
భారత్ పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యం: కేటీఆర్
అమెరికాలోని కొలంబియా ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ 2026లో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం పోషిస్తున్న కీలక పాత్రను వివరించారు. భారత్ ఇప్పుడు పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానమని ఆయన పునరుద్ఘాటించారు.
న్యూయార్క్‌లో జరిగిన ఈ సమావేశంలో విద్యార్థులు, నిపుణులను ఉద్దేశించి మాట్లాడిన కేటీఆర్, భారతదేశం గ్లోబల్ స్థాయిలో ప్రతిభా కేంద్రంగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు. దేశంలో విస్తారమైన మానవ వనరులు, భారీ మార్కెట్, అనుకూల విధానాలు కలిసివచ్చి అంతర్జాతీయ పెట్టుబడులకు భారత్‌ను ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చాయని వివరించారు.
భారతదేశం ప్రతి ఏడాది సుమారు 15 లక్షల ఇంజనీర్లను తయారు చేస్తోందని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టాలెంట్ పూల్స్‌లో ఒకటని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, యువ జనాభా అధికంగా ఉండటం దేశానికి దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధికి పెద్ద బలం అవుతుందని అన్నారు. దేశపు సగటు వయస్సు సుమారు 27 సంవత్సరాలే ఉండటం, 27 ఏళ్లలోపు జనాభా సుమారు 50 శాతం ఉండటం, 35 ఏళ్లలోపు జనాభా 65 శాతం ఉండటం భారత యువశక్తిని ప్రతిబింబిస్తోందని కేటీఆర్ వివరించారు.
డిజిటల్ మౌలిక సదుపాయాలు
సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ మౌలిక సదుపాయాల వల్ల ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలలో అడ్డంకులు తగ్గాయని కేటీఆర్ వివరించారు. లావాదేవీలు సులభతరం కావడంతో పాటు, వ్యాపారాలను వేగంగా విస్తరించే అవకాశం ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశం ఇకపై కేవలం తక్కువ ధరకు శ్రమ లభించే దేశం కాదని, యువ భారత్ యొక్క సామర్థ్యానికి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత డిజిటల్ అవసరాలకు అనుగుణంగా భారతదేశ విధానాలు ఉన్నాయని కేటీఆర్ వివరించారు. భారతదేశం భారీ మార్కెట్ స్కేల్‌ను అందిస్తోందని, ఇది అంతర్జాతీయ వ్యాపారాలకు పెద్ద వేదిక అని తెలిపారు.
తెలంగాణ అభివృద్ధి నమూనా
ఈ సమావేశం అనంతరం కేటీఆర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా తన భావాలను పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రం పోరాటాలు, త్యాగాల నుంచి ఉద్భవించిందని, కేసీఆర్ సమర్థవంతమైన నాయకత్వంలో కేవలం దశాబ్ద కాలంలోనే దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. కొలంబియా బిజినెస్ స్కూల్‌లో వ్యాపారం, ఆవిష్కరణలు, భవిష్యత్తు విధానాలపై జరిగిన చర్చలు ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు.
తెలంగాణ వృద్ధి పథాన్ని వివరిస్తూనే, దేశం మొత్తాన్ని ఒక సామర్థ్యం ఉన్న కేంద్రంగా ఆయన ప్రదర్శించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
