
భారత్‌లో 2025లో 4,000 కోట్లకు పైగా స్పామ్ కాల్స్
2025 సంవత్సరంలో భారత్‌లో 4,168 కోట్లకు పైగా స్పామ్ కాల్స్ నమోదయ్యాయని, వీటిలో 1,189 కోట్ల అనవసర కాల్స్‌ను వినియోగదారుల కమ్యూనిటీ సహకారంతో ముందుగానే బ్లాక్ చేసినట్లు ట్రూ కాలర్ తన 2025 ఇండియా ఇన్‌సైట్స్ రిపోర్ట్లో వెల్లడించింది. దేశంలో డిజిటల్ లావాదేవీలు, ఆన్‌లైన్ కమ్యూనికేషన్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మోసపూరిత కాల్స్, సందేశాలు కూడా గణనీయంగా పెరిగాయని నివేదిక పేర్కొంది.
కాల్స్ రూపంలో మోసాల విస్తృతి
నివేదిక ప్రకారం 2025లో మొత్తం 4,168 కోట్ల స్పామ్ కాల్స్ గుర్తించింది. వీటిలో 1,189 కోట్ల అనవసర కాల్స్ వినియోగదారులకు చేరకముందే బ్లాక్ చేసింది. అదనంగా సుమారు 770 కోట్ల మోసపూరిత కాల్స్ గుర్తించినట్లు పేర్కొంది. మోసగాళ్లు ప్రధానంగా బ్యాంకులు, ప్రభుత్వ శాఖలు, డిజిటల్ పేమెంట్ యాప్‌లు, ప్రముఖ కంపెనీల పేర్లను వాడుతూ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.
స్పామ్ సందేశాల పెరుగుదల
2025లో దేశవ్యాప్తంగా 12,903 కోట్ల స్పామ్ ఎస్‌ఎంఎస్‌లు గుర్తించింది. ముఖ్యంగా సంవత్సరపు రెండో ఆర్థంలో స్పామ్ మెసేజ్‌ల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ట్రూకాలర్ తెలిపింది.
భారతీయుల సమయం రక్షణ
సగటున ఒక స్పామ్ కాల్ 1.8 నిమిషాల పాటు కొనసాగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో రోజుకు సుమారు 21.7 లక్షల గంటల సమయం వృథా కాకుండా నిలిపివేసిందని, వారానికి 1.5 కోట్ల గంటలకు పైగా సమయం ఆదా అయినట్లు తెలిపింది. అలాగే ప్రతిరోజూ ఆదా అవుతున్న సమయం సుమారు 250 ఏళ్ల మానవ జీవితానికి సమానమని ట్రూకాలర్ పేర్కొంది. వచ్చే ఏడాదిలో మోసాల రూపురేఖలు మరింత మారే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది.
ముఖ్యంగా
గుర్తింపు ధృవీకరణ (వెరిఫికేషన్) పేరిట మోసాలు
పరిచిత సంస్థల పేరుతో వేషధారణ
కాల్స్, మెసేజ్‌ల మిశ్రమ పద్ధతిలో మోసాలు
ఏఐ ఆధారిత వాయిస్ మెసేజ్‌లు
థర్డ్ పార్టీ మెసేజింగ్ యాప్‌ల ద్వారా మోసాల విస్తరణ పెరిగే అవకాశముందని పేర్కొంది.
ట్రూకాలర్ సీఈఓ వ్యాఖ్య
డిజిటల్ కనెక్టివిటీ పెరుగుతున్న ఈ కాలంలో నమ్మకం అత్యంత విలువైన ఆస్తి. మోసం కేవలం సాంకేతిక సమస్య కాదు, ఇది మానవ సమస్య. భారతీయులు సురక్షితంగా ఉండేలా మేము చూసుకుంటామని ట్రూకాలర్ సీఈఓ రిషిత్ ఝుంఝున్‌వాలా తెలిపారు. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు భారత వినియోగదారుల మెటాడేటా, స్పామ్ క్లాసిఫికేషన్ సంకేతాల ఆధారంగా గోప్యంగా ఈ డేటా సేకరించినట్లు సంస్థ వెల్లడించింది. స్టాక్‌హోమ్ ప్రధాన కార్యాలయంగా ఉన్న ట్రూ కాలర్‌కు ప్రపంచవ్యాప్తంగా 45 కోట్లకు పైగా యాక్టివ్ వినియోగదారులు ఉన్నారు.
