Let's talk: editor@tmv.in
భార‌త్ బ‌ల‌ప‌డిందా?

భార‌త్ బ‌ల‌ప‌డిందా?

FL - BRTH
30 సెప్టెంబర్, 2025

క‌రోనా మ‌హ‌మ్మారి త‌ర్వాత ప్ర‌పంచ ఔష‌ధ ఉత్ప‌త్తుల రంగంలో భార‌తదేశం పాత్ర బ‌ల‌ప‌డింది. అమెరికా అతిపెద్ద దిగుమ‌తిదారుగా మారింది. సిర‌ప్ లు, యాంటి బ‌యాటిక్స్, అనాల్జెసిక్స్ వంటి రిటైల్ ఫార్ములేష‌న్ల దిగుమ‌తి ఆరేళ్ల‌లో రెట్టింప‌యింది. భార‌త దేశం నుంచి అమెరికా దిగుమ‌తి చేసుకుంటున్న ఔష‌ధాల వాటా 2019లో 8.9 శాతంగా ఉంటే.. 2025 నాటికి అది 15 శాతానికి పెరిగింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం రెడీ టు యూస్ మందులు, ఫినిష్డ్ ఫార్ములేష‌న్లు అన్న‌ది నిపుణుల వాద‌న‌. వీటి వాటా 2019లో 9.8 శాతం నుంచి 2025లో 15.8 శాతానికి పెరిగింది.

ఔష‌ధ దిగుమ‌తుల‌పై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ 100 శాతం సుంకాలు విధించిన త‌ర్వాత అనిశ్చితి కొన‌సాగుతోంది. బ్రాండెడ్ ఉత్ప‌త్తుల‌పై ట్రంప్ సుంకాలు విధించిన‌ప్ప‌టికీ.. జ‌న‌రిక్ మెడిసిన్స్ విష‌యంలో అనిశ్చితి ఉంది. జ‌న‌రిక్ మెడిసిన్స్ పై కూడా ఇదే విధంగా ట్రంప్ సుంకాల బాదుడు ఉంటే భార‌త ఔష‌ధ త‌యారీ కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కోక త‌ప్ప‌దు అన్న వాద‌న వినిపిస్తోంది. భార‌త ఫార్మా ఉత్ప‌త్త‌ల‌కు అమెరికా కీల‌కంగా మారింది. 2025 ఆర్థిక సంవ‌త్స‌రం మొద‌టి ఏడు నెలల్లో భార‌త్ నుంచి అమెరికా ఎగుమ‌తి అయ్యే ఫార్మా ఉత్ప‌త్తుల వాటా 45 శాతంగా ఉంది. 2023లో ఇది 38 శాతంగా ఉంది. 2024లో దాదాపు 8.6 బిలియ‌న్ డాల‌ర్ల ఉత్ప‌త్తులు భార‌త్ నుంచి అమెరికాకు ఎగుమ‌తి అయ్యాయి. 2025 జులై నాటికి 6.2 బిలియ‌న్ డాల‌ర్లు దాటాయి.

భార‌త్ నుంచి ఎగుమ‌తి అవుతున్న ఫార్మా ఉత్ప‌త్తుల్లో రిటైల్ ఫార్మా ఉత్పత్తుల వాటా ఎక్కువ‌గా ఉంది. ఇది 2019లో 84 శాతంగా ఉంటే... 2025లో 92 శాతం పెరిగింది. బ‌ల్క్ డ్ర‌గ్స్, ఏపీఐల కంటే రిటైల్ మెడిసిన్స్ వైపు ఎక్కువ మొగ్గు చూప‌డాన్ని ఈ పెరుగుద‌ల స్ప‌ష్టంగా సూచిస్తోంది. 2024లో ప్ర‌పంచ వ్యాప్తంగా భార‌త ఫార్మా ఉత్ప‌త్తుల ఎగుమ‌తులు 20.97 బిలియ‌న్ డాల‌ర్లు ఉంటే.. వాటిలో అమెరికా వాటా దాదాపు 40 శాతం ఉంది. అంటే అమెరికా మార్కెట్ పైనే భార‌త ఫార్మా ఎగుమ‌తులు ఎక్కువ‌గా ఆధార‌ప‌డి ఉండ‌టాన్ని ఇది సూచిస్తోంది. ఒకే మార్కెట్ పై ఎక్కువ‌గా ఆధార‌ప‌డ‌టం స‌మ‌స్య‌గా నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ట్రంప్ విధానాలు ఇప్పుడు ఫార్మా ఎగుమ‌తుల‌కు అడ్డంకిగా మారుతాయి. ఇలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కోవ‌డానికి భిన్న మార్కెట పై దృష్టి సారించాల్సిన అవ‌స‌రాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు.

భార‌త్ బ‌ల‌ప‌డిందా? - Tholi Paluku