Let's talk: editor@tmv.in
భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు 45 వేల టన్నుల డీజిల్ సరఫరా

భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు 45 వేల టన్నుల డీజిల్ సరఫరా

Shaik Mohammad Shaffee
16 మార్చి, 2026

పొరుగు దేశం బంగ్లాదేశ్ తన ఇంధన అవసరాల కోసం మళ్లీ భారత్‌పైనే మొగ్గు చూపుతోంది. ఏప్రిల్ చివరి నాటికి భారతదేశం నుంచి అదనంగా 45,000 టన్నుల డీజిల్‌ను దిగుమతి చేసుకోనున్నట్లు బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీ) ఆదివారం వెల్లడించింది. ఇప్పటికే 5,000 టన్నుల డీజిల్ భారత్ నుంచి బంగ్లాకు చేరుకోగా.. మరో 5,000 టన్నులు ఈ నెల 18 లేదా 19 తేదీల్లో అందుతాయని బీపీసీ జనరల్ మేనేజర్ ముర్షెద్ హొస్సేన్ ఆజాద్ తెలిపారు.

ప్రక్రియ పూర్తికాగానే మరో 40 వేల టన్నులు

తాజాగా భారత్ నుంచి అదనంగా మరో 40,000 టన్నుల డీజిల్ దిగుమతి చేసుకోవాలనే ప్రతిపాదన వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఎల్‌సీ ఓపెన్ చేయడం వంటి ఇతర ఫార్మాలిటీలు పూర్తి కాగానే, ఏప్రిల్ నాటికి ఈ నిల్వలు కూడా బంగ్లాదేశ్‌కు చేరుకోనున్నాయి. గతంలో రెండు దేశాల మధ్య రైలు వ్యాగన్ల ద్వారా డీజిల్ రవాణా జరిగేది. అయితే 2023 మార్చిలో ప్రధాని నరేంద్ర మోడీ, అప్పటి బంగ్లా ప్రధాని షేక్ హసీనా ‘భారత్-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్’ను ప్రారంభించిన తర్వాత రవాణా మరింత సులభతరమైంది. భారత ప్రభుత్వ రంగ సంస్థ నుమలీగఢ్ రిఫైనరీ లిమిటెడ్ నుంచి బంగ్లాలోని పర్బతీపూర్ డిపోకు ఈ పైప్‌లైన్ ద్వారా క్రమం తప్పకుండా సరఫరా జరుగుతోంది.

రాజకీయ మార్పుల తర్వాత పునరుద్ధరణ

బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత ఏర్పడి, మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ పైప్‌లైన్ ద్వారా డీజిల్ దిగుమతులను నిలిపివేశారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల అనంతరం తారిఖ్ రెహ్మాన్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టాక, గత కొన్ని రోజులుగా ఈ పైప్‌లైన్ ద్వారా దిగుమతులు మళ్లీ ప్రారంభమయ్యాయి. తాజాగా 5,000 టన్నుల డీజిల్ సరఫరా కావడంతో ఇరు దేశాల మధ్య ఇంధన బంధం పునరుద్ధరించబడినట్లయింది.

తీరిన ఇంధన కష్టాలు.. రేషనింగ్ ఎత్తివేత

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల బంగ్లాదేశ్‌లో ఇంధన కొరత ఏర్పడుతుందనే భయాందోళనలు నెలకొన్నాయి. పెట్రోల్ బంకుల వద్ద భారీగా జనం క్యూ కట్టడంతో ప్రభుత్వం గతంలో చమురు అమ్మకాలపై రేషనింగ్ (నియంత్రణ) విధించింది. అయితే భారత్ నుంచి దిగుమతులు పునరుద్ధరించబడటంతో ఇప్పుడు ఆ ఆంక్షలను ప్రభుత్వం తొలగించింది. ముఖ్యంగా పవిత్ర ఈద్ పండుగ వస్తుండటంతో, ప్రజలు నగరాల నుంచి పల్లెలకు ఇబ్బంది లేకుండా ప్రయాణించేలా చూసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు 45 వేల టన్నుల డీజిల్ సరఫరా - Tholi Paluku