
భారత్ బ్రిటిష్ వ్యాపారాభివృద్ధి కోసం బ్రిటీష్ ప్రధాని రాక
భారత్ మూడో ఆర్థికశక్తిగా ఎదుగుతుంది, ఈ ప్రయాణంలో మేం భాగమవుతాం – కీర్ స్టార్మర్ ‘‘భారత్ ఇటీవలే జపాన్‌ను అధిగమించి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2028నాటికి మూడో ఆర్థికశక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడికొచ్చి ఈ పరిస్థితులను చూస్తుంటే లక్ష్యాన్ని సాధించేదిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తున్నట్టు అర్ధమవుతోంది. వికసిత్ భారత్ స్ఫూర్తితో 2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తోందన్న నమ్మకం ఉంది. ఈ ప్రయాణంలో మేమూ భాగం కావాలనుకుంటున్నాం’’. 125 మంది ప్రతినిధుల బృందంతో భారత పర్యటనకు వచ్చిన యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ మనదేశాన్ని, ఆర్థిక వ్యవస్థను, దేశంలో అభివృద్ధితీరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలివి. భారత పర్యటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ, ఏ దేశంలో పర్యటించేటప్పుడు ఆ దేశాన్ని పొగడడం సాధారణమే అయినప్పటికీ కీర్ స్టార్మర్ వ్యాఖ్యలు చేసిన సందర్భాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. రష్యా నుంచి చమురు కొంటోందని ఆరోపిస్తూ భారత్‌పై 50శాతం సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీగా అభివర్ణించారు.
ఈ నేపథ్యంలో కీర్ స్టార్మర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికా మిత్రదేశమైన యూకే అధినేత అయిన కీర్ స్టార్మర్ భారత్‌ను అమెరికా కోణంలోనుంచి చూడకుండా మన ప్రత్యేకతను గుర్తించారు. భారత్ ఆర్థికంగా అనుకున్న లక్ష్యాలను చేరుతుందన్న నమ్మకం వ్యక్తంచేశారు. యూకే నుంచి భారత వాణిజ్య రాజధాని ముంబైలో దిగిన కీర్ స్టార్మర్ పర్యటన అంతా వాణిజ్యపరమైన అంశాలే కీలకపాత్ర పోషించాయి. ముంబైలోని రాజ్‌భవన్‌లో ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. భారత్ అభివృద్ధి చెందుతున్న తీరు గురించి పొగిడిన కీర్ స్టార్మర్ భారత్, యూకే మధ్య కుదిరిన స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం గురించీ మాట్లాడారు. రెండు దేశాల సంబంధాల్లో ఈ డీల్ ఒక చారిత్రక మైలురాయి అని ఆయన అన్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగిన తర్వాత భారత్‌తో కుదిరిన ఈ ఒప్పందం చాలా కీలకమైనదని, దీనివల్ల ఈయూపై బ్రిటన్ ఆధారపడడం తగ్గుతుందని అన్నారు. భారత్‌తో చేసుకున్న ఒప్పందం అతిపెద్దది మాత్రమే కాదని, వృద్ధి ప్రస్థానానికి వేదికని, భారత్‌లో వాణిజ్యం వేగంగా పెరిగి, చౌకగా మారుతుందని దీనివల్ల బ్రిటిష్ ప్రజలకు మరిన్ని అవకాశాలు, స్థిరత్వం, ఉద్యోగాలు లభిస్తామని కీర్ స్టార్మర్ చెప్పారు.
కీర్ స్టార్మర్ పర్యటనలో ప్రధానంగా ఆర్థిక సహకారం, టెక్నాలజీ, వాణిజ్యం, విద్యా రంగాల్లో రెండు దేశాల మధ్య సహకారంపై ప్రధానంగా చర్చ జరిగింది. త్వరలో భారత్‌లో తొమ్మిది బ్రిటిష్ యూనివర్శిటీలు ఏర్పాటు చేస్తారు. యూకే ప్రధాని అయ్యాక కీర్ స్టార్మర్ భారత్ రావడం ఇదే తొలిసారి. జూలైలో భారత్, యూకే మధ్య స్వేచ్చావాణిజ్య ఒప్పందం కుదరడం రెండు దేశాల సంబంధాల్లో కీలక మలుపు. ఒకనాడు భారత్‌ను పరిపాలించిన యూకే మన సంపదనంతా దోచుకెళ్లింది. స్వాతంత్ర్యం తర్వాత ఏడున్నర దశాబ్దాల్లో భారత్ ఆర్థికంగా ఎదిగిన తీరు, సాధించిన స్వయం సమృద్ధి ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరిచింది. కరోనా ఇబ్బందులను, రష్యా, యుక్రెయిన్ యుద్ధ ప్రభావాన్ని అధిగమించి మరీ 2022నాటికి భారత ఆర్థిక వ్యవస్థ బ్రిటన్‌ను వెనక్కి నెట్టింది. అప్పటిదాకా బ్రిటన్ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండగా భారత్ ఆ స్థానాన్ని అధిగమించింది. ఇటీవల భారత్ జపాన్‌ను అధిగమించి నాలుగో ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. మూడోస్థానానికి చేరడాన్ని ఇప్పుడు లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోంది.
బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కొంత కష్టాల్లో ఉంది. ద్రవ్యోల్బణం అక్కడి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆహారం, ఇంధనం, ఇతర నిత్యావసరాల ధరలు పెగరడం, అందుకు తగ్గట్టుగా వేతనాలు పెరగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్ అభివృద్ధి చెందిన దేశమయినప్పటికీ ఉత్పాదకత తక్కువగా ఉంది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ క్రమంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన భారత్‌తో బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందంతో రెండు దేశాలకూ ప్రయోజనాలున్నాయి. భారత్‌లో తయారయ్యే వస్త్రాలు, ఔషధాలు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు బ్రిటన్ మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవ్వడానికి, ఎగుమతుల వల్ల కొత్త ఉద్యోగాలు రావడానికి, బ్రిటన్ కంపెనీలు టెక్నాలజీ, విద్య, ఆరోగ్య రంగాల్లో భారత్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడానికి వీలు కలుగుతుంది. యూకేతో స్వేచ్ఛావాణిజ్యఒప్పందంపై భారత్‌లో వ్యతిరేకత కనిపించకపోయినప్పటికీ బ్రిటన్‌లో మాత్రం ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. బ్రిటన్‌లో స్థానిక వ్యాపారులకు నష్టం కలుగుతుందని ఆరోపిస్తూ కొందరు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించారు. కీర్ స్టార్మర్ ప్రభుత్వం మాత్రం పట్టుబట్టి భారత్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు ఈ ఒప్పందం విషయంలో భారతీయులకు ఎలాంటి నష్టం జరగకుండా భారత ప్రభుత్వం అనేక జాగ్రత్తలు పాటిస్తోంది. వ్యవసాయం, పాలు, చిన్న పరిశ్రమల వంటి రంగాలు స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం పరిధిలోకి రావు. యూకేతో భారత్ వాణిజ్య ఒప్పందం, ఇతర ఒప్పందాలను సరైన సమయంలోతీసుకున్న సరైన నిర్ణయాలుగా భావించాలి. ఎగుమతుల కోసం అమెరికాపై భారత్ ఎక్కువగా ఆధారపడుతోంది. ఇది ఎంత ప్రమాదకరమో ఇటీవలి ట్రంప్ సుంకాల బాదుడుతో భారత్‌కు తెలిసి వచ్చింది. ప్రస్తుతం ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతికే పనిలో భారత్ బిజీగా ఉంది. ఆ దిశలో బ్రిటన్ భారత్‌కు నమ్మదగ్గ వాణిజ్య భాగస్వామి అయ్యే అవకాశముంది.
యూకేతో వాణిజ్య సంబంధాలపై ప్రధాని మోదీ సానుకూల భావంతో ఉన్నారు. ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల్లో భారత్,యూకే భాగస్వామ్యం ప్రపంచ స్థిరత్వానికి, ఆర్థిక ప్రగతికి ముఖ్యమైన స్తంభంలా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. ఒకప్పుడు పాలిత దేశమైన భారత్‌ను ప్రస్తుతం యూకే గౌరవభావంతో చూస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా, అతిపెద్ద మార్కెట్, మానవ వనరులు, ప్రకృతి వనరులు సమృద్ధిగా ఉన్న దేశంగా భారత్ అతి త్వరలో ఆర్థికంగా అనూహ్య విజయాలు సాధిస్తుందని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు ఎన్నో ఏళ్లగా అంచనావేస్తున్నారు. యూకే పాలకులు భారత్‌ను వీడి వెళ్తున్న సమయంలో మన దేశం తృతీయ ప్రపంచ దేశం. ఆర్థికంగా ఎంతో వెనకబడి ఉన్న దేశం. అప్పుడు ప్రపంచంలో మన గుర్తింపు అభివృద్ధి చెందుతున్న దేశం, పేద దేశం. కానీ స్వాతంత్ర్యం వచ్చిన ఎనిమిది దశాబ్దాల్లోపే భారత్ అద్భుత ప్రగతిని సాధించింది. అధిక జనాభా వంటి సమస్యలను అనుకూలంగా మలుచుకుని ప్రగతిబాట పట్టింది. భారతీయులకు పాలన చేతకాదని, ఆర్థిక వ్యవస్థను నిర్వహించలేరని భారత్‌కు స్వాతంత్ర్యం ఇచ్చే సమయంలో బ్రిటిష్ పాలకులు అనుకున్నారు. అదే దేశానికి చెందిన పాలకులు ఇప్పుడు యూరోపియన్ యూనియన్‌కు ప్రత్యామ్నాయంగా భారత్‌ను చూసే స్థితికి దేశం చేరుకోవడం అసాధారణమైన విషయం
