Let's talk: editor@tmv.in
భారత్‌లో హెలికాప్టర్ల తయారీ: అదానీ డిఫెన్స్, లియోనార్డో మధ్య కీలక ఒప్పందం

భారత్‌లో హెలికాప్టర్ల తయారీ: అదానీ డిఫెన్స్, లియోనార్డో మధ్య కీలక ఒప్పందం

Shaik Mohammad Shaffee
4 ఫిబ్రవరి, 2026

రక్షణ రంగంలో స్వయం సమృద్ధి (ఆత్మనిర్భర్ భారత్) సాధించే దిశగా భారత్ మరో కీలక అడుగు వేసింది. దేశీయ దిగ్గజం 'అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్', ఇటలీకి చెందిన గ్లోబల్ ఏరోస్పేస్ సంస్థ 'లియోనార్డో'తో కలిసి భారత్‌లో హెలికాప్టర్ తయారీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇరు సంస్థలు మంగళవారం దేశ రాజధానిలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యం ద్వారా సైనిక అవసరాలను తీర్చడమే కాకుండా, విదేశీ ఎగుమతులకు కూడా భారత్‌ను కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

సైనిక అవసరాలే లక్ష్యంగా..

భారత సాయుధ దళాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, లియోనార్డో సంస్థకు చెందిన అత్యాధునిక AW169M, AW109 TrekkerM రకం హెలికాప్టర్లను దేశీయంగా తయారు చేయనున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా కేవలం తయారీ మాత్రమే కాకుండా.. దశలవారీగా విడిభాగాల స్వదేశీకరణ, మెయింటెనెన్స్, రిపేర్లు, పైలట్లకు శిక్షణ ఇచ్చే కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.

హెలికాప్టర్లకు పెరగనున్న గిరాకీ

ప్రస్తుతం భారత జనాభాతో పోలిస్తే దేశంలో హెలికాప్టర్ల సంఖ్య చాలా తక్కువగా (250 లోపు) ఉంది. అయితే, రాబోయే పదేళ్లలో భారత సాయుధ దళాలకు 1,000కి పైగా హెలికాప్టర్లు అవసరమవుతాయని అంచనా. ఈ నేపథ్యంలో, వచ్చే దశాబ్ద కాలం పాటు ఏటా కనీసం 100 హెలికాప్టర్ల గిరాకీ ఉంటుందని అదానీ డిఫెన్స్ పేర్కొంది. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా ఇంజినీరింగ్, తయారీ, రవాణా రంగాల్లో వేలాది మంది యువతకు ఉపాధి లభించడమే కాకుండా, భారత్‌లో తయారయ్యే విడిభాగాలను లియోనార్డో సంస్థ ప్రపంచవ్యాప్త సరఫరా వ్యవస్థకు (సప్లై చైన్) కూడా అనుసంధానించనున్నారు.

భారత్ - గ్లోబల్ ఏరోస్పేస్ హబ్

ఈ సందర్భంగా అదానీ డిఫెన్స్ డైరెక్టర్ జీత్ అదానీ మాట్లాడుతూ, "లియోనార్డోతో ఈ అనుబంధం భారత్‌ను గ్లోబల్ ఏరోస్పేస్ పవర్‌హౌస్‌గా మార్చడానికి ఒక కీలక అడుగు. పౌర, రక్షణ రంగాల అవసరాలను తీర్చేలా పటిష్టమైన వ్యవస్థను నిర్మిస్తాం" అని ధీమా వ్యక్తం చేశారు. లియోనార్డో హెలికాప్టర్స్ ఎండీ జియాన్ పియరో కుటిల్లో మాట్లాడుతూ, భారత్ ఒక భారీ మార్కెట్ అని, ఇక్కడి సైనిక దళాలకు ఆధునిక సాంకేతికతను అందించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

వరుస ఒప్పందాలతో దూకుడు

అదానీ డిఫెన్స్ గత వారమే బ్రెజిల్‌కు చెందిన 'ఎంబ్రేయర్' సంస్థతో కలిసి ప్రాంతీయ విమానాల తయారీకి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు లియోనార్డోతో హెలికాప్టర్ల తయారీకి చేతులు కలపడం ద్వారా భారత విమానయాన రంగంలో అదానీ గ్రూప్ తన పట్టును మరింత బిగించింది.