

భారత్ చేరిన ఎల్పీజీ ట్యాంకర్ గ్రీన్ ఆశా
పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి మధ్య భారత ఇంధన సరఫరా వ్యవస్థ తన పటిష్టతను చాటుకుంది. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించిన భారత పతాకంతో కూడిన 'గ్రీన్ ఆశా' ఎల్పీజీ నౌక క్షేమంగా నవీ ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (జేఎన్‌పీఏ)కి చేరుకుంది. 15,400 టన్నుల వంటగ్యాస్ (ఎల్పీజీ) లోడ్‌తో వచ్చిన ఈ నౌక గురువారం బీపీసీఎల్-ఐఓసీఎల్ లిక్విడ్ బెర్త్‌లో లంగరు వేసింది.
పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన తర్వాత జేఎన్‌పీఏ పోర్టుకు చేరుకున్న మొట్టమొదటి భారీ గ్యాస్ నౌక ఇదే కావడం గమనార్హం. యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయ నౌకాయానం స్తంభించిన తరుణంలో భారత నౌక విజయవంతంగా హోర్ముజ్ జలసంధిని దాటడం దేశ ఇంధన భద్రతకు నిదర్శనమని అధికారులు వెల్లడించారు. నౌకలోని సిబ్బంది, సరుకు అంతా సురక్షితంగా ఉన్నట్లు జేఎన్‌పీఏ వర్గాలు వెల్లడించాయి. ఇటీవలే 'గ్రీన్ సాన్వీ' అనే మరో నౌక కూడా ఇదే మార్గంలో భారత్‌కు చేరిన విషయం తెలిసిందే.
హోర్ముజ్ జలసంధిపై ఉత్కంఠ
ప్రపంచ ఇంధన అవసరాల్లో ఐదో వంతు వాటా కలిగిన హోర్ముజ్ జలసంధి ప్రస్తుతం ఉద్రిక్తతలకు నిలయంగా మారింది. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేసినప్పటి నుండి ఈ మార్గం ఇరాన్ నియంత్రణలో ఉంది. యుద్ధం మొదలైన సమయంలో ఈ ప్రాంతంలో 28 భారత నౌకలు ఉండగా, ఇప్పటివరకు 10 నౌకలు (పశ్చిమ వైపు నుంచి 8, తూర్పు నుంచి 2) క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకున్నాయి.
వంటగ్యాస్ సరఫరాపై ఆందోళన వద్దు: కేంద్రం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, దేశంలో వంటగ్యాస్ కొరత లేదని కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ స్పష్టం చేశారు. యుద్ధ వాతావరణం నెలకొన్న హోర్ముజ్ జలసంధి గుండా గ్యాస్ నౌకలు నిరంతరాయంగా, ఎటువంటి జాప్యం లేకుండా భారత్‌కు చేరుకుంటున్నాయని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం దేశీయంగా గ్యాస్ సరఫరా 100 శాతం సజావుగా సాగుతోందని, ఎక్కడైనా చిన్నపాటి ఇబ్బందులు ఉంటే అవి స్థానిక పంపిణీ సమస్యలే తప్ప గ్యాస్ కొరత కాదని ఆయన వివరించారు. భారత్ తన చమురు అవసరాల కోసం సుమారు 41 దేశాలపై, గ్యాస్ కోసం 30 దేశాలపై ఆధారపడుతోందని.. భవిష్యత్తులో ఇటువంటి సంక్షోభాలు ఇబ్బంది కలిగించకుండా గ్యాస్ సరఫరా వనరులను మరిన్ని దేశాలకు విస్తరిస్తున్నామని ఆయన భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ప్రతిరోజూ పరిస్థితిని సమీక్షిస్తోందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన పేర్కొన్నారు.
