
భారత్ రష్యా చమురు నిలిపివేస్తుందని ట్రంపే చెప్పారు: లావ్రోవ్
భారత్ రష్యా చమురు కొనుగోళ్లు నిలిపివేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్ప మరెవ్వరూ ప్రకటించలేదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ బుధవారం తెలిపారు. రష్యా పార్లమెంట్ దిగువ సభ ‘స్టేట్ డూమా’లో ఓ సభ్యుడి ప్రశ్నకు సమాధానమిస్తూ లావ్రోవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ భారత్ ఇకపై రష్యా చమురు కొనుగోలు చేయదని ప్రకటించారని మీరు చెప్పారు. కానీ ప్రధాని మోడీ గానీ, ఇతర భారత నాయకులు గానీ అలాంటి ప్రకటన చేసినట్లు నేను వినలేదని ఆయన స్పష్టం చేశారు.
అమెరికా భారత్ సహా ఇతర దేశాలు రష్యా చమురు కొనకుండా అడ్డుకునేందుకు సుంకాలు, ఆంక్షలు, నిషేధాలు వంటి ‘బలవంతపు చర్యలు’ ఉపయోగిస్తున్నదని రష్యా రెండు రోజుల క్రితం ఆరోపించిన నేపథ్యంలో లావ్రోవ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బ్రిక్స్ నాయకత్వాన్ని భారత్ చేపట్టిన సందర్భంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ న్యూఢిల్లీలో జరిగిన షెర్పాల తొలి సమావేశంలో ఇంధన భద్రత బ్రిక్స్ సమ్మిట్ ప్రధాన అంశాల్లో ఒకటిగా ఉంటుందని పేర్కొన్నారని లావ్రోవ్ గుర్తుచేశారు. ఈ సమ్మిట్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు.
భారత్ తో సంబంధాలకు ఆకాశమే హద్దు
డిసెంబర్ 2025లో పుతిన్ భారత్ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయని, దీంతో రష్యా–భారత్ సంబంధాలు ‘ప్రత్యేక, ప్రాధాన్య వ్యూహాత్మక భాగస్వామ్యం’గా మరింత బలపడినట్లు తెలిపారు. ఈ ఏడాది భారత్ ఆధ్వర్యంలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా రెండు దేశాల నేతల మధ్య మరో భేటీ జరిగే అవకాశం ఉందని చెప్పారు. భారత్ ఎంతదూరం సంబంధాలను తీసుకెళ్లాలనుకుంటే, అంతదూరం వెళ్లేందుకు రష్యా సిద్ధంగా ఉందని, “ఆకాశమే హద్దు” అని లావ్రోవ్ వ్యాఖ్యానించారు.
ఇటీవల భారత్‌తో వాణిజ్య ఒప్పందం ప్రకటించిన ట్రంప్, న్యూఢిల్లీ రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయబోదని పేర్కొన్నారు. గత ఆగస్టులో రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌పై విధించిన అదనపు 25 శాతం సుంకాన్ని ఆయన ఇటీవల వెనక్కి తీసుకున్నారు. ఇదిలా ఉండగా, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి సోమవారం మాట్లాడుతూ, భారత్ ముడి చమురు కొనుగోళ్లలో విభిన్న వనరులను కొనసాగిస్తుందని, సరఫరా స్థిరత్వం కోసం వైవిధ్యీకరణకు ప్రాధాన్యం ఇస్తుందని, జాతీయ ప్రయోజనాలే మార్గదర్శక సూత్రంగా ఉంటాయని స్పష్టం చేశారు.
