Let's talk: editor@tmv.in
భారత్, అమెరికా మద్య పది సంవత్సరాల కీలక రక్షణ ఒప్పందం

భారత్, అమెరికా మద్య పది సంవత్సరాల కీలక రక్షణ ఒప్పందం

Dantu Vijaya Lakshmi Prasanna
1 నవంబర్, 2025

ఆసియన్ రక్షణ మంత్రుల సమావేశం-ప్లస్ సదస్సు మలేషియాలోని కౌలాలంపూర్ లో జరిగింది. ఈ సదస్సుకి రాజ్ నాథ్ సింగ్ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. అక్కడ భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అమెరికా రక్షణ కార్యదర్శి (సెక్రటరీ ఆఫ్ వార్) పీట్ హెగ్‌సెత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య పది సంవత్సరాల రక్షణ ఫ్రేమ్‌వర్క్ ఒప్పందానికి అధికారిక రూపం ఇవ్వబడింది, ఇది భారత్-అమెరికా వ్యూహాత్మక, రక్షణ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఒక ముఖ్యమైన ముందడుగు.

సమావేశంలోని ముఖ్య వివరాలు

ఇరుపక్షాల సీనియర్ అధికారుల సమక్షంలో సంతకం చేయబడిన ఈ ఒప్పందం ఇండో-పసిఫిక్ ప్రాంతం అంతటా సైనిక సహకారం, సామర్థ్యాల పెంపు, ఉమ్మడి ప్రాజెక్టులపై దృష్టి సారించిన దీర్ఘకాలిక ప్రణాళికను ఏర్పాటు చేస్తుంది. ఈ ఒప్పందంపై సంతకం చేయడాన్ని రాజ్‌నాథ్ సింగ్ ద్వైపాక్షిక రక్షణ సంబంధాలలో "కొత్త అధ్యాయానికి" నాందిగా అభివర్ణించారు.

రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, "మేము మూడుసార్లు టెలిఫోన్‌లో సంభాషించాము. ఏడిఎమ్ఎమ్-ప్లస్ సదస్సు సందర్భంగా మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవడం నాకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా, రక్షణ ఫ్రేమ్‌వర్క్ సంతకంతో నేడు ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని నేను భావిస్తున్నాను. మీ నాయకత్వంలో, భారత్- అమెరికా సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని నేను విశ్వసిస్తున్నాను" అని తెలిపారు.

భాగస్వామ్యంపై హెగ్‌సెత్ వ్యాఖ్యలు

హెగ్‌సెత్ ఈ ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని అభినందిస్తూ, ఈ ఒప్పందం ఢిల్లీ, వాషింగ్టన్ మధ్య అభివృద్ధి చెందుతున్న సంబంధంలో ఒక నిర్ణయాత్మక ఘట్టం అని పేర్కొన్నారు.

"భారత్‌తో మాకున్న భాగస్వామ్యానికి రక్షణమంత్రి రాజనాథ్ సింగ్‌కు నా కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. ఇది ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన అమెరికా-భారత్ సంబంధాలలో ఒకటి. మా వ్యూహాత్మక అనుసంధానం ఉమ్మడి ప్రయోజనాలు, పరస్పర విశ్వాసం, సురక్షితమైన, సంపన్నమైన ఇండో-పసిఫిక్ ప్రాంతానికి కట్టుబడి ఉండటంపై ఆధారపడి ఉంది" అని ఆయన అన్నారు.

"ఈ 10 సంవత్సరాల అమెరికా-భారత్ రక్షణ ఫ్రేమ్‌వర్క్ అత్యంత ఆశావహంగా ఉంది. ఇది మన రెండు సైన్యాలకు ఒక ముఖ్యమైన ముందడుగు, మరింత లోతైన, మరింత అర్థవంతమైన సహకారానికి ఒక ప్రణాళిక. ఇది మా ఉమ్మడి భద్రత, మా బలమైన భాగస్వామ్యానికి అమెరికా యొక్క దీర్ఘకాలిక నిబద్ధతను నొక్కి చెబుతుంది."అన్నారు.

ప్రస్తుత ఒప్పందానికి సంబందించిన అంశాలు

2005లో భారత - అమెరికా రక్షణ ఒప్పందం రెండు దేశాల మధ్య వ్యూహాత్మక నమ్మకానికి బాట వేసింది. అయితే 2025లో కుదిరిన కొత్త ఫ్రేమ్‌వర్క్‌ రక్షణ రంగాన్ని సాంకేతిక, వ్యూహాత్మక దిశలో ముందుకు నడిపిస్తోంది. కృత్రిమ మేధస్సు, సైబర్‌ సెక్యూరిటీ, అంతరిక్ష సాంకేతికత, క్వాంటమ్‌ పరిశోధన వంటి రంగాల్లో సహకారం విస్తరించగా, “మేక్ ఇన్ ఇండియా”తో పాటు జిఇ-ఎచ్ఏఎల్ ఇంజిన్‌ ప్రాజెక్టులు దేశీయ స్వావలంబనకు దారి చూపుతున్నాయి. బిఇసిఏ, సిఓఎమ్ సిఏఎస్ఏ ఒప్పందాల ద్వారా ఉపగ్రహ నిఘా సమాచార మార్పిడి సాధ్యమై, భారతదేశం ఇండో–పసిఫిక్ వ్యూహంలో కీలక పాత్రధారిగా నిలుస్తోంది.

రాజ్‌నాథ్ సింగ్ సందేశం

సమావేశం తర్వాత, రాజనాథ్ సింగ్ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) లో పంచుకుంటూ, "ఈ రక్షణ ఫ్రేమ్‌వర్క్ భారత్-అమెరికా రక్షణ సంబంధాల మొత్తం అంశాలకు విధానపరమైన దిశానిర్దేశం చేస్తుంది. ఇది మా పెరుగుతున్న వ్యూహాత్మక సమన్వయానికి సంకేతం అన్నారు.

భారత - అమెరికా రక్షణ ఒప్పందాల చరిత్ర ఒకసారిచూస్తే .

భారత్ –అమెరికాల మధ్య రక్షణ సహకారం దశాబ్దాలుగా కొనసాగుతోంది. 1995లో రక్షణ సంబంధాలపై అంగీకరించిన ఒప్పందం ద్వారా ఈ ప్రయాణం మొదలైంది. దీని ప్రధాన ఉద్దేశం రెండు దేశాల మధ్య సైనిక అవగాహన పెంచడం, సంయుక్త శిక్షణలు నిర్వహించడం, పరస్పర నమ్మకాన్ని బలపరచడం. అనంతరం 2005లో 10 సంవత్సరాల రక్షణ ఫ్రేమ్‌వర్క్‌ కుదిరి కొత్త దిశ చూపింది. దాంతో సాంకేతిక మార్పిడి, సంయుక్త సాధనాలు, శాంతి భద్రతా చర్యల్లో సహకారం పెరిగింది. ఈ ఒప్పందం తరువాత 2016 నుంచి 2020 మధ్య లాజిస్టిక్స్‌, సమాచార భద్రతా, ఉపగ్రహ సమాచార మార్పిడి వంటి కీలక ఒప్పందాలు కుదిరాయి. వీటివల్ల సైనిక స్థావరాల వినియోగం, ఉపగ్రహ నిఘా సమాచారం పంచుకోవడం, క్షిపణి వ్యవస్థల నావిగేషన్‌ సామర్థ్యం పెరిగాయి. 2025లో కుదిరిన కొత్త ఫ్రేమ్‌వర్క్‌ మరింత ఆధునికంగా, వ్యూహాత్మకంగా రూపుదిద్దుకుంది. ఇందులో రక్షణ సాంకేతికత, కృత్రిమ మేధస్సు, సైబర్‌ భద్రత, సముద్ర భద్రత వంటి రంగాల్లో సమన్వయాన్ని పెంపు లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం, చైనా ప్రభావాన్ని ఎదుర్కొనే దిశగా రెండు దేశాలు కలిసి వ్యూహాత్మక చర్యలు చేపడుతున్నాయి. మొత్తంగా, ఈ సహకారం భారతదేశ రక్షణ స్వావలంబనకు దారితీస్తోంది.

ఇతర అంశాలు

రాజనాథ్ సింగ్ మలేషియా పర్యటనలో మలేషియా రక్షణ మంత్రి ఖాలెడ్ నార్డిన్‌తో ప్రాంతీయ శాంతి మరియు ఉగ్రవాద నిరోధక ప్రయత్నాలపై దృష్టి సారించిన సెషన్లలో ప్రత్యేకంగా పాల్గొంటారు.

ఇండో-పసిఫిక్ చట్రంలో స్థిరత్వం, సహకారాన్ని పెంపొందించడంలో న్యూఢిల్లీ యొక్క పెరుగుతున్న భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తూ, ఉగ్రవాద నిరోధం కోసం నిపుణుల వర్కింగ్ గ్రూప్‌కు 2024-2027 కాలానికి భారత్ మరియు మలేషియా ప్రస్తుతం సహ-అధ్యక్షులుగా పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ చర్చలు ప్రాముఖ్యత సంతరించుకుంటున్నాయి.