
భారత్ - ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తుది దశకు
2022లో తిరిగి ప్రారంభమైన భారత్-యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చలు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. జనవరి 27న న్యూఢిల్లీలో జరిగే శిఖరాగ్ర సమావేశంలో ఈ ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశానికి ఈయూ నాయకులు భారత గణతంత్ర దినోత్సవ అతిథులుగా హాజరుకానున్నారు.
ఈ ఒప్పందానికి సంబంధించి ముఖ్యాంశాలు:
ఈ ఒప్పందం ద్వారా వాణిజ్య వృద్ధి ఏటా 120 బిలియన్ల డాలర్ల మేర జరిగే అవకాశం ఉంది. ద్వైపాక్షిక వాణిజ్యానికి ఈ ఒప్పందం ఇరుపక్షాలకు పరస్పర ప్రయోజనాలను చేకూరుస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.
దీనివల్ల భారతీయ టెక్స్‌టైల్స్ (జౌళి), ఫార్మాస్యూటికల్స్ (ఔషధాలు), ఆటో విడిభాగాల రంగాలు భారీగా పుంజుకోనున్నాయి. డైరీ ఉత్పత్తులు, కార్బన్ నిబంధనల వంటి సున్నితమైన అంశాలను, దేశ ప్రయోజనాలకు విఘాతం కలగకుండానే చర్చల ద్వారా పరిష్కరిస్తున్నారు.
ఈయూలోని మొత్తం 27 సభ్య దేశాలు ఈ ఒప్పందానికి మద్దతు తెలిపాయి. 2014 నుండి అభివృద్ధి చెందిన దేశాలతో భారత్ కుదుర్చుకున్న ఏడు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలలో ఇది అత్యంత కీలకమైనదిగా నిలుస్తుంది.
భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య కుదరబోతున్న ఈ చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గత మూడు ఏళ్లుగా సాగుతున్న కఠినమైన చర్చల అనంతరం ఈ నెల 27న న్యూఢిల్లీలో జరగబోయే శిఖరాగ్ర సమావేశంలో దీనిపై కీలక ప్రకటన వెలువడనుంది.
ఈ ఒప్పందాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ' అన్ని ఒప్పందాలకూ తల్లి ' గా అభివర్ణించారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదిక ప్రకారం,
2013లో ఆగిపోయిన చర్చలను 2022లో తిరిగి ప్రారంభించారు. సుమారు 3 ఏళ్లుగా 24 విభాగాల్లో చర్చలు జరగ్గా, ఇప్పటికే 20 విభాగాల్లో ఏకాభిప్రాయం కుదిరింది. భారత ప్రధాని మోదీ, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, ఈయూ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా మధ్య న్యూఢిల్లీలో జరిగే 16వ భారత్, ఈయూ శిఖరాగ్ర సమావేశంలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈయూ నేతలు ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథులుగా రావడం ఈ ఒప్పందం యొక్క ప్రాధాన్యతను చాటుతోంది.
అత్యంత భారీ ఒప్పందం
2024-25లో భారత్-ఈయూ మధ్య వస్తువుల వాణిజ్యం 136.53 బిలియన్ల డాలర్లకు చేరింది. ఈ ఒప్పందం ద్వారా ఇది మరో 50% పైగా పెరిగే అవకాశం ఉంది. ఈయూ దేశాల నుండి భారత్‌కు ఇప్పటివరకు సుమారు 117 బిలియన్ల డాలర్ల ఎఫ్‌డీఐ వచ్చింది. సుమారు 6,000 ఈయూ కంపెనీలు భారత్‌లో ఉన్నాయి. ఒప్పందం తర్వాత హై-టెక్, సెమీకండక్టర్స్ గ్రీన్ ఎనర్జీ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు రానున్నాయి.
చర్చల్లోని కీలకమైనఅంశాలు
ఈ ఒప్పందం కోసం ప్రతి క్లాజుపైన లోతైన చర్చలు జరిగాయి. ఈయూ ప్రవేశపెట్టిన కార్బన్ బోర్డర్ టాక్స్ వల్ల భారతీయ ఉక్కు, అల్యూమినియం ఎగుమతులపై భారం పడకుండా భారత్ రాయితీలు కోరింది. భారతీయ రైతుల ప్రయోజనాల దృష్ట్యా డైరీ రంగానికి రక్షణ కల్పిస్తూనే, యూరోపియన్ వైన్, స్పిరిట్స్ (మద్యం) పై టారిఫ్‌లను తగ్గించడానికి భారత్ అంగీకరించే అవకాశం ఉంది. భారతీయ ఐటీ నిపుణులు, ఇంజనీర్ల కోసం ఈయూ దేశాల్లో సులభమైన వీసా నిబంధనలను భారత్ డిమాండ్ చేస్తోంది.
ప్రస్తుతం భారతీయ వస్త్రాలపై ఉన్న 12-16% సుంకాలు తొలగించడం వల్ల వియత్నాం, బంగ్లాదేశ్‌లతో పోటీని ఎదుర్కోవచ్చు.
ఈ ఒప్పందం ద్వారా భారత్‌కు కలిగే లాభం, టెక్స్‌టైల్స్ & లెదర్ సుంకాల రద్దు వల్ల ఎగుమతులు భారీగా పెరుగుతాయి. ఫార్మా (ఔషధాలు), యూరప్ మార్కెట్లోకి భారతీయ జనరిక్ మందులకు సులభమైన ప్రవేశం లభిస్తుంది. ఆటో విడిభాగాలు, యూరోపియన్ కార్ల తయారీ కేంద్రాలకు భారత్ కీలక సరఫరాదారుగా మారుతుంది. సేవల రంగం ద్వారా ఐటీ, టెలికాం రవాణా రంగాల్లో భారతీయ నిపుణులకు అవకాశాలు పెరుగుతాయి.
వ్యూహాత్మక ప్రాముఖ్యత
ఈ ఒప్పందం కేవలం వాణిజ్యం మాత్రమే కాదు, చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారత్, ఈయూ రెండూ దీనిని ఒక రక్షణ కవచంగా చూస్తున్నాయి. అలాగే, అమెరికా వాణిజ్య విధానాల్లో వస్తున్న మార్పుల నేపథ్యంలో భారత్ తన ఎగుమతులను వైవిధ్యపరచుకోవడానికి ఇది గొప్ప అవకాశం.
జనవరి 27న వెలువడే సంయుక్త ప్రకటనలో ఏయే వస్తువులపై సుంకాలు తగ్గుతాయి కార్బన్ టాక్స్ విషయంలో ఈయూ భారత్‌కు ఎలాంటి మినహాయింపులు ఇస్తుందనే పూర్తి వివరాలు బయటకు వస్తాయి. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే అది భారత జిడిపి వృద్ధికి ఉద్యోగ కల్పనకు దోహదపడుతుంది.
