
భారత్ ఐదు వేల ఏళ్ల క్రితమే సముద్ర వాణిజ్యం చేసింది: అమిత్ షా
భారతదేశ సముద్రయానం, నౌకాదళ సామర్థ్యం ‘ఇండో-పసిఫిక్’ ప్రాంతం ‘గ్లోబల్ సౌత్’ మధ్య కీలక వంతెనగా వ్యవహరిస్తున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ముంబైలో సోమవారం ప్రారంభమైన నాలుగో ఇండియా మేరిటైమ్ వీక్–2025 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఇండియా మేరిటైమ్ వీక్–2025(సముద్ర రంగానికి, పోర్టుల అభివృద్ధికి, నౌకాయాన పరిశ్రమకు సంబంధించి). కార్యక్రమాన్ని పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్‌వేస్ మంత్రిత్వ శాఖ అక్టోబర్ 27 నుంచి 31 వరకు ముంబైలోని నెస్కో గ్రౌండ్స్‌లో నిర్వహిస్తోంది.
భారతదేశ సముద్ర చరిత్రకి 5,000 ఏళ్ల నాటి పూర్వ వైభవం కలిగి ఉంది. లోథల్ నౌకాశ్రయం నుంచి ఈజిప్ట్ వరకు వాణిజ్యం చేసినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ సముద్రయానంలో చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. వంద పైగా దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు భారత సముద్ర వాణిజ్యం ఈ రోజుకి కూడా ప్రపంచ వాణిజ్యానికి కేంద్రంగా ఉందని గుర్తించాల్సిన అవసరం ఉంది. 10 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఇక్కడికి వచ్చిన సుమారు 350 కంపెనీలకు పైగా ప్రతినిధులు ఇక్కడ ఉన్నారన్నారు. సముద్ర వాణిజ్యాన్ని నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. ఇతర దేశాలతో వాణిజ్య మండళ్లు ఏర్పాటు చేయడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు.
ఈ సదస్సు ‘గేట్‌వే ఆఫ్ ఇండియా’ని ‘గేట్‌వే ఆఫ్ ది వరల్డ్’గా మార్చే ఆలోచనలకు వేదిక అవుతుందని అన్నారు. గత దశాబ్దం నుంచి సముద్ర రంగంలో తీసుకున్న నిర్మాణాత్మక సంస్కరణలతో భారత్ ప్రపంచ సముద్ర పటంలో శక్తివంతమైన దేశంగా ఎదిగిందని ఆయన గర్వంగా చెప్పారు.
భారత తీరరేఖ సుమారు 11,000 కిలోమీటర్ల పొడవు ఉండగా, దేశానికి 13 తీర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయని షా వివరించారు. సముద్ర వ్యాపారం దేశ జీడీపీకి సుమారు 60 శాతం వరకు వాటా కల్పిస్తోందని చెప్పారు. భారత సముద్ర బలం, వ్యూహాత్మక స్థానమే ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. 23.7 లక్షల చ.కి.మీ.ల ప్రత్యేక ఆర్థిక మండలాలు ఉన్నాయి. సుమారు 800 మిలియన్ల మంది తీరప్రాంత రాష్ట్రాల్లో నివసిస్తున్నారు. ఇండియన్ ఓషన్ ప్రాంతంలోని 28 దేశాలు ప్రపంచ ఎగుమతుల్లో సుమారు 12 శాతం వాటా కలిగివున్నాయి అని ఆయన వివరించారు.
