
భారత్ అంతర్జాతీయ సమీకరణాలు మార్చగలదు
భారత్ తలచుకుంటే అంతర్జాతీయ సమీకరణాలు మార్చగలదని, రాజకీయ జోక్యంతో ఎన్నో సమస్యలను పరిష్కరించగలదని భారత్‌లోని పాలస్తీనా రాయబారి అబ్దుల్లా అబు షావేష్ ప్రశంసలు కురిపించారు. రాజకీయ విషయాల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఇక్కడ 1.4 బిలియన్ మంది ప్రజలున్నారని చెప్పారు. ఐరాసలో ఎనిమిది సంవత్సరాలు పని చేసినవాడిగా చెబుతున్నా భారత్ నిర్ణయం తీసుకుంటే అంతర్జాతీయ వేదిక మారిపోతుందని వ్యాఖ్యానించారు. ప్రపంచ రాజకీయ అంశాల్లో భారత్ కీలకమని తెలిపారు. భారత్ తన గొప్ప రాజకీయ శక్తిని ఉపయోగించి ఎన్నో సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నామన్నారు.
పాలస్తీనా మద్దతుపై హర్షం
భారత ప్రధాని నరేంద్ర మోడీ పాలస్తీనాకు మద్దతిస్తున్నారని అబ్దుల్లా హర్షం వ్యక్తం చేశారు. పాలస్తీనా శరణార్థుల కోసం ఏటా 5 మిలియన్ డాలర్లు సాయం చేస్తున్నారన్నారు. భారత్ ఈ సహకారాన్ని కొనసాగిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్, ప్రధాని మోడీ మధ్య మంచి సంబంధాలున్నాయని, ఆ బంధం అలాగే కొనసాగాలని కోరారు. భారత్ స్వాతంత్య్ర పోరాటంలో ఉన్నప్పుడు సైతం పాలస్తీనా తిరుగుబాటుకు మద్దతిచ్చిందన్నారు. భారత్ పాలస్తీనాను మొదటి నాన్-అరబ్ నాన్-ముస్లిం దేశంగా గుర్తించిందని చెప్పారు. మహాత్మా గాంధీ అధ్యక్షతన 1947లో పాలస్తీనా విభజన ప్రణాళికకు వ్యతిరేకంగా ఓటు వేసిందని గుర్తు చేశారు. అది పాలస్తీనాకు ఎంతో ముఖ్యమైందని పేర్కొన్నారు. 1974 చివరలో పీఎల్‌ఓను పాలస్తీనా ప్రజల ఏకైక ప్రతినిధిగా గుర్తించిన మొదటి నాన్ అరబ్, నాన్ ముస్లిం దేశం భారత్ అని కొనియాడారు.
పాలస్తీనా రాయబారి వ్యాఖ్యలు భారత్ అంతర్జాతీయ ప్రభావాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ యూఎన్‌లో నిర్ణయాలు మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అబ్దుల్లా వ్యాఖ్యలు దౌత్య పరంగా భారత్‌కు ఇది మరింత బలాన్నిస్తాయి. భారత్ ఇజ్రాయిల్‌తో సంబంధాలు కొనసాగిస్తూనే పాలస్తీనాకు మద్దతిస్తుంది. గ్లోబల్ సౌత్ దేశాలకు భారత్ నాయకత్వం వహించే దిశగా అవకాశముంది. భవిష్యత్తులో భారత్ గాజా సంఘర్షణలో మధ్యవర్తిగా మరింత చురుకుగా పాత్ర పోషించవచ్చు. ప్రస్తుతం భారత్ నుంచి ఆర్థిక, రాజకీయ, దౌత్యపరమైన సహకారం పొందుతున్న దేశాల నుంచి భవిష్యత్తులో సహకారం లభిస్తుంది. భారత్ ఇప్పటికే ప్రపంచంలో నాలుగో బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. సాంకేతికంగా, రక్షణ పరంగా ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ అభివృద్ధిలో దూసుకుపోతోంది. సరిహద్దు, వాణిజ్య సమస్యలను వ్యూహాత్మకంగా పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో చిన్న దేశాలు తమ సమస్యలను పరిష్కరించేందుకు భారత్ మద్దతు కోరడం దేశ స్థాయిని మరో మెట్టు ఎక్కిస్తుంది. భారత్ తన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా దౌత్యం సాగించాల్సిన అవసరముంది.
