
భారత్ గుడ్డిగా ఇరాన్‌కు మద్దతివ్వాలని కాంగ్రెస్ కోరుతోంది: బీజేపీ
భారత్ విదేశాంగ విధానం జాతీయ ప్రయోజనాలు, భారతీయుల భద్రత ఆధారంగా ఉండాలని, ప్రతిపక్ష పార్టీ కాలం చెల్లిన సిద్ధాంతాల ప్రభావంతో కాకూడదని బీజేపీ గురువారం కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించింది. బీజేపీ నాయకులు అమిత్ మాలవీయ, ప్రదీప్ భండారి తదితరులు కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ దేశ ప్రయోజనాల కంటే ఓటు బ్యాంక్ రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. అమిత్ మాలవీయ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో, ఇరాన్‌కు చాలా కాలంగా దౌత్య పరిరక్షణ కల్పించిన చైనా కూడా ఇప్పుడు ఇరాన్ నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం భారత్ ఇరాన్‌కు ‘గుడ్డిగా మద్దతివ్వాలి’ అని కోరుతోందని ఆయన ఆరోపించారు. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో, అక్కడ లక్షలాది మంది భారతీయులు నివసిస్తూ పనిచేస్తున్నారని కూడా మాలవీయ తెలిపారు.
ఇదిలా ఉండగా యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన జలాంతర్గామి శ్రీలంక తీరానికి సమీపంలోని అంతర్జాతీయ జలాల్లో ఒక ఇరాన్ యుద్ధనౌకను టార్పెడోతో ముంచిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం ఆశ్చర్యకరమని కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ కూడా ప్రధాని నరేంద్రమోడీ పై విమర్శలు చేశారు. పశ్చిమాసియా సంక్షోభం భారత్‌కు దగ్గరలో ఉన్నప్పటికీ ప్రధాని స్పందించలేదని ఆయన అన్నారు. దేశానికి స్థిరమైన నాయకత్వం అవసరమైన సమయంలో వ్యూహాత్మక స్వాతంత్ర్యాన్ని వదులుకున్న ప్రధానమంత్రి ఉన్నారని ఆరోపించారు.
దీనికి ప్రతిస్పందనగా బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారి మాట్లాడుతూ, భారత్ నేరుగా పాల్గొనని సంఘర్షణపై వ్యాఖ్యానించాలని కాంగ్రెస్ కోరుతోందని విమర్శించారు. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జాతీయ ప్రయోజనాల విషయంలో మౌనం పాటించిన చరిత్ర ఉందని అన్నారు. మరో బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా కూడా కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. 2010లో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆదేశాల మేరకు నక్సల్ సమస్యపై కేంద్ర మంత్రులు బహిరంగంగా వ్యాఖ్యానించకుండా ఆంక్షలు విధించారని ఆయన ఆరోపించారు. దేశం ఎదుర్కొంటున్న పెద్ద అంతర్గత భద్రతా ముప్పుపై కాంగ్రెస్ సరైన వైఖరి చూపలేదని, అప్పట్లోనూ ఇప్పుడు కూడా కాంగ్రెస్ బలహీనంగానే ఉందని బీజేపీ నేతలు విమర్శించారు.
