
భారత్–యూకే మధ్య రక్షణ సహకారం బలోపేతం
భారత్–యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య రక్షణ భాగస్వామ్యం మరింత బలపడుతోంది. ఈ క్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్, యూకే రాయల్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ సర్ హార్వే స్మిత్‌తో మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ద్వైపాక్షిక రక్షణ సహకారానికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఇన్‌స్ట్రక్టర్ల పరస్పర మార్పిడి, రెండు దేశాల మధ్య సహకారానికి కీలకంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. రక్షణ గూఢచారి సమాచార భాగస్వామ్యంలో గణనీయమైన పురోగతి సాధించినట్లు తెలిపారు. 17వ మిలిటరీ సబ్ గ్రూప్ సమావేశం విజయవంతంగా నిర్వహించినందుకు సీడీఎస్ అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో మరింత సమగ్ర, ఆధునిక రక్షణ భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసేందుకు విశ్వాసం వ్యక్తం చేశారు.
యూకే ఎయిర్ చీఫ్ సర్ హార్వే స్మిత్ సోమవారం నుంచి మూడు రోజుల భారత పర్యటనను ప్రారంభించారు. ఈ పర్యటన ద్వారా ముఖ్యంగా ఎయిర్ డొమైన్‌లో రెండు దేశాల మధ్య శిక్షణ, ఆపరేషనల్ మార్పిడి, వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత విస్తరించనుంది. పర్యటనలో భాగంగా ఆయన జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం భారత వాయుసేన అందించిన గార్డ్ ఆఫ్ ఆనర్‌ను స్వీకరించారు. అలాగే భారత వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మారుతున్న భద్రతా సవాళ్లు, రెండు దేశాల వైమానిక దళాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్–యూకే మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, భారత వాయుసేనకు చెందిన ముగ్గురు అర్హత కలిగిన ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్లు యూకేలోని రాయల్ ఎయిర్ ఫోర్స్ వ్యాలీ(ఆర్ఏఎఫ్)లో సేవలందించనున్నారు. ఇప్పటికే ఒక భారతీయ ఇన్‌స్ట్రక్టర్ ఆర్ఏఎఫ్ కాలేజ్ క్రాన్‌వెల్‌లో పనిచేస్తున్నారు. ఇద్దరు ఎయిర్ చీఫ్‌లు గ్వాలియర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌ను కూడా సందర్శించనున్నారు. అక్కడ భారత వాయుసేన ఆపరేషనల్ విధానాలు, అభివృద్ధి చెందుతున్న వైమానిక ముప్పులను ఎదుర్కొనే పద్ధతులపై చర్చించనున్నారు. భారత్‌తో రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం గర్వకారణమని సర్ హార్వే స్మిత్ పేర్కొన్నారు. పరస్పర విశ్వాసం, వృత్తిపరమైన నైపుణ్యం, సంయుక్త నిబద్ధత ఈ సహకారానికి బలమైన ఆధారమని తెలిపారు.
భారత్‌లోని బ్రిటిష్ హైకమిషన్ రక్షణ సలహాదారు కమోడోర్ క్రిస్ సాండర్స్ మాట్లాడుతూ ఈ పర్యటన రెండు దేశాలు రక్షణ సహకారానికి ఇస్తున్న ప్రాధాన్యతను స్పష్టంగా తెలియజేస్తుందని చెప్పారు. భారత వాయుసేన ఇన్‌స్ట్రక్టర్లను యూకే శిక్షణ సంస్థల్లో నియమించడం, బహుళ రంగాల్లో సహకారం పెంచడం వంటి చర్యలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది నుంచి భారత్‌కు వచ్చిన అత్యున్నత స్థాయి నాలుగో రక్షణ పర్యటన ఇదేనని ఆయన తెలిపారు. దీంతో ఇరు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం నిరంతరం ముందుకు సాగుతోందని స్పష్టం అవుతోంది. పర్యటనలో భాగంగా యూకే ఎయిర్ చీఫ్ భారత పౌర, సైనిక నాయకత్వంతో కూడా సమావేశాలు నిర్వహించనున్నారు.
