Let's talk: editor@tmv.in
భారత్, చైనాకు షాక్.. అమెరికా వీసాల జారీలో భారీ కోత!

భారత్, చైనాకు షాక్.. అమెరికా వీసాల జారీలో భారీ కోత!

Shaik Mohammad Shaffee
24 మార్చి, 2026

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వలస విధానాలు భారత్, చైనా పౌరులకు పెను శాపంగా మారాయి. 2024తో పోలిస్తే 2025 మొదటి ఎనిమిది నెలల్లో వీసాల జారీ ప్రక్రియలో భారీ కోత విధించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. 2024 ఏడాదితో పోలిస్తే 2025 మొదటి 8 నెలల కాలంలో ఏకంగా 2.5 లక్షల తక్కువ వీసాలను అమెరికా మంజూరు చేసింది. ఈ నిర్ణయం వల్ల అమెరికా వెళ్లాలనుకునే వేలాది మంది భారతీయుల కలలు చెదిరిపోయాయి.

11 శాతం తగ్గిన వీసాల ఆమోదం

స్టేట్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన సమాచారం ప్రకారం, 2025 జనవరి నుంచి ఆగస్టు మధ్య కాలంలో శాశ్వత నివాస (గ్రీన్ కార్డ్), తాత్కాలిక వీసాల ఆమోదం 11 శాతం మేర తగ్గింది. ముఖ్యంగా విద్యార్థులు, వృత్తి నిపుణులు, అమెరికాలో ఉంటున్న పౌరుల కుటుంబ సభ్యులకు జారీ చేసే వీసాలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పర్యాటక వీసాలను మినహాయించినప్పటికీ, మిగిలిన విభాగాల్లో భారీగా తిరస్కరణలు ఎదురవుతున్నాయి.

భారత్, చైనా అభ్యర్థులకు తీవ్ర నష్టం!

అమెరికా ఆంక్షల వల్ల భారత్, చైనా దేశస్థులే అత్యధికంగా నష్టపోయారు. 2024 ఏడాదితో పోలిస్తే ఈ రెండు దేశాల నుంచి విద్యార్థులు, కార్మికులకు జారీ చేసిన వీసాలు ఏకంగా 84 వేలు తగ్గాయి. వాణిజ్య, పర్యాటక వీసాల్లో కూడా 3.4 శాతం తగ్గుదల నమోదైంది. కేవలం ఎనిమిది నెలల్లోనే సుమారు రెండు లక్షల వీసాలను నిలిపివేయడం గమనార్హం.

విద్యార్థులపై పెను భారం

విదేశీ విద్యను అభ్యసించాలనుకునే వారి సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది. 2024లో 3.44 లక్షల స్టూడెంట్ వీసాలు జారీ చేయగా, 2025 నాటికి ఆ సంఖ్య కేవలం 2.38 లక్షలకు పరిమితమైంది. అంటే లక్షకు పైగా విద్యార్థులు అమెరికాకు దూరమయ్యారు. అలాగే విమాన, నౌకాయాన రంగ కార్మికుల వీసాల్లో 30 వేలకు పైగా, సాంస్కృతిక మార్పిడి సందర్శకుల వీసాల్లో సుమారు 29 వేల కోత విధించారు.

కుటుంబ సభ్యులకు వీసా కష్టాలు

కుటుంబ సభ్యుల కోసం ఇచ్చే 'ఫ్యామిలీ ప్రిఫరెన్స్' వీసాల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. అమెరికా పౌరుల తోబుట్టువులు, వారి పిల్లలకు ఇచ్చే వీసాలు 27 శాతం (44 వేలు) మేర తగ్గాయి. అత్యంత ఆశ్చర్యకరంగా, కాబోయే భార్య/భర్త (ఫియాన్సీ) వీసాలు సగానికి పైగా పడిపోయాయి. గత ఏడాది 37,229గా ఉన్న ఈ వీసాల సంఖ్య ఇప్పుడు కేవలం 18,894కు చేరుకుంది.

అమెరికా ప్రయోజనాలే ముఖ్యం: వైట్‌హౌస్‌

ఈ కఠిన నిర్ణయాలను అమెరికా ప్రభుత్వం సమర్థించుకుంటోంది. "అమెరికా పౌరుల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామన్న హామీతోనే అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికయ్యారు. మా నిర్ణయాలన్నీ దానిని ప్రతిబింబిస్తాయి" అని వైట్‌హౌస్ ప్రతినిధి అబిగైల్ జాక్సన్ స్పష్టం చేశారు. వీసా అనేది ఒక అవకాశం మాత్రమే కానీ హక్కు కాదని, తగిన తనిఖీలు లేకుండా ఎవరినీ దేశంలోకి అనుమతించి పౌరుల భద్రతను పణంగా పెట్టలేమని స్టేట్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.

భారత్, చైనాకు షాక్.. అమెరికా వీసాల జారీలో భారీ కోత! - Tholi Paluku