Let's talk: editor@tmv.in
భారత్ ఫ్యూచర్ సిటీకి అమెజాన్ డేటా సెంటరే తొలి అడుగు: సీఎం రేవంత్ రెడ్డి
భారత్ ఫ్యూచర్ సిటీకి అమెజాన్ డేటా సెంటరే తొలి అడుగు: సీఎం రేవంత్ రెడ్డి

భారత్ ఫ్యూచర్ సిటీకి అమెజాన్ డేటా సెంటరే తొలి అడుగు: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
16 జులై, 2026

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం అమెజాన్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ శివార్లలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కానున్న ఈ డేటా సెంటర్‌కు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులతో కలిసి సీఎం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి, ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అమెజాన్ ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ తొలి మెట్టుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అదే సమయంలో దేశాన్ని 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా ఐదు శాతంగా ఉందని, దానిని 10 శాతానికి పెంచాలంటే భారీ పెట్టుబడులు, ఆధునిక మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాల కల్పన అవసరమని సీఎం చెప్పారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్–2047’ విజన్ పత్రాన్ని విడుదల చేసి భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించిందని వివరించారు.

అమెజాన్ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ, వచ్చే 14 ఏళ్లలో సంస్థ 7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టే ప్రణాళికలు కలిగి ఉన్నప్పటికీ, తెలంగాణ ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవాలంటే అది సరిపోదని అన్నారు. 2034 నాటికి భారత్ ఫ్యూచర్ సిటీలో రూ. లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టాలని అమెజాన్‌ను కోరారు. అమెజాన్ పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని, సంస్థ ప్రతినిధులతో ప్రతి నెల సమావేశమై పెట్టుబడి ప్రక్రియ పురోగతిని స్వయంగా సమీక్షిస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

మూడు భాగాలుగా తెలంగాణ విజన్

హైదరాబాద్‌ను కాలుష్య రహితంగా, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించినట్లు సీఎం వెల్లడించారు. హైదరాబాద్ మహానగరంలో 1.34 కోట్ల జనాభా జీవన ప్రమాణాలు మెరుగుపరచడం. ఇందులో భాగంగా కాలుష్య పరిశ్రమల తరలింపు, మూసీ నది ప్రక్షాళన చేపట్టారు. కాలుష్యం తగ్గించేందుకు 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు తెస్తున్నారు. ఈవీలకు జీరో టాక్స్ అమలు చేస్తూ ప్రభుత్వం ఏటా రూ. 1,500 కోట్ల ఆదాయాన్ని కోల్పోతోందని సీఎం తెలిపారు. ఈ ప్రాంతాన్ని సర్వీస్ సెక్టర్‌గా మార్చుతారు.పెరి అర్బన్ ఏరియానూ చైనాతో పోటీపడేలా దీనిని 'మాన్యుఫాక్చరింగ్ జోన్'గా తీర్చిదిద్దుతారు.

పెట్టుబడిదారులలో విశ్వాసం పెంచేందుకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు ఇస్తున్నామని, టూరిజం, మెడికల్, స్పోర్ట్స్ పాలసీలను తెచ్చామని సీఎం చెప్పారు. 2025 డిసెంబర్ పాలసీ మేరకే అమెజాన్‌కు భూమి కేటాయించామన్నారు. ఈ ప్రగతి ప్రయాణంలో భూములిచ్చిన రైతుల త్యాగం అమూల్యమైనదని, వారికి నష్టపరిహారం పెంచి మరింత భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్‌లు
TelanganaRising2047RevanthReddyAmazonWebServicesAWSAmazonDataCenterBharatFutureCityFutureCityHyderabadTelanganaDevelopmentDigitalInfrastructure
భారత్ ఫ్యూచర్ సిటీకి అమెజాన్ డేటా సెంటరే తొలి అడుగు: సీఎం రేవంత్ రెడ్డి - Tholi Paluku