Let's talk: editor@tmv.in
భారత్‌లో చాట్‌జీపీటీకి వారానికి 10 కోట్ల మంది యూజర్లు: శామ్ ఆల్ట్‌మన్

భారత్‌లో చాట్‌జీపీటీకి వారానికి 10 కోట్ల మంది యూజర్లు: శామ్ ఆల్ట్‌మన్

Shaik Mohammad Shaffee
17 ఫిబ్రవరి, 2026

భారతదేశం సాంకేతిక విప్లవంలో మరో కీలక మైలురాయిని అధిగమించింది. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత చాట్‌బాట్ 'చాట్‌జీపీటీ'ని వినియోగించడంలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో ప్రతి వారం ఏకంగా 10 కోట్ల మందికి పైగా వినియోగదారులు దీనిని వాడుతున్నారని ఓపెన్‌ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మాన్ వెల్లడించారు. సోమవారం నుంచి న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్' నేపథ్యంలో ఓ జాతీయ పత్రికకు రాసిన ప్రత్యేక వ్యాసంలో ఆయన ఈ గణాంకాలను పంచుకున్నారు. అమెరికా తర్వాత భారత్ నుంచే అత్యధిక స్థాయిలో వినియోగం జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు.

అభ్యాసంలో విద్యార్థులదే పైచేయి

చాట్‌జీపీటీని విద్యార్థులు వినియోగించడంలో భారత్ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. వేగంగా నేర్చుకోవడానికి, కోడింగ్ సమస్యలను పరిష్కరించుకోవడానికి, పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి భారతీయ విద్యార్థులు ఏఐ సాంకేతికతను భారీగా ఉపయోగిస్తున్నారని ఆల్ట్‌మాన్ ప్రశంసించారు. దేశంలో ఉన్న అపారమైన సాంకేతిక నైపుణ్యం, ప్రభుత్వ జాతీయ ఏఐ వ్యూహం వంటివి రాబోయే రోజుల్లో భారత్‌ను ప్రపంచ ఏఐ రంగంలో అగ్రగామిగా నిలబెడతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శాస్త్రీయ పరిశోధనల కోసం రూపొందించించిన 'ప్రిజమ్' అనే ఉచిత సాధనాన్ని వినియోగించడంలోనూ భారత్ ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానంలో ఉందని ఆల్ట్‌మాన్ పేర్కొన్నారు.

వినియోగదారులకు చేరువగా ప్రత్యేక ఆఫర్లు

భారత మార్కెట్లోని ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఓపెన్‌ ఏఐ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సామాన్యులకు సైతం ఏఐ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు 5 డాలర్ల కంటే తక్కువ ధరకే 'చాట్‌జీపీటీ గో' అనే ప్లాన్‌ను గతంలో ప్రవేశపెట్టింది. దీనిని మరింతగా విస్తరించడంలో భాగంగా భారతీయ వినియోగదారులకు ఏడాది పాటు ఉచితంగా అందించింది. 2025 ఆగస్టులో న్యూఢిల్లీలో ప్రత్యేక కార్యాలయాన్ని ప్రారంభించిన ఓపెన్‌ ఏఐ, ప్రస్తుతం దేశంలోని స్వచ్ఛంద సంస్థలకు కూడా ఏఐ వినియోగంపై శిక్షణ ఇస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చాట్‌జీపీటీ వినియోగదారుల సంఖ్య 90 కోట్లకు చేరువవుతున్న తరుణంలో, భారత మార్కెట్ తమకు అత్యంత కీలకంగా మారిందని ఆల్ట్‌మాన్ పేర్కొన్నారు.

టెక్ దిగ్గజాల మధ్య ‘ఏఐ’ పోటీ

భారతదేశంలో ఏఐ రంగంలో పట్టు సాధించేందుకు దిగ్గజ సంస్థల మధ్య పోటీ తీవ్రమవుతోంది. గూగుల్ తన ‘జెమిని’ ఏఐని భారతీయ విద్యార్థులకు చేరువ చేసేందుకు ఏడాది పాటు ఉచితంగా ‘ఏఐ ప్రో’ సేవలను అందిస్తోంది. దీనికి తోడు రిలయన్స్ జియోతో జతకట్టి, సుమారు 50 కోట్ల మంది జియో కస్టమర్లకు 18 నెలల పాటు ఈ ప్రీమియం సేవలను ఉచితంగా ఇస్తోంది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం కూడా ‘ఇండియా ఏఐ మిషన్’ ద్వారా దేశీయంగా సాంకేతిక సామర్థ్యాన్ని పెంచుతూ, కొత్తగా వచ్చే స్టార్టప్ కంపెనీలకు అండగా నిలుస్తోంది. ఇలా అటు గ్లోబల్ కంపెనీలు, ఇటు ప్రభుత్వం పోటీపడి ఏఐని సామాన్యులకు అందుబాటులోకి తెస్తున్నాయి.