Let's talk: editor@tmv.in
భారత్‌ - ఒమన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

భారత్‌ - ఒమన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

Shaik Mohammad Shaffee
19 డిసెంబర్, 2025

భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల ఒమన్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ పర్యటనలో భాగంగా భారత్, ఒమన్ దేశాల మధ్య వ్యాపారం, వ్యవసాయం, విద్య, సముద్ర భద్రత వంటి ముఖ్యమైన విషయాలపై కీలక ఒప్పందాలు కుదిరాయి. అన్నింటికంటే ముఖ్యంగా 'సీఈపీఏ' (సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం) అనే ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. దీనివల్ల మన దేశం నుండి ఒమన్‌కు పంపే దాదాపు 98 శాతం వస్తువులపై ఇకపై ఎలాంటి పన్నులు (డ్యూటీ) ఉండవు. ఫలితంగా మన దేశ వ్యాపారం పెరగడమే కాకుండా, యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది.

సీఈపీఏ వల్ల లాభాలు

భారత్-ఒమన్ మధ్య కుదిరిన 'సీఈపీఏ' ఒప్పందం వల్ల సాధారణ ప్రజలకు ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా భారతదేశంలో తయారయ్యే బట్టలు, నగలు, మందులు, వ్యవసాయ ఉత్పత్తులు ఒమన్‌లో తక్కువ ధరకే లభిస్తాయి, దీనివల్ల ఎగుమతులు పెరిగి మన రైతులకు, వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. అలాగే భారతీయ కంపెనీలు ఒమన్‌లో నేరుగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉండటంతో ఐటీ, వైద్యం, విద్య వంటి రంగాల్లో పనిచేసే భారతీయులకు అక్కడ మెరుగైన ఉపాధి లభిస్తుంది. ఒమన్‌లో ఉండే భారతీయులకు ఉద్యోగ భద్రతతో పాటు ఎక్కువ కాలం ఉండేందుకు వీసా సౌకర్యాలు కూడా మెరుగుపడతాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 10 బిలియన్ డాలర్లకు పైగా ఉంది, ఈ కొత్త ఒప్పందంతో ఇది ఇంకా పెరిగి రెండు దేశాల ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని అంచనా

సముద్ర సహకారం, వ్యవసాయం, విద్యలో ఒప్పందాలు

ఈ పర్యటనలో మరికొన్ని ముఖ్య ఒప్పందాలు కూడా కుదిరాయి. ముఖ్యంగా సముద్ర భద్రత విషయంలో ఇరు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. మన దేశంలోని 'లోథల్'లో కడుతున్న సముద్ర వారసత్వ మ్యూజియం అభివృద్ధికి ఒమన్ సహకారం అందించనుంది. ఇక రైతుల విషయానికి వస్తే.. పంటల సాగు, పశుపోషణ, చేపల పెంపకంలో కొత్త సాంకేతికతను పంచుకోవడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. ముఖ్యంగా మన సిరిధాన్యాల (మిల్లెట్స్) సాగును పెంచడం, వాటిపై పరిశోధనలు చేయడం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. చదువుకునే విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్లి కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కలిసి పరిశోధనలు చేయడానికి ఈ ఒప్పందాలు ఎంతగానో ఉపయోగపడతాయి.

ప్రధాని మోడీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’

ఈ పర్యటనలో మరో విశేష.. ప్రధాని నరేంద్ర మోడీకి ఒమాన్ దేశం తన అత్యున్నత పౌర పురస్కారమైన “ఆర్డర్ ఆఫ్ ఒమన్ (ఫస్ట్ క్లాస్)”ను ప్రదానం చేసింది. భారత్- ఒమన్ దేశాల మధ్య స్నేహ బంధాన్ని, సంబంధాలను మరింత బలోపేతం చేసినందుకు గాను మోడీకి ఈ అరుదైన గౌరవం దక్కింది. మన దేశ ప్రధాని ప్రపంచ దేశాల నుండి అందుకున్న 29వ అంతర్జాతీయ గౌరవం ఇది కావడం విశేషం. ఈ పురస్కారం కేవలం మోడీకి మాత్రమే కాదు, మొత్తం భారత దేశానికే గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, “భారత్–ఒమాన్ మధ్య శతాబ్దాల నాటి సముద్ర సంబంధాలకు గుర్తింపు ఇది. ఈ గౌరవాన్ని భారత ప్రజలకు అంకితం చేస్తున్నాను” అని అన్నారు. ఈ పర్యటనతో భారత్–ఒమాన్ దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయ్యాయి. వాణిజ్యం, ఇంధనం, రక్షణ, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలను మరింత బలపర్చుకోవాలని ఇరు దేశాల నాయకులు నిర్ణయించారు.

మూడు దేశాల పర్యటన ముగింపు

ఒమన్ సందర్శనతో ప్రధాని మోడీ మూడు దేశాల (జోర్డాన్, ఇథియోపియా, ఒమన్) పర్యటన విజయవంతంగా పూర్తయింది. ఈ పర్యటన ద్వారా ఆయా దేశాలతో భారత్ స్నేహం మరింత బలపడింది. దీనివల్ల అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ గౌరవం పెరగడమే కాకుండా, వ్యాపార, రక్షణ రంగాల్లో మన దేశానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మూడు దేశాలతో కుదిరిన ఒప్పందాలు భవిష్యత్తులో మన ఆర్థిక ఎదుగుదలకు ఎంతో కీలకం కానున్నాయని పేర్కొన్నారు.

భారత్‌ - ఒమన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం - Tholi Paluku