Let's talk: editor@tmv.in
భారత్ బుల్లెట్ల‌తో ఉగ్రవాదులకు స‌మాధానం ఇస్తాం:కేంద్ర మంత్రి అమిత్ షా

భారత్ బుల్లెట్ల‌తో ఉగ్రవాదులకు స‌మాధానం ఇస్తాం:కేంద్ర మంత్రి అమిత్ షా

Gaddamidi Naveen
9 నవంబర్, 2025

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా బీహార్‌లోని కటిహార్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీహార్‌లో రక్షణ కారిడార్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారని తెలిపారు. భవిష్యత్తులో దేశంపై తీవ్రవాదులు దాడి చేస్తే, వారి బుల్లెట్లకు భారతదేశంలో తయారైన షెల్స్‌తో సమాధానం ఇస్తామని ఆయన హెచ్చరించారు.

అమిత్‌ షా మాట్లాడుతూ భవిష్యత్తులో టెర్రరిస్టులు ఏదైనా చేస్తే, వారి బుల్లెట్లకు సమాధానం షెల్స్‌ రూపంలో వస్తుందన్నారు. ఆ షెల్స్‌ మన భూమిపైనే తయారవుతాయి, పాకిస్తాన్‌పై పేలుతాయి. దేశ రక్షణలో ‘ఆత్మనిర్భర్ భారత్‌’ ఆత్మను ప్రతిబింబించేలా బీహార్‌లో డిఫెన్స్‌ కారిడార్ ప్ర‌ధాని మోదీ ఏర్పాటు చేస్తున్నారు అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌, ఆర్జేడీ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీలు దేశం కోసం కాకుండా తమ కుటుంబాల కోసం మాత్రమే పనిచేశాయని, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తన కుమారుడిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని, సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రిగా చేయాలని కలలు కంటున్నారని అమిత్‌ షా అన్నారు.లాలూ యాదవ్‌ కుమారుడూ కాదు, సోనియా గాంధీ కుమారుడూ కాదు – వారిద్దరిలో ఎవ్వరూ కూడా సీఎం గానీ, పీఎం గానీ కాలేరు. ఎందుకంటే పట్నాలో సీఎం కుర్చీపై నితీశ్‌ కుమార్‌ కూర్చున్నారు, ఢిల్లీలో ప్రధానమంత్రి కుర్చీపై నరేంద్ర మోదీ ఉన్నారు. మరి ఎవరికీ ఖాళీ లేదు అని అమిత్‌ షా వ్యంగ్యంగా అన్నారు.

ఇక ఎన్నికల వాతావరణం గురించి మాట్లాడుతూ, ఎన్డీఏ బీహార్‌లో ఘన విజయాన్ని సాధించబోతుందని నమ్మకంగా చెప్పారు. ఆయన వ్యాఖ్యలకన్నా కొద్దిసేపటి ముందు సితామర్హీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ ప్రజాసభలో ప్రసంగించారు. ప్రజలు ఎన్డీఏ పట్ల చూపుతున్న మద్దతు “మనసును తాకేలా ఉందని” ఆయన అభివర్ణించారు.

భారత్ బుల్లెట్ల‌తో ఉగ్రవాదులకు స‌మాధానం ఇస్తాం:కేంద్ర మంత్రి అమిత్ షా - Tholi Paluku