Let's talk: editor@tmv.in
భారత్ ఏఐ విజన్: 'ఏఐ-ఎంఈటి ' వైట్ పేపర్‌ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

భారత్ ఏఐ విజన్: 'ఏఐ-ఎంఈటి ' వైట్ పేపర్‌ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

Dantu Vijaya Lakshmi Prasanna
21 ఫిబ్రవరి, 2026

భారత పారిశ్రామిక రంగాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో, కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ఒక కీలక అడుగు వేశారు. న్యూఢిల్లీలో జరిగిన 'భారత్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026'లో భాగంగా, తయారీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని వేగవంతం చేసేందుకు "ఏఐ ఫర్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ (ఏఐ-ఎ౦ఈటి)" అనే వైట్ పేపర్ కాన్సెప్ట్‌ను ఆయన ఆవిష్కరించారు.

అంతర్జాతీయ నిపుణుల భాగస్వామ్యం

ఈ వ్యూహాత్మక సమావేశం కేవలం ప్రభుత్వానికే పరిమితం కాకుండా, ప్రపంచ స్థాయి విద్యాసంస్థలు, పరిశ్రమల మేధావుల కలయికగా నిలిచింది. అమెరికాలోని ప్రతిష్టాత్మక ఎంఐటి (మాసచుసెట్స్ ఇన్స్టిట్యూట్ఆఫ్ టెక్నాలజీ) ఛాన్సలర్ డాక్టర్ ఎరిక్ గ్రిమ్సన్, ఐఐటీ మద్రాస్ ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. పరిశ్రమ, విద్యాసంస్థలు, ప్రభుత్వం కలిసి పనిచేస్తేనే సాంకేతిక విప్లవం సాధ్యమవుతుందని ఈ సమావేశం చాటిచెప్పింది.

పరిశ్రమల దిగ్గజాల సమక్షంలో..

మైక్రోసాఫ్ట్ ఇండియా, టాటా ఎలక్ట్రానిక్స్, సిస్కో, హిటాచీ ఎనర్జీ, రాక్‌వెల్ ఆటోమేషన్ వంటి దిగ్గజ కంపెనీల సీఈఓలు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తయారీ రంగంలో ఏఐని కేవలం ఒక సాఫ్ట్‌వేర్‌లా కాకుండా, ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచే ఒక 'ఫౌండేషనల్ ఎనేబులర్' గా ఈ ప్రతినిధులు అభివర్ణించారు.

'వికసిత్ భారత్' విజన్

ఈ సందర్భంగా మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, 2047 నాటికి 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారత్) లక్ష్యాన్ని చేరుకోవడంలో ఏఐ ఒక కీలక పునాది అని పేర్కొన్నారు. తయారీ రంగంలో ఏఐని అనుసంధానించడం ద్వారా పరిశ్రమల సామర్థ్యం పెరగడమే కాకుండా, నూతన ఆవిష్కరణలకు, స్టార్టప్‌లకు భారీ అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎంఎస్ఎంఈ లకు పెద్దపీట

ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ ఏఐ ఎకోసిస్టమ్ కేవలం పెద్ద కంపెనీలకే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కూడా అందుబాటులో ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. చిన్న పరిశ్రమలు కూడా ఏఐ సాంకేతికతను సులభంగా స్వీకరించేలా మౌలిక సదుపాయాలను కల్పిస్తామని, దీనివల్ల క్షేత్రస్థాయిలో మార్పు వస్తుందని ఆయన వివరించారు.

ఈ మొత్తం కార్యక్రమాన్ని నామ్‌‌టెక్ సంస్థ సమన్వయం చేస్తోంది. పరిశ్రమలు, ప్రభుత్వం విద్యావేత్తలు కలిసి పని చేసేందుకు 'మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ’ అనే ప్లాట్‌ఫారమ్‌ను రూపొందిస్తున్నారు. ఇది దేశంలో తయారీ రంగానికి అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడమే కాకుండా, డీకార్బనైజేషన్ (పర్యావరణ హితం) లక్ష్యాలను కూడా చేరుకోవడంలో సహాయపడుతుంది.

ఈ సమావేశంలో పాల్గొన్న మైక్రోసాఫ్ట్, సిస్కో వంటి సంస్థల ప్రతినిధులు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. ఏఐ సాంకేతికత అందుబాటులోకి వచ్చినా, దానిని వాడగలిగే నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి లేకపోతే ప్రయోజనం ఉండదని వారు అభిప్రాయపడ్డారు. అందువల్ల, విద్యాసంస్థల్లోని పాఠ్యాంశాలను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మార్చాలని 'డే-జీరో' నుంచే పనిలో చేరగలిగే సామర్థ్యం విద్యార్థులకు ఉండాలని సూచించారు.

భారతదేశం కేవలం సాంకేతికతను వాడే దేశంగానే కాకుండా, ప్రపంచానికి అవసరమైన 'ప్రిసిషన్ ఎక్విప్‌మెంట్'ను తయారు చేసే దేశంగా ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. నామ్‌‌టెక్ వంటి సంస్థలు భవిష్యత్తు తరాన్ని సిద్ధం చేయాలని కోరారు. తద్వారా భారత్ ప్రపంచ తయారీ మ్యాప్‌లో అత్యున్నత స్థానానికి చేరుకుంటుందని ఈ సమావేశం తీర్మానించింది.

భారత్ ఏఐ విజన్: 'ఏఐ-ఎంఈటి ' వైట్ పేపర్‌ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ - Tholi Paluku