
భారత్ - అమెరికా మధ్య చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం: ఎన్. రామచందర్ రావు
భారతదేశ ఆర్థిక చరిత్రలో ఒక మైలురాయి వంటి నిర్ణయం వెలువడింది. భారత్–అమెరికా దేశాల మధ్య 'మధ్యంతర వాణిజ్య ఒప్పంద ముసాయిదా' కుదిరింది. ఈ చారిత్రాత్మక ఒప్పందం వల్ల భారతదేశ ప్రపంచ ఆర్థిక ముద్ర మరింత విస్తరించడమే కాకుండా, దేశంలో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
శనివారం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో స్పందించిన రామచందర్ రావు, ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టి నాయకత్వంలో భారత్–అమెరికా మధ్య ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్లో పోటీ సామర్థ్యం పెరుగుతుందని, ముఖ్యంగా రత్నాలు, వజ్రాలు, ఔషధాలు, విమాన భాగాలు వంటి అధిక విలువ కలిగిన ఉత్పత్తులకు సున్నా సుంకం (జీరో టారిఫ్) అవకాశాలు లభించడం ఒక పెద్ద ప్రయోజనమని అన్నారు.
ఈ ఒప్పందం భారతీయ ఎంఎస్‌ఎంఈలు, రైతులు, మత్స్యకారులు, చిన్న వ్యాపారాలకు 30 ట్రిలియన్ డాలర్ల గ్లోబల్ మార్కెట్‌కు చేరుకునే మార్గాన్ని సుగమం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. పెట్టుబడులు పెరగడం, కార్మిక ఆధారిత రంగాలు బలోపేతం కావడం, మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలు పెరగడం వంటి ప్రయోజనాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఒప్పందం నేపథ్యం
ఫిబ్రవరి 6న భారత్–అమెరికా పరస్పర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్‌కు సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌పై అంగీకరించినట్లు సంయుక్త ప్రకటనలో వెల్లడైంది. 2025 ఫిబ్రవరి 13న ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ప్రారంభమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలకు ఇది కొనసాగింపుగా నిలుస్తోంది. అలాగే సరఫరా గొలుసులను మరింత బలోపేతం చేయడం, మార్కెట్ యాక్సెస్‌ను విస్తరించడం వంటి అంశాలపై రెండు దేశాలు కలిసి పనిచేయనున్నట్లు పేర్కొంది.
ఒప్పందం ప్రకారం అమెరికా భారతదేశం నుంచి ఎగుమతి ఉత్పత్తులపై పరస్పర సుంకాన్ని 18 శాతానికి తగ్గించనుంది. టెక్స్టైల్స్, దుస్తులు, లెదర్, ఫుట్‌వేర్, ప్లాస్టిక్, రబ్బర్, ఆర్గానిక్ కెమికల్స్, హోమ్ డెకర్, హస్తకళ ఉత్పత్తులు కొన్ని యంత్రాంగ ఉత్పత్తులు ఈ పరిధిలోకి వస్తాయి. భవిష్యత్తులో ఒప్పందం పూర్తిగా అమలులోకి వచ్చిన తర్వాత కొన్ని కీలక రంగాలపై సుంకాలు పూర్తిగా తొలగించే అవకాశముందని సమాచారం.
వికసిత భారత్ లక్ష్యంగా
ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం పరుగులు పెడుతోందని, ఇది 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుందని రామచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. దేశాభివృద్ధికి చారిత్రాత్మక మార్గాలను సుగమం చేసినందుకు గాను ఆయన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఒప్పందం వల్ల సరఫరా గొలుసు మరింత పటిష్టంగా మారుతుందని, ఇది దీర్ఘకాలిక ఆర్థిక సాధికారతకు బాటలు వేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
