏ రూపంలో కొనసాగుతుందనేది పరిస్థితులపైనే ఆధారపడుతుంది. భారత్ కు రష్యా అవసరం ఉన్నట్లే రష్యాకు కూడా భారత్ అవసరం. ఈ పరస్పర అవసరం రెండుదేశాల సంబంధాలను బలంగా చేస్తుంది. కానీ ఈ బంధం ఏ రూపంలో ఉండాలి? ఎంత దూరం కొనసాగాలి? ఏ రంగాల్లో బలోపేతం కావాలి? ఏ రంగాల్లో తగ్గించాలి? ఇవన్నీ భారత విదేశాంగం రాబోయే సంవత్సరాల్లో సమాధానపరచాల్సిన ప్రశ్నలు.

ప్రపంచం వేగంగా విభజన దిశగా సాగుతున్న ఈ దశలో భారతదేశం ముందున్న లక్ష్యం స్పష్టమైనది పక్షపాతాలపై కాదు, ప్రయోజనాలపై ఆధారపడే విదేశాంగ విధానం అవసరం. రష్యాతో సంబంధాలు కొనసాగాలన్నా, పాశ్చాత్య దేశాలతో భాగస్వామ్యాన్ని పెంచాలన్నా, భారత్ ఏ నిర్ణయమైనా తీసుకున్నా దాని కేంద్రబిందువు జాతీయ ప్రయోజనం కావాలి. ఇదే 21వ శతాబ్దపు భారత విదేశాంగాన్ని నిర్వచించే అసలు ప్రమాణం.