
భారత్‌లో భారీ విస్తరణకు రోల్స్-రాయ్స్ రోడ్‌మ్యాప్
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఇంజిన్ తయారీ సంస్థ రోల్స్-రాయ్స్ ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన మరుసటి రోజే భారత్‌లో రక్షణ, ఇంధన, పౌర విమానయాన రంగాల్లో తన కార్యకలాపాలను విస్తరించేందుకు వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌ను గురువారం ప్రకటించింది. ముఖ్యంగా, భారత్ అభివృద్ధి చేస్తున్న అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) కోసం నెక్స్ట్-జెనరేషన్ యుద్ధ విమాన ఇంజిన్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి పూర్తి మేధో సంపత్తి హక్కులు (ఐపీఆర్) బదిలీ చేసే ప్రతిపాదనను సంస్థ ముందుకు తెచ్చింది.
రోల్స్-రాయ్స్ సీఈఓ తుఫాన్ ఎర్గిన్‌బిల్గిచ్ మాట్లాడుతూ భారత్‌లో తమ సిబ్బంది సంఖ్యను సుమారు 10,000 మందికి పెంచే లక్ష్యంతో పాటు, స్థానిక చైన్ సిస్టమ్ కొనుగోళ్లను పదింతలు పెంచాలని భావిస్తున్నట్లు తెలిపారు. రాబోయే కాలంలో భారత్‌ను హైటెక్ తయారీకి గ్లోబల్ హబ్‌గా నిలబెట్టాలనే లక్ష్యముందని చెప్పారు.
యూకే ప్రభుత్వ మద్దతుతో 120 కిలోన్యూటన్ శక్తి గల యుద్ధవిమాన ఇంజిన్ కోర్‌ను భారత్‌తో కలిసి అభివృద్ధి చేయాలని రోల్స్-రాయ్స్ ప్రతిపాదించింది. ఈ సంయుక్త అభివృద్ధిలో పూర్తి సాంకేతిక బదిలీతో పాటు మేధో సంపత్తి హక్కులు భారత్‌కే చెందేలా ఉండనున్నట్లు సంస్థ తెలిపింది. ఇందుకోసం ప్రత్యేక డిజైన్ కేంద్రం, తయారీ సామర్థ్యాల ఏర్పాటుతో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొంది. రక్షణ, విమానయాన, ఇంధన రంగాల్లో భారత్‌తో భాగస్వామ్యాన్ని విస్తరించడానికి మేము కట్టుబడి ఉన్నాం. ‘ఆత్మనిర్భర్ భారత్’ ప్రయాణంలో స్థానిక సామర్థ్యాల అభివృద్ధికి మద్దతు ఇస్తామని ఎర్గిన్‌బిల్గిచ్ అన్నారు.
ప్రధాని మోడీ కూడా రోల్స్-రాయ్స్ విస్తరణ ప్రణాళికను స్వాగతిస్తూ, భారత్ యువతతో భాగస్వామ్యం చేయాలన్న సంస్థ ఉత్సాహాన్ని ప్రశంసించారు. ప్రస్తుతం భారత్‌లో రోల్స్-రాయ్స్ ఎకోసిస్టంలో 4,000 మందికి పైగా పనిచేస్తుండగా, వీరిలో 2,800 మంది ఇంజినీర్లు గ్లోబల్ ప్రాజెక్టులకు సహకరిస్తున్నారు. హెచ్ఏఎల్, ఫోర్స్ మోటార్స్ వంటి సంయుక్త భాగస్వామ్యాలతో పాటు టాటా, భారత్ ఫోర్జ్, గోద్రేజ్ తదితర సంస్థలతో సరఫరా భాగస్వామ్యాలు కొనసాగుతున్నాయి.
రోల్స్-రాయ్స్ ఇప్పటికే భారత వాయుసేన, నౌకాదళం, పదతి దళం వినియోగిస్తున్న జాగ్వార్, హాక్ విమానాలు, అర్జున్ ట్యాంకులు, పలు యుద్ధ నౌకలకు ఇంజిన్లు సరఫరా చేస్తోంది. ఈ ప్రకటన భారత్-యుకే విజన్ 2035 వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత ఊతమివ్వనుందని బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరన్ పేర్కొన్నారు.
