
భారత్‌లో విమానాల తయారీ.. రష్యా కంపెనీతో హెచ్‌ఏఎల్ డీల్
విమానాల విడిభాగాలు, హెలికాప్టర్ల తయారీలో ఇప్పటికే ఎంతో పురోగతి సాధిస్తోన్న భారత్, ఇప్పుడు పూర్తి స్థాయి ప్రయాణికుల విమానాల ఉత్పత్తి దిశగా ఒక చారిత్రక అడుగు వేసింది. 'మేకిన్ ఇండియా' కార్యక్రమానికి భారీ ఊతమిస్తూ, ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్), రష్యాకు చెందిన పబ్లిక్ జాయింట్ స్టాక్ కంపెనీ యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ (పీజేఎస్‌సీ-యూఏసీ) మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం రెండు ఇంజిన్లతో కూడిన ఎస్‌జే-100 సివిల్ కమ్యూటర్ జెట్‌లను భారత్‌లోనే తయారు చేయనున్నారు. రష్యా రాజధాని మాస్కోలో మంగళవారం ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
మూడు దశాబ్దాల తర్వాత తొలి ప్రాజెక్ట్
ఈ ఒప్పందం భారత విమానయాన చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనుంది. "భారత్‌లో పూర్తి స్థాయి ప్రయాణికుల విమానం తయారు చేయనుండడం ఇదే తొలిసారి" అని హెచ్‌ఏఎల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. గతంలో హెచ్‌ఏఎల్ 1961 నుంచి 1988 వరకు 'ఏవీఆర్‌ఓ హెచ్‌ఎస్-748' విమానాలను తయారు చేసింది. ఆ తర్వాత మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత దేశంలో పూర్తిస్థాయి ప్రయాణికుల విమానాల తయారీ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కనుంది.
మాస్కోలో జరిగిన ఈ కార్యక్రమంలో హెచ్‌ఏఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి.కె. సునీల్, పీజేఎస్‌సీ-యూఏసీ డైరెక్టర్ జనరల్ వాదిమ్ బదేకా సమక్షంలో ఒప్పందం కుదిరింది. ఈ వివరాలను హెచ్‌ఏఎల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు సమర్పించిన ఫైలింగ్‌లో అధికారికంగా ప్రకటించింది.
పౌర విమానయానంలో 'ఆత్మనిర్భరత'
ఈ ఒప్పందం ద్వారా దేశీయ అవసరాలకు అనుగుణంగా ప్రయాణికుల విమానాన్ని తయారు చేసే హక్కులు హెచ్‌ఏఎల్ కు లభిస్తాయి. రాబోయే దశాబ్ద కాలంలో స్థానిక (రీజనల్) కనెక్టివిటీ కోసం ఎస్‌జే-100 తరహా 200 చిన్న పరిమాణ విమానాలు అత్యవసరం అని హెచ్‌ఏఎల్ అంచనా వేసింది. అలాగే సమీపంలోని అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాలకు సేవలందించేందుకు హిందూ మహాసముద్ర ప్రాంతంలో మరో 350 విమానాలు అవసరపడొచ్చని తెలిపింది.
ఉడాన్ పథకానికి బలం
కేంద్ర ప్రభుత్వ 'ఉడాన్' పథకం కింద స్వల్ప దూర ప్రయాణాలకు ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడంలో ఈ విమానాలు 'గేమ్ ఛేంజర్'గా నిలుస్తాయని హెచ్‌ఏఎల్ విశ్వాసం వ్యక్తం చేసింది. పౌర విమానయాన రంగంలో భారత్ స్వయం సమృద్ధి (ఆత్మనిర్భరత) సాధించేందుకు ఈ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని హెచ్‌ఏఎల్ పేర్కొంది.
ఎస్‌జే-100 ప్రత్యేకతలు
ఎస్‌జే-100 అనేది చిన్న-దూర ప్రయాణాలకు అనువైన విమానం. ఇది రెండు ఇంజిన్లు కలిగిన ఒక నారో-బాడీ (చిన్న పరిమాణం) విమానం. ఈ జెట్ విమానం గరిష్ఠంగా 103 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగి ఉంటుంది. స్వల్ప దూరం ప్యాసింజర్ సేవలకు అనువుగా ఉండటంతో పాటు, దీని నిర్వహణ ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. ఇది ఆర్థికంగా లాభదాయకం. ఇప్పటికే రష్యా సంస్థ సుమారు 200 ఎస్‌జే-100 విమానాలను తయారు చేయగా, ప్రపంచవ్యాప్తంగా 16 కమర్షియల్ ఎయిర్‌లైన్స్ సంస్థలు వీటిని తమ సర్వీసులో నడుపుతున్నాయి. ఈ చారిత్రక ఒప్పందం ద్వారా భారతదేశం కేవలం రక్షణ లేదా అంతరిక్ష రంగంలోనే కాకుండా, పౌర విమానయాన రంగంలోనూ ప్రపంచ శక్తిగా ఎదగడానికి మార్గం సుగమం అయినట్టయింది.
