
భారత్‌లో శ్రీలంక ప్రధాని అమరసూర్య పర్యటన
శ్రీలంక ప్రధాన మంత్రి హరిణి అమరసూర్య పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా భారత్‌కు వచ్చారు. గురువారం ఆమె మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఇరు దేశాల మధ్య దీర్ఘకాల సహకారాన్ని బలోపేతం చేయడం, వివిధ రంగాలలో లోతైన సహకారాన్ని పెంపొందించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం.
పర్యటన తొలిరోజున శ్రీలంక ప్రధాని అమరసూర్య న్యూఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో భేటీ అయ్యారు. విద్య, సామర్థ్య పెంపుదల, డిజిటల్ గవర్నెన్స్ వంటి రంగాలపై దృష్టి సారిస్తూ ద్వైపాక్షిక సహకారాన్ని మెరుగుపరచడంపై ఇరు దేశాల నాయకులు చర్చించారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక ప్రధాని అమరసూర్య భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో కూడా సమావేశం కానున్నారు. వాణిజ్యం, విద్య, ప్రాంతీయ సహకారం వంటి ఉమ్మడి ఆసక్తి గల కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఈ పర్యటనలో ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, శ్రీలంక ప్రధాని అమరసూర్య తాను పూర్వం చదివిన ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని హిందూ కళాశాలకు సందర్శించడం. ఆమె 1991 నుండి 1994 వరకు ఈ కాలేజీలోనే సోషియాలజీలో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసించారు. ఆమెకు అక్కడి విద్యార్థులు, అధ్యాపకులు, ఆమెతో చదివిన తోటి స్నేహితులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె అక్కడి విద్యార్థులతో ముచ్చటించి, ఆ కాలేజీలో తాను గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు.
ఢిల్లీ యూనివర్సిటీలో ప్రసంగం
శ్రీలంక ప్రధాని అమరసూర్య గురువారం ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అవినీతి, బంధుప్రీతిని తొలగించడం ద్వారా రాజకీయ సంస్కృతిలో మార్పు తీసుకురావాలని ఆమె పిలుపునిచ్చారు. రాజకీయాలకు దూరంగా ఉండవద్దని యువతను కోరారు. "రాజకీయాలలో మనకు నచ్చని దాన్ని మారుద్దాం.. రాజకీయాలకు దూరంగా ఉండొద్దు. ఎందుకంటే రాజకీయాలు లేకుండా, మీరు ప్రపంచాన్ని మార్చలేరు" అని ఆమె అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, "ప్రజాస్వామ్యం అంటే కూర్చుని చూసేది కాదు, అది కష్టంతో కూడిన కృషి" అని విద్యార్థులతో అన్నారు.
డిజిటల్ గవర్నెన్స్‌పై ప్రశంసలు
డిజిటల్ గవర్నెన్స్‌లో భారతదేశం సాధించిన అద్భుత పురోగతిని శ్రీలంక ప్రధాని అమరసూర్య ప్రశంసించారు. ఇది ఇతరులకు ఆదర్శంగా నిలిచిందని ఆమె కొనియాడారు. పాలనను మరింత సులభతరం చేసే విధంగా సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవచ్చు అనే ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ, "భారతదేశం ఆ పనిని అద్భుతంగా చేసిందని నేను భావిస్తున్నాను. ప్రభుత్వ వ్యవస్థలను డిజిటలైజ్ చేయడం ద్వారా మరింత జవాబుదారీతనం, పారదర్శకత సాధ్యమవుతుంది” అని అన్నారు. భారతదేశ డిజిటల్ గవర్నెన్స్ నమూనాను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, అలాంటి కార్యక్రమాలను శ్రీలంకలో కూడా అమలు చేయడానికి ప్రయత్నిస్తామని ఆమె తెలిపారు.
