Let's talk: editor@tmv.in
భారత్‌ అభివృద్ధి నమూనా ప్రపంచ దక్షిణ దేశాలకు ఆదర్శం: కేంద్ర మంత్రి మాండవీయ

భారత్‌ అభివృద్ధి నమూనా ప్రపంచ దక్షిణ దేశాలకు ఆదర్శం: కేంద్ర మంత్రి మాండవీయ

Shaik Mohammad Shaffee
7 నవంబర్, 2025

భారతదేశ అభివృద్ధి నమూనా ప్రపంచ దక్షిణ దేశాలకు అనుసరణీయ ఆదర్శంగా ఉందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ప్రకటించారు. గత దశాబ్ద కాలంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో 25 కోట్ల మంది ప్రజలను బహుముఖ పేదరికం నుండి బయటపడేయడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. దోహాలో జరిగిన రెండవ ప్రపంచ సామాజిక అభివృద్ధి సదస్సు ప్లీనరీ సెషన్‌లో భారత్ తరఫున ఆయన మాట్లాడుతూ, పాకిస్తాన్ "తప్పుడు ప్రచారాన్ని" గట్టిగా తిప్పికొట్టారు.

భారతదేశం జీవన చక్ర ఆధారిత సంక్షేమ విధానాన్ని నిర్మించిందని, అందులో పిల్లలకు పోషకాహార మధ్యాహ్న భోజనం, యువతకు విద్య, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు, కార్మికులకు గౌరవప్రదమైన ఉద్యోగాలు, వృద్ధులకు ఆదాయ భద్రత, గౌరవప్రద జీవితం లభిస్తాయని తెలిపారు. ఇది అంత్యోదయ తత్వం, “సబ్కా సాథ్, సబ్కా వికాస్ (అందరితో కలిసి.. అందరి అభివృద్ధి కోసం)” దృష్టితో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు.

కేంద్ర మంత్రి మాండవీయ మాట్లాడుతూ "అంత్యోదయ అంటే వరుసలో ఉన్న చివరి వ్యక్తిని కూడా శక్తివంతం చేయడం. ప్రతి దశలో పౌరుడి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకున్న సమగ్ర వ్యవస్థ వల్లే భారత ప్రగతి సాధ్యమైంది. ఇది గ్లోబల్ సౌత్ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది” అని అన్నారు. ఆయన వివరించిన గణాంకాల ప్రకారం, 11.8 కోట్ల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం లభిస్తోంది. 80 కోట్ల మందికి ఆహార భద్రత ఉంది. 42.5 కోట్ల మందికి ఆరోగ్య బీమా కవరేజ్ ఉంది. 3.7 కోట్ల తక్కువ ఆదాయం గల కుటుంబాలకు గృహాలు అందించబడ్డాయి.

నిరుద్యోగిత రేటు 2017-18లో 6 శాతం నుండి 2023-24లో 3.2 శాతంకు తగ్గిందని, మహిళల ఉపాధి భాగస్వామ్యం దాదాపు రెండింతలు పెరిగిందని, సామాజిక భద్రత కవరేజ్ 2015లో 19 శాతం నుంచి 2025లో 64.3 శాతానికి పెరిగిందని తెలిపారు.

"భారత్ అభివృద్ధి నమూనా గ్లోబల్ సౌత్ దేశాలకు ఒక మార్గదర్శకం. సామాజిక అభివృద్ధి భవిష్యత్ దిశను కలిసి నిర్ణయించుకునే క్రమంలో భారత్ తన ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉంది" అని కేంద్ర మంత్రి మాండవీయ అన్నారు.

పాకిస్తాన్ ఆరోపణలకు గట్టి జవాబు

పాకిస్తాన్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను కూడా కేంద్ర మంత్రి మాండవీయ తీవ్రంగా ఖండించారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి, ప్రపంచ సామాజిక అభివృద్ధి లక్ష్యాల నుండి దృష్టి మరల్చడానికి పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికను దుర్వినియోగం చేస్తోందని ఆయన అన్నారు.

"బుధవారం పాకిస్తాన్ అధ్యక్షుడు భారతదేశంపై చేసిన కొన్ని అసంబద్ధమైన వ్యాఖ్యలపై మేము తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం" అని కేంద్ర మంత్రి మాండవీయ అన్నారు. పాకిస్తాన్ శత్రుత్వం, సరిహద్దు ఉగ్రవాదం ద్వారా సింధు నదీ జలాల ఒప్పంద స్ఫూర్తిని దెబ్బతీసిందని, ఒప్పంద ప్రక్రియలను దుర్వినియోగం చేసి భారత ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేసిందని ఆయన స్పష్టం చేశారు.

“జమ్మూ కశ్మీర్‌పై పాకిస్తాన్‌కు ఎలాంటి హక్కు లేదు. అది భారత అంతర్గత వ్యవహారం” అని చెప్పిన కేంద్ర మంత్రి మాండవీయ పాకిస్తాన్ ఆత్మపరిశీలన చేసుకుని, దాని స్వంత అభివృద్ధి సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని, అంతర్జాతీయ సహాయంపై ఆధారపడటం మానుకోవాలని హితవు పలికారు.

కేంద్ర మంత్రి మాండవీయ ఇంకా మాట్లాడుతూ, ముఖ్యంగా మహిళా నేతృత్వంలోని అభివృద్ధి, సాంప్రదాయ వైద్య విధానాలు, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సహకార సంఘాలు వంటి అంశాలను సమ్మిళిత వృద్ధికి కీలక చోదక శక్తులుగా భారతదేశం ప్రోత్సహిస్తోందని తెలిపారు.

"వరల్డ్ సోషియల్ సమ్మిట్ 2025" పేరుతో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సు, కోపెన్‌హాగన్ డిక్లరేషన్ ఆన్ సోషియల్ డెవలప్‌మెంట్, ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ అమలులో ఉన్న లోటుపాట్లను పూడ్చి, 2030 అజెండా లక్ష్యాల సాధనకు నూతన వేగం తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సదస్సు నవంబర్ 4 నుండి 6 వరకు ఖతార్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఐరాస ఆధ్వర్యంలో జరిగింది.