Let's talk: editor@tmv.in
భారత్ చేరిన రష్యా చమురు ట్యాంకర్.. మంగుళూరుకు టెక్సాస్‌ ఎల్పీజీ నౌక

భారత్ చేరిన రష్యా చమురు ట్యాంకర్.. మంగుళూరుకు టెక్సాస్‌ ఎల్పీజీ నౌక

Pinjari Chand
23 మార్చి, 2026

పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల మధ్య గ్లోబల్ ఇంధన సరఫరా అనిశ్చితి కొనసాగుతున్న వేళ, రష్యా చమురుతో వచ్చిన ట్యాంకర్ భారత్ చేరింది. ‘ఎంటీ అక్వా టైటాన్’ అనే ఈ నౌక ప్రస్తుతం కర్ణాటకలోని మంగళూరు తీరానికి సమీపంలో లంగరు వేసింది. మంగళూరు తీరానికి సుమారు 10 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ట్యాంకర్ అరేబియా సముద్రంలో నిలిచింది. మంగుళూరు రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్‌(ఎంఆర్పీఎల్‌) ఈ నౌకను చార్టర్ చేసుకుంది. అసలు ఈ ట్యాంకర్ శనివారం చేరాల్సి ఉండగా, ఆదివారం భారత జలాల్లోకి ప్రవేశించింది. ఇదే రోజు అమెరికాలోని టెక్సాస్ నుంచి ఎల్పీజీతో వచ్చిన మరో కార్గో నౌక న్యూ మంగుళూర్ పోర్ట్‌కుచేరింది. దీంతో ఇంధన సరఫరా కొనసాగింపునకు కొంత ఊరట లభించింది.

ఇంధన మార్కెట్లపై ఒత్తిడి

ప్రస్తుతం పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా గ్లోబల్ ఇంధన మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సరఫరా గొలుసుల్లో అంతరాయం, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు పెరగడం వల్ల చమురు అందుబాటు ప్రభావితమవుతోంది.

పోర్ట్ ఛార్జీల మాఫీ

కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రకారం, మార్చి 14 నుంచి 31 వరకు క్రూడ్ ఆయిల్, ఎల్పీజీపై కార్గో ఛార్జీలను మాఫీ చేశారు. దేశంలోని ఏ పోర్టులోనూ రద్దీ లేదని అధికారులు తెలిపారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న 22 భారత నౌకలు, 611 మంది భారతీయ నావికులు సురక్షితంగా ఉన్నారని కేంద్రం వెల్లడించింది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది.

ఇతర దిగుమతులు

ఇటీవల గుజరాత్‌లోని ముండ్రా పోర్టుకు ‘జాగ్ లాడ్కీ’ అనే భారత జెండా నౌక చేరింది. అలాగే ‘ఎంటీ శివాలిక్’, ‘ఎంటీ నందాదేవి’ అనే ఎల్పీజీ నౌకలు హర్ముజ్‌ దాటి సురక్షితంగా భారత్‌కు చేరుకున్నాయి. పశ్చిమ ఆసియా యుద్ధం నాలుగో వారంలోకి అడుగుపెట్టడంతో హార్ముజ్ మార్గంలో వాణిజ్యం ప్రభావితమవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ ఇంధన సరఫరాను స్థిరంగా ఉంచేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు, దిగుమతులపై దృష్టి సారిస్తోంది.