
భారత్ - గల్ఫ్ దేశాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందం
భారతదేశం, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం గత రెండు దశాబ్దాలుగా జరుగుతున్న చర్చలు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చాయి. గురువారం న్యూఢిల్లీలో ఇరు పక్షాలు ఈ ఒప్పందానికి సంబంధించిన ప్రాథమిక నిబంధనలపై సంతకాలు చేశాయి. దీని ద్వారా బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి ఆరు శక్తివంతమైన అరబ్ దేశాలతో భారత్ వాణిజ్య బంధం మరింత పటిష్టం కానుంది.
ఈ ఒప్పందం వల్ల భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై పన్నుల భారం గణనీయంగా తగ్గుతుంది. ముఖ్యంగా రత్నాలు, ఆభరణాలు, రసాయనాలు, ఆహార ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతిదారులకు గల్ఫ్ మార్కెట్‌లో భారీ అవకాశాలు లభిస్తాయి. ఇప్పటికే ఈ దేశాలతో భారత్ నిర్వహిస్తున్న ద్వైపాక్షిక వాణిజ్యం విలువ సుమారు 179 బిలియన్ డాలర్లుగా ఉంది, ఈ కొత్త ఒప్పందంతో అది మరింత పెరగనుంది.
'వికసిత్ భారత్' దిశగా అడుగు:
కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, ఈ ఒప్పందం భారత్ 2047 నాటికి 'వికసిత్ భారత్'గా ఎదగాలనే లక్ష్యానికి ఎంతో తోడ్పడుతుందని పేర్కొన్నారు. అమెరికా, యూరోపియన్ యూనియన్‌లతో కుదుర్చుకున్న కీలక ఒప్పందాల తర్వాత, గల్ఫ్ దేశాలతో ఈ డీల్ కుదరడం భారత్ ఆర్థిక శక్తికి నిదర్శనమని ఆయన అన్నారు. ఇది రైతులకు, చిన్న పరిశ్రమలకు యువతకు కొత్త ఉపాధి మార్గాలను చూపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.భారత్ ఇప్పటికే రికార్డు స్థాయిలో 8 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. అమెరికాతో జరగబోయే 9వ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
5000 ఏళ్ల బంధం.. సరికొత్త రూపం:
భారత్, గల్ఫ్ ప్రాంతం మధ్య వాణిజ్య సంబంధాలు దాదాపు 5,000 ఏళ్ల నాటివని, ఈ ఒప్పందం ఆ చారిత్రక బంధాన్ని ఆధునిక అవసరాలకు అనుగుణంగా మారుస్తుందని మంత్రి అభివర్ణించారు. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న కోటి మంది భారతీయులు రెండు ప్రాంతాల మధ్య 'జీవన వారధి'గా ఉంటూ ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తున్నారని ఆయన కొనియాడారు.
గ్లోబలైజేషన్ పట్ల కొన్ని దేశాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో, ఈ ఒప్పందం ప్రపంచానికి ఒక బలమైన సంకేతాన్ని పంపిస్తుందని జిసిసి ప్రతినిధి రాజా అల్ మర్జూకి తెలిపారు. మొదటి రౌండ్ చర్చల కోసం భారత బృందాన్ని రియాద్‌కు ఆహ్వానిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ఒప్పందం వల్ల అస్థిరంగా ఉన్న గ్లోబల్ ఎకానమీలో స్థిరత్వం ఏర్పడుతుందని ఇరు దేశాలు భావిస్తున్నాయి.
