Let's talk: editor@tmv.in
భారత్‌పై ద్వేషం కావాలనే రెచ్చగొడుతున్నారు: షేక్ హసీనా

భారత్‌పై ద్వేషం కావాలనే రెచ్చగొడుతున్నారు: షేక్ హసీనా

Shaik Mohammad Shaffee
23 డిసెంబర్, 2025

బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో మాజీ ప్రధాని షేక్ హసీనా, ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అతి తీవ్రవాద శక్తులకు బలం చేకూర్చుతూ, భారత్‌పై వ్యతిరేక భావాలను కావాలనే పెంచుతున్నారని ఆమె ఆరోపించారు. ఈ పరిణామాలు బంగ్లాదేశ్ అంతర్గత స్థిరత్వానికే కాకుండా, ప్రాంతీయ భద్రతకు కూడా ప్రమాదకరమని ఆమె పేర్కొన్నారు.

ఓ వార్తా సంస్థకు ఈమెయిల్ ఇంటర్వ్యూలో స్పందించిన షేక్ హసీనా, భారత్‌పై పెరుగుతున్న శత్రుత్వం సహజంగా రావడం లేదని, దీనిని తీవ్రవాద శక్తులే సృష్టిస్తున్నాయని అన్నారు. యూనస్ ప్రభుత్వం ఈ శక్తులను ప్రోత్సహించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆమె ఆరోపించారు. ఇటీవల జరిగిన ఉద్రిక్తతలు, దాడులు ముందే పన్నిన కుట్రలో భాగమేనని ఆమె వ్యాఖ్యానించారు.

భారత రాయబార కార్యాలయంపై దాడులు, మీడియా కార్యాలయాలపై దాడులు చేసినవారే ఇప్పుడు బంగ్లాదేశ్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని హసీనా అన్నారు. మైనారిటీలపై దాడులు జరగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. అలాంటి వ్యక్తులను అధికార పదవుల్లో నియమించడం, శిక్ష అనుభవిస్తున్న ఉగ్రవాదులను జైళ్ల నుంచి విడుదల చేయడం యూనస్ ప్రభుత్వం చేసిన తీవ్రమైన తప్పిదమని ఆమె విమర్శించారు.

భారత దౌత్య సిబ్బంది భద్రతపై న్యూఢిల్లీ వ్యక్తం చేస్తున్న ఆందోళనలు సమంజసమైనవేనని హసీనా స్పష్టం చేశారు. బాధ్యత గల ప్రభుత్వం అయితే రాయబార కార్యాలయాలను కాపాడి, బెదిరింపులకు పాల్పడిన వారిని శిక్షించేదని ఆమె అన్నారు. కానీ యూనస్ ప్రభుత్వం అల్లరి మూకలకు రక్షణ కల్పిస్తూ వారిని “యోధులు”గా అభివర్ణించడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు.

తనపై అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ఐసీటీ) ఇచ్చిన తీర్పును కూడా షేక్ హసీనా ఖండించారు. ఆ తీర్పు న్యాయంతో సంబంధం లేనిదని, పూర్తిగా రాజకీయ కక్షతో ఇచ్చినదని ఆమె అన్నారు. తనకు తన వాదన వినిపించే అవకాశం ఇవ్వలేదని, తనకు నచ్చిన న్యాయవాదులను కూడా అనుమతించలేదని ఆరోపించారు. ఈ ట్రిబ్యునల్‌ను అవామీ లీగ్‌ను రాజకీయంగా అంతమొందించేందుకు వాడుకున్నారని ఆమె వ్యాఖ్యానించారు.

అయినా కూడా బంగ్లాదేశ్ రాజ్యాంగ వ్యవస్థపై తన నమ్మకం చెడలేదని హసీనా తెలిపారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం తిరిగి ఏర్పడి, న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేసే రోజున న్యాయం గెలుస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

అవామీ లీగ్ లేకుండా ఎన్నికలేంటి?

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఎన్నికలపై కూడా హసీనా సందేహాలు వ్యక్తం చేశారు. అవామీ లీగ్ లేకుండా జరిగే ఎన్నికలు నిజమైన ఎన్నికలు కాదని, కేవలం “కిరీటం పెట్టే కార్యక్రమం” మాత్రమే అవుతాయని ఆమె అన్నారు. ప్రజల నుంచి ఒక్క ఓటు కూడా పొందని యూనస్ ప్రభుత్వం, తొమ్మిది సార్లు ప్రజల మద్దతుతో ఎన్నికైన అవామీ లీగ్‌ను నిషేధించేందుకు ప్రయత్నిస్తోందని ఆమె విమర్శించారు.

అవామీ లీగ్‌పై నిషేధం కొనసాగితే లక్షలాది మంది ప్రజలు ఓటు హక్కును కోల్పోతారని హసీనా హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏర్పడే ప్రభుత్వం ప్రజల మద్దతు లేని ప్రభుత్వంగా మారుతుందని, నైతిక హక్కు లేకుండా పాలన సాగిస్తుందని ఆమె అన్నారు.

భారత్-బంగ్లాదేశ్ స్నేహం చెక్కుచెదరదు

భారత్–బంగ్లాదేశ్ సంబంధాలపై మాట్లాడుతూ, భారత్ ఎన్నో దశాబ్దాలుగా బంగ్లాదేశ్‌కు అత్యంత నమ్మకమైన మిత్రదేశమని హసీనా గుర్తు చేశారు. ఈ బంధం చాలా లోతైనదని, తాత్కాలిక ప్రభుత్వాలు మారినా ఇది కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. భారత్‌తో సంబంధాలు దెబ్బతింటున్న పరిస్థితికి యూనస్ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలన్నారు.

సిలిగురి కారిడార్‌పై వ్యాఖ్యలు ప్రమాదకరం

సిలిగురి కారిడార్ (చికెన్ నెక్) గురించి కొంతమంది బంగ్లాదేశ్ నాయకులు చేసిన వ్యాఖ్యలను హసీనా తీవ్రంగా తప్పుబట్టారు. వాణిజ్యం, రవాణా, ప్రాంతీయ స్థిరత్వం కోసం భారత్‌పై ఆధారపడే దేశం, అదే దేశాన్ని బెదిరించేలా మాట్లాడటం ప్రమాదకరమని ఆమె అన్నారు. అలాంటి మాటలు బంగ్లాదేశ్ ప్రజల భావాలను ప్రతిబింబించవని ఆమె స్పష్టం చేశారు.

ఇస్లామిక్ తీవ్రవాద శక్తుల ప్రభావం పెరుగుతోందన్న ఆందోళనను కూడా హసీనా వ్యక్తం చేశారు. ఒకప్పుడు సురక్షితమైన, లౌకిక దేశంగా ఉన్న బంగ్లాదేశ్‌ను మళ్లీ అలానే చూడాలనేది కోట్లాది ప్రజల ఆశ అని ఆమె అన్నారు. ఈ పరిస్థితులు భారత్‌కే కాదు, దక్షిణ ఆసియా స్థిరత్వాన్ని కోరే ప్రతి దేశానికీ ఆందోళన కలిగించాల్సిన విషయమని షేక్ హసీనా హెచ్చరించారు.

భారత్‌పై ద్వేషం కావాలనే రెచ్చగొడుతున్నారు: షేక్ హసీనా - Tholi Paluku