Let's talk: editor@tmv.in
భారత్‌పై టారిఫ్‌లు 18 శాతానికి తగ్గింపు: ట్రంప్

భారత్‌పై టారిఫ్‌లు 18 శాతానికి తగ్గింపు: ట్రంప్

Shaik Mohammad Shaffee
3 ఫిబ్రవరి, 2026

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధానికి తెరపడింది. ఇరు దేశాల మధ్య చారిత్రక 'ట్రేడ్ డీల్' కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం రాత్రి ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న పరస్పర సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

మోదీ నా ఆప్తమిత్రుడు: ట్రంప్

తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్'లో ఈ వివరాలను వెల్లడించిన ట్రంప్.. ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. "ప్రధాని మోడీ నా అత్యంత సన్నిహిత మిత్రుడు. తన దేశాన్ని శక్తివంతంగా ముందుకు నడిపిస్తున్న గౌరవనీయ నేత. మేమిద్దరం కేవలం మాటలు చెప్పేవాళ్లం కాదు.. పనులు చేసి చూపించే వ్యక్తులం" అని ట్రంప్ కొనియాడారు. మోడీ అభ్యర్థన మేరకు, ఆయనపై గౌరవంతో తక్షణమే ఈ సుంకాల తగ్గింపు అమలులోకి వస్తుందని ప్రకటించారు.

రష్యా చమురుకు స్వస్తి..

భారత్-అమెరికా చారిత్రక వాణిజ్య ఒప్పందంలో భాగంగా రష్యా చమురు దిగుమతులను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. దీనికి ప్రత్యామ్నాయంగా అమెరికా, వెనిజులాల నుండి భారీగా ఇంధనాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ చర్య ఉక్రెయిన్ యుద్ధ ముగింపునకు కీలకం కానుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, అమెరికా నుండి ఎనర్జీ, టెక్నాలజీ, వ్యవసాయ రంగాల్లో సుమారు 500 బిలియన్ డాలర్ల మేర కొనుగోళ్లు జరిపేందుకు భారత్ సిద్ధమైంది. ప్రతిగా అమెరికా ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న టారిఫ్‌లు, ఇతర వాణిజ్య అడ్డంకులను క్రమంగా 'సున్నా' శాతానికి తగ్గించేందుకు ప్రధాని మోడీ అంగీకరించినట్లు ఆయన పేర్కొన్నారు.

140 కోట్ల మంది తరఫున కృతజ్ఞతలు: మోడీ

ట్రంప్ ప్రకటనపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. "నా ప్రియ మిత్రుడు ట్రంప్‌తో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై టారిఫ్‌లను 18 శాతానికి తగ్గించడం హర్షణీయం. 140 కోట్ల మంది భారతీయుల తరఫున ట్రంప్‌కు ధన్యవాదాలు" అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం ట్రంప్ నాయకత్వం ఎంతో అవసరమని, భారత్ ఆయనకు పూర్తి మద్దతు ఇస్తుందని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు.

బలపడనున్న ద్వైపాక్షిక బంధం

ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాల మధ్య ఉన్న ఆర్థిక అడ్డంకులు తొలగిపోవడమే కాకుండా, వ్యూహాత్మక భాగస్వామ్యం అపూర్వమైన శిఖరాలకు చేరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా ఈ పరిణామాన్ని ధృవీకరిస్తూ మరిన్ని శుభవార్తలు రాబోతున్నాయని సంకేతాలిచ్చారు. అయితే, ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి సాంకేతిక వివరాలను భారత ప్రభుత్వం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.