
భారత్‌లో డ్రోన్ విప్లవం
గత రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులు సామాన్యుడి జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇందులో డ్రోన్ సాంకేతికత లేదా అన్-మాన్డ్ ఏరియల్ వెహికల్స్ పాత్ర అత్యంత కీలకమైనది. ఒకప్పుడు కేవలం రక్షణ రంగానికి లేదా వినోదానికి మాత్రమే పరిమితమైన డ్రోన్లు, నేడు భారతదేశంలో పాలన, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, ప్రజా సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నాయి. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'లిబరలైజ్డ్ డ్రోన్ రూల్స్', 'పి.ఎల్.ఐ పథకం', 'డిజిటల్ స్కై' వంటి అభ్యుదయ విధానాల వల్ల దేశంలో డ్రోన్ల తయారీ, వినియోగం గణనీయంగా పెరిగింది.
ఫిబ్రవరి 2026 నాటికి భారతదేశం డ్రోన్ రంగంలో అద్భుతమైన వృద్ధిని సాధించింది. దేశవ్యాప్తంగా 38,500 కంటే ఎక్కువ నమోదిత డ్రోన్‌లు, సుమారు 39,890 మంది ధృవీకరించబడిన రిమోట్ పైలట్లు, 244 శిక్షణా సంస్థలతో ఒక క్రమబద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేసింది. సామాజికాభివృద్ధిలో భాగంగా స్వామిత్వ పథకం ద్వారా 3.28 లక్షల గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి చేసి, 1.82 లక్షల గ్రామాలకు 2.76 కోట్ల ఆస్తి కార్డులను సిద్ధం చేయడమే కాకుండా, 'నమో డ్రోన్ దీదీ' వంటి కార్యక్రమాల ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు 1,094 డ్రోన్‌లను పంపిణీ చేసి వ్యవసాయ ఉత్పాదకతను, గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేసింది.
2030 నాటికి భారతదేశాన్ని గ్లోబల్ డ్రోన్ హబ్ గా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యం దిశగా దేశం వేగంగా అడుగులు వేస్తోంది. ఇది కేవలం ఒక పరికరం మాత్రమే కాదు, ఆర్థిక వృద్ధికి, సామాజిక సాధికారతకు ఒక శక్తివంతమైన సాధనంగా మారింది. అలాంటి డ్రోన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం….
నమో డ్రోన్ దీదీ పథకం
నవంబర్ 2023లో ప్రారంభమైన నమో డ్రోన్ దీదీ పథకం గ్రామీణ భారతదేశంలో ఒక సామాజిక విప్లవానికి నాంది పలికింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లను అందించి వారిని సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దుతున్నారు. మహిళలు డ్రోన్ పైలట్లుగా శిక్షణ పొంది, పొలాల్లో ఎరువుల పిచికారీ విత్తనాలు చల్లడం ద్వారా ఏడాదికి సుమారు మూడు లక్షల వరకు అదనపు ఆదాయం పొందుతున్నారు. ఈ ప్రక్రియ ద్వారా గ్రామీణ మహిళలు కేవలం గృహిణులుగానే కాకుండా, అత్యాధునిక సాంకేతికతను నడిపే నిపుణులుగా మారి సమాజంలో ఆర్థిక గౌరవం పొందుతున్నారు.
వ్యవసాయ రంగంలో ఖచ్చితత్వ సాగు మార్పులు
భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం కావడంతో డ్రోన్ల వినియోగం ఇక్కడ అత్యంత ప్రభావాన్ని చూపుతోంది. ఖచ్చితత్వ వ్యవసాయం పద్ధతిలో పొలంలో ఏ ప్రాంతంలో పురుగుమందులు అవసరమో గుర్తించి అక్కడే పిచికారీ చేయడం వల్ల రైతులకు పెట్టుబడి ఖర్చులు గణనీయంగా తగ్గుతున్నాయి. మనుషులు గంటల తరబడి చేసే పిచికారీ పనిని డ్రోన్లు కేవలం నిమిషాల్లో పూర్తి చేయడం వల్ల సమయం ఆదా అవుతోంది. అలాగే రైతులు విషపూరితమైన పురుగుమందుల ప్రభావానికి నేరుగా గురికాకుండా ఉండటం వల్ల వారి ఆరోగ్యం మెరుగుపడుతోంది, పంటల దిగుబడి అంచనాలను వేయడంలో ఈ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది.
స్వామిత్వ పథకం, భూ యాజమాన్య హక్కులు
గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తి వివాదాలను శాశ్వతంగా పరిష్కరించడానికి డ్రోన్ సాంకేతికత ఒక వరంగా మారింది. 2020లో ప్రారంభమైన స్వామిత్వ పథకం కింద లక్షలాది గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి చేసి భూములను మ్యాపింగ్ చేస్తున్నారు. దీని ద్వారా కోట్లాది మంది గ్రామీణ ప్రజలకు డిజిటల్ ఆస్తి కార్డులు పంపిణీ చేయబడ్డాయి. ఇది ప్రజలకు తమ భూమిపై స్పష్టమైన యాజమాన్య హక్కును కల్పించడమే కాకుండా, బ్యాంకుల నుండి సులభంగా రుణాలు పొందడానికి మార్గాన్ని సుగమం చేసింది. ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ వల్ల దశాబ్దాలుగా నలుగుతున్న భూ వివాదాలకు తెరపడుతోంది.
భారత ప్రభుత్వం తన ప్రతిష్టాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పర్యవేక్షించడానికి డ్రోన్లను విరివిగా వాడుతోంది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రతి హైవే ప్రాజెక్టు పనులను నెలవారీ డ్రోన్ వీడియోల ద్వారా రికార్డ్ చేసి విశ్లేషిస్తోంది. దీనివల్ల పనుల్లో పారదర్శకత పెరగడమే కాకుండా నాణ్యతలో లోపాలను వెంటనే గుర్తించే అవకాశం కలుగుతోంది. అదేవిధంగా రైల్వే వ్యవస్థలో ట్రాక్‌లు, వంతెనల తనిఖీ కోసం డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కూడా స్టేషన్ ప్రాంగణాల్లో భద్రతను పర్యవేక్షించడానికి, నేరాలను అదుపు చేయడానికి ఈ సాంకేతికతను వాడుతోంది.
విపత్తు నిర్వహణ, అత్యవసర సేవల విశ్లేషణ
ప్రకృతి వైపరీత్యాల సమయంలో డ్రోన్లు ప్రాణదాతలుగా నిలుస్తున్నాయి. వరదలు లేదా కొండచరియలు విరిగిపడే సమయాల్లో మనుషులు వెళ్లలేని ప్రమాదకర ప్రాంతాలకు డ్రోన్లు వెళ్లి ఆహారం, మందులను సరఫరా చేస్తున్నాయి. నెక్టార్ వంటి సంస్థలు అభివృద్ధి చేసిన ప్రత్యేక డ్రోన్ వ్యవస్థలు విపత్తు ప్రాంతాల నుండి ప్రత్యక్ష దృశ్యాలను అందించి సహాయక బృందాలకు సరైన దిశానిర్దేశం చేస్తున్నాయి. మారుమూల కొండ ప్రాంతాలకు, అడవులకు అత్యవసర వ్యాక్సిన్లు, రక్తాన్ని చేరవేయడంలో డ్రోన్ల వినియోగం అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది.
రక్షణ రంగంలో స్వయం సమృద్ధి, నిఘా వ్యవస్థ
భారత సైన్యం ఆధునికీకరణలో భాగంగా డ్రోన్లు అత్యంత కీలకమైన ఆయుధాలుగా మారాయి. సరిహద్దుల్లో శత్రువుల కదలికలను నిరంతరం పర్యవేక్షించడానికి, మంచు పర్వతాల వంటి కఠిన ప్రాంతాల్లో డేటాను సేకరించడానికి వీటిని ఉపయోగిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ వంటి క్లిష్టమైన సమయాల్లో దేశీ డ్రోన్లు చూపిన సామర్థ్యం రక్షణ రంగానికి కొండంత అండగా నిలిచింది. మేక్ ఇన్ ఇండియా పిలుపుతో అనేక స్వదేశీ స్టార్టప్‌లు ఇప్పుడు అత్యాధునిక అటాక్ డ్రోన్లను తయారు చేస్తున్నాయి. ఇది రక్షణ అవసరాల కోసం విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తోంది.
డ్రోన్లు - రకాలు
డ్రోన్లను వాటి బరువు ,విమాన నిర్మాణ శైలిని బట్టి ప్రధానంగా వర్గీకరిస్తారు. భారత ప్రభుత్వ నిబంధనల (డీజిసిఐ) ప్రకారం బరువును బట్టి వీటిని ఐదు రకాలుగా విభజించారు. 250 గ్రాముల లోపు ఉంటే నానో, 2 కిలోల వరకు ఉంటే మైక్రో, 25 కిలోల వరకు ఉంటే చిన్న, 150 కిలోల వరకు ఉంటే మధ్యస్థ,150 కిలోల కంటే ఎక్కువ బరువుంటే పెద్ద డ్రోన్లు అంటారు. వీటిలో నానో డ్రోన్లకు రిజిస్ట్రేషన్ అవసరం లేనప్పటికీ, మిగిలిన వాటికి రిమోట్ పైలట్ లైసెన్స్, ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి. సాధారణంగా మనం చూసే క్వాడ్‌కాప్టర్లు (నాలుగు రెక్కలు ఉండేవి) చిన్న రకానికి చెందినవి, వీటిని ఫోటోగ్రఫీ వ్యవసాయ అవసరాల కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు.
నిర్మాణ శైలిని బట్టి డ్రోన్లను మల్టీ-రోటర్, ఫిక్స్‌డ్-వింగ్, హైబ్రిడ్ విటిఓఎల్ అని మూడు రకాలుగా చెప్పవచ్చు. మల్టీ-రోటర్ డ్రోన్లు హెలికాప్టర్ లాగా ఒకే చోట గాలిలో నిలబడగలవు, అందుకే వీటిని నిఘా, షూటింగ్ పనులకు వాడుతారు. ఫిక్స్‌డ్-వింగ్ డ్రోన్లు చిన్న విమానాల వలె ఉండి ఎక్కువ దూరం ప్రయాణించగలవు, ఇవి పెద్ద భూభాగాలను మ్యాపింగ్ చేయడానికి సర్వేలకు అనువైనవి. ఇక హైబ్రిడ్ విటిఓఎల్ డ్రోన్లు నిలువుగా పైకి లేచి, గాలిలో విమానంలా వేగంగా ప్రయాణించగలవు. వీటిని ప్రస్తుతం అత్యవసర మందుల సరఫరా, రక్షణ రంగంలో సరిహద్దు నిఘా కోసం వినియోగిస్తున్నారు.
డ్రోన్ రూల్స్, ప్రభుత్వ విధానపరమైన సంస్కరణలు
డ్రోన్ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం పాత నిబంధనలను పక్కనపెట్టి అత్యంత సరళమైన డ్రోన్ రూల్స్ 2021ను ప్రవేశపెట్టింది. గతంలో ఉన్న అనేక ఫారమ్‌లను, అనుమతులను రద్దు చేసి డిజిటల్ స్కై ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రక్రియను సులభతరం చేసింది. దేశంలోని తొంభై శాతం గగనతలాన్ని గ్రీన్ జోన్‌గా ప్రకటించడం వల్ల సామాన్య వినియోగదారులు కూడా సులభంగా డ్రోన్లను ఎగురవేసే అవకాశం కలిగింది. రిమోట్ పైలట్ లైసెన్స్ ప్రక్రియను కూడా సరళతరం చేసి, కేవలం ఆధార్ కార్డు వంటి గుర్తింపు కార్డులతోనే అనుమతి పొందేలా నిబంధనలను మార్చారు.
ఆర్థిక ప్రోత్సాహకాలు, ఉపాధి అవకాశాల సృష్టి
డ్రోన్ రంగం కేవలం సాంకేతికత మాత్రమే కాదు, ఒక భారీ ఉపాధి వనరుగా అభివృద్ధి చెందుతోంది. డ్రోన్ల తయారీని పెంచడానికి ప్రభుత్వం పిఎల్ఐ పథకాన్ని అమలు చేస్తూ తయారీదారులకు కోట్లాది రూపాయల ప్రోత్సాహకాలను అందిస్తోంది. డ్రోన్లపై జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించడం వల్ల వీటి కొనుగోలు వ్యయం తగ్గి సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా వందలాది శిక్షణా సంస్థలు ఏర్పాటు చేయడం ద్వారా వేలమంది యువతకు డ్రోన్ పైలట్లుగా, సర్వీస్ ఇంజనీర్లుగా ఉపాధి లభిస్తోంది, దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతోంది.
ఇటీవల కాలంలో భారతదేశాన్ని ప్రపంచ డ్రోన్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం పరిశ్రమ వర్గాలు కలిసి అనేక భారీ ప్రదర్శనలను నిర్వహించాయి. ముఖ్యంగా 'భారత్ డ్రోన్ శక్తి', 'భారత్ డ్రోన్ మహోత్సవ్' వంటి కార్యక్రమాలు దేశీయంగా తయారైన డ్రోన్ల సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి. ఈ ప్రదర్శనలలో 75 కంటే ఎక్కువ స్టార్టప్‌లు పాల్గొని, వ్యవసాయం కోసం తయారుచేసిన హెవీ-లిఫ్ట్ డ్రోన్లు, సరిహద్దు రక్షణ కోసం రూపొందించిన కామికేజ్ డ్రోన్లు, వైద్య సామాగ్రిని చేరవేసే లాజిస్టిక్ డ్రోన్లను ప్రదర్శించాయి. ఈ ఎగ్జిబిషన్లలో నిర్వహించిన లైవ్ డెమోలు డ్రోన్ల ఖచ్చితత్వాన్ని, క్లిష్ట పరిస్థితులలో అవి పనిచేసే తీరును నిరూపించాయి, ఇది పెట్టుబడిదారులను, యువ పారిశ్రామికవేత్తలను ఈ రంగం వైపు ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించింది.
ఈ డ్రోన్ ఎగ్జిబిషన్లు కేవలం ప్రదర్శనలకు మాత్రమే పరిమితం కాకుండా, విజ్ఞాన మార్పిడికి వ్యాపార ఒప్పందాలకు ప్రధాన వేదికలుగా నిలిచాయి. ప్రభుత్వం, విద్యా సంస్థలు, ప్రైవేట్ కంపెనీల మధ్య సమన్వయాన్ని పెంచడానికి ఇవి ఎంతో దోహదపడ్డాయి. ముఖ్యంగా డ్రోన్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పో వంటి కార్యక్రమాలలో విదేశీ నిపుణులు కూడా పాల్గొని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ద్వారా డ్రోన్లను ఎలా మరింత తెలివిగా మార్చవచ్చో చర్చించారు. ఈ ప్రదర్శనల ఫలితంగానే 'డ్రోన్-యాజ్-ఏ-సర్వీస్' వంటి కొత్త బిజినెస్ మోడల్స్ ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇది దేశంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే కాకుండా, రాబోయే కాలంలో సామాన్యులకు సైతం డ్రోన్ సేవలను తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురావడానికి పునాది వేసింది.
భారతదేశం తన అభ్యుదయ విధానాలు బలమైన స్టార్టప్ సంస్కృతి ద్వారా డ్రోన్ సాంకేతికతలో ప్రపంచానికి దిక్సూచిగా మారుతోంది. వ్యవసాయం నుండి రక్షణ వరకు ప్రతి రంగంలోనూ డ్రోన్ల ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. సాంకేతిక స్వయం సమృద్ధి సాధించడంలో ఈ డ్రోన్ పర్యావరణ వ్యవస్థ ఒక మైలురాయిగా నిలుస్తుంది. భవిష్యత్తులో మరింత అధునాతనమైన పరిశోధనలు, ఆవిష్కరణలతో భారతదేశం అంతర్జాతీయ డ్రోన్ మార్కెట్లో అగ్రగామిగా నిలవడం ఖాయం. ఇది దేశ సామాజిక, ఆర్థిక వికాసానికి కొత్త రెక్కలను ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
