
భారత్‌పై మళ్లీ సుంకాల హెచ్చరిక చేసిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. రష్యా నుంచి ముడి చమురు (ఆయిల్) కొనే విషయంలో భారత్ తన మాట వినాలని ఆయన ఒత్తిడి తెస్తున్నారు. ఒకవేళ రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపకపోతే, భారత్ నుంచి అమెరికాకు వచ్చే వస్తువులపై భారీగా పన్నులు (టారిఫ్స్) బాదుతామని స్పష్టం చేశారు. "ఈ విషయంలో నన్ను సంతోషపెట్టడం భారత్‌కు చాలా ముఖ్యం, లేదంటే పన్నులను చాలా వేగంగా పెంచేస్తాం" అని ట్రంప్ హెచ్చరించారు. అంటే, రష్యాతో వ్యాపారం తగ్గిస్తేనే అమెరికా విధిస్తున్న పన్నుల భారం తగ్గుతుందని ఆయన పరోక్షంగా చెబుతున్నారు.
ప్రధాని మోడీపై ట్రంప్ వ్యాఖ్యలు
ఆదివారం అమెరికా అధ్యక్షుడి అధికారిక విమానం 'ఎయిర్ ఫోర్స్ వన్'లో ప్రయాణిస్తున్న సమయంలో ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. "ప్రధాని మోడీ చాలా మంచి వ్యక్తి. కానీ రష్యా నుంచి చమురు కొనడం నాకు ఏమాత్రం ఇష్టం లేదని ఆయనకు తెలుసు. నన్ను సంతోషంగా ఉంచడం భారత్‌కు అవసరం. వారు వ్యాపారం చేస్తున్నారు, మేము వారిపై చాలా సులభంగా పన్నులు పెంచగలం" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అమెరికా ఇప్పటికే భారతీయ వస్తువులపై దాదాపు 50 శాతం వరకు పన్నులు విధిస్తోంది. అందులో 25 శాతం పన్నులు కేవలం రష్యా నుంచి ఆయిల్ కొంటున్నందుకే శిక్షగా విధించినవి. ఇప్పుడు ట్రంప్ మళ్లీ హెచ్చరించడం అంటే, ఈ పన్నులు మరింత పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల అమెరికాకు ఎగుమతి అయ్యే భారతీయ వస్తువుల ధరలు పెరిగి, మన దేశ వ్యాపారాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
చమురు రాజకీయం..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు రాజకీయం ముదిరింది. వెనిజులా దేశంలో ప్రపంచంలోనే అత్యధికంగా చమురు నిల్వలు ఉన్నాయి. దాదాపు 300 బిలియన్ బ్యారెళ్లకు పైగా చమురు అక్కడ ఉన్నట్టు అంచనాలు చెబుతున్నాయి. అయితే అమెరికా ఆంక్షలు, పెట్టుబడుల లేమి కారణంగా అక్కడ చమురు ఉత్పత్తి భారీగా తగ్గింది. ప్రస్తుతం రోజుకు సుమారు 10 లక్షల బ్యారెళ్లే ఉత్పత్తి అవుతోంది. ఇటీవల అమెరికా వెనిజులాపై దాడులు చేయడంతో ఆయిల్ ధరల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. రష్యాను దెబ్బతీయాలంటే భారత్ వంటి దేశాలు రష్యా ఆయిల్ కొనడం ఆపేయాలని ట్రంప్ గట్టిగా భావిస్తున్నారు.
ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడానికి కొన్ని వారాల ముందే ప్రధాని మోడీతో ఫోన్‌లో మాట్లాడారు. ఆ సమయంలో ఇద్దరు నేతలు ఒక ముఖ్యమైన విషయంపై ఏకీభవించారు. దేశాల మధ్య వ్యాపార పరంగా కొన్ని విభేదాలు (టారిఫ్స్ గొడవలు) ఉన్నప్పటికీ, భారత్-అమెరికా మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయాలని వారు నిర్ణయించుకున్నారు. దీనికి కొనసాగింపుగా, రెండు దేశాల ఉన్నతాధికారులు కలిసి వ్యాపార సమస్యలను పరిష్కరించుకోవడానికి కొత్తగా చర్చలు కూడా మొదలుపెట్టారు.
బియ్యంపై కూడా పన్ను
అయితే, మోడీతో మాట్లాడటానికి కొద్ది రోజుల ముందే ట్రంప్ భారత్‌కు మరో హెచ్చరిక కూడా ఇచ్చారు. భారత్ నుంచి అమెరికాకు వచ్చే బియ్యంపై పన్నులు పెంచుతామని ఆయన బెదిరించారు. దీనికి కారణం అమెరికా రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులే. వైట్ హౌస్‌లో జరిగిన ఒక సమావేశంలో అమెరికా రైతు ప్రతినిధులు ట్రంప్‌ను కలిశారు. భారత్, చైనా, థాయ్‌లాండ్ వంటి దేశాలు చాలా తక్కువ ధరకే అమెరికాలోకి బియ్యాన్ని పంపిస్తున్నాయని (డంపింగ్), దీనివల్ల తమకు గిట్టుబాటు ధర లభించక నష్టపోతున్నామని వారు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్, అమెరికా రైతులను కాపాడుకోవడానికి భారతీయ బియ్యంపై సుంకాలు విధిస్తానని స్పష్టం చేశారు.
రష్యా చమురుపై భారత్ వాదన ఇదే!
రష్యా నుంచి భారత్ భారీ స్థాయిలో ముడి చమురు (ఆయిల్) కొనుగోలు చేయడంపై అమెరికాలోని వాషింగ్టన్ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే భారత్ మాత్రం తన నిర్ణయం సరైనదే అని గట్టిగా సమర్థించుకుంటోంది. దేశ ప్రజల అవసరాలకు సరిపడా చమురు ఉండాలన్నా, పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండాలన్నా రష్యా నుంచి తక్కువ ధరకు వచ్చే ఆయిల్ చాలా ముఖ్యమని భారత్ స్పష్టం చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ఇంధన భద్రతను కాపాడుకోవడానికి, ఎక్కడ తక్కువ ధరకు చమురు దొరికితే అక్కడ కొనడం తప్పనిసరి అని భారత్ చెబుతోంది. ఇతర దేశాల నుంచి చమురు కొనడం కంటే రష్యా నుంచి కొనడం వల్ల ధరలు అదుపులో ఉంటాయని, దీనికి వేరే మంచి మార్గం లేదని భారత్ భావిస్తోంది.
భారత్ అడుగు ఎటు?
అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా పన్నుల (టారిఫ్స్) హెచ్చరికలు జారీ చేయడంతో భారత్ చిక్కుల్లో పడింది. అమెరికా కోపానికి గురికాకుండా ఉండటం ఒకవైపు, రష్యా నుంచి వచ్చే చమురు లాభం మరోవైపు ఉన్న నేపథ్యంలో.. రానున్న రోజుల్లో భారత్ రష్యా నుంచి ఆయిల్ దిగుమతులను తగ్గిస్తుందా? లేక తన పంథాలోనే ముందుకు సాగుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
