Let's talk: editor@tmv.in
భారత్-పాక్ ఫైనల్‌కు దుబాయ్ స్టేడియం ఫుల్

భారత్-పాక్ ఫైనల్‌కు దుబాయ్ స్టేడియం ఫుల్

Shaik Mohammad Shaffee
29 సెప్టెంబర్, 2025

ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం జరిగిన భారత్-పాకిస్థాన్ ఫైనల్ మ్యాచ్‌‌కు అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం ప్రేక్షకులతో నిండిపోయింది. ఈ మ్యాచ్‌కు సంబంధించి మొత్తం 28 వేల టికెట్లు అమ్ముడైనట్లు నిర్వాహకులు తెలిపారు. టోర్నమెంట్‌లో అంతకుముందు జరిగిన లీగ్ మ్యాచ్‌లకు కూడా ఈ దాయాది జట్ల పోరు భారీ సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించింది. సెప్టెంబర్ 14న జరిగిన గ్రూప్ మ్యాచ్‌కు 20 వేల మంది, సెప్టెంబర్ 21న జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్‌కు 17 వేల మంది ప్రేక్షకులు స్టేడియంలో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు.

స్టేడియం హౌస్ ఫుల్‌కు కారణాలివే!

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌తో భారత్‌ తొలిసారి తలపడిన టోర్నీ ఇదే. గ్రూప్ స్టేజ్‌లో 'బాయ్‌కాట్' ట్రెండింగ్ నడవడంతో దుబాయ్ స్టేడియం నిండలేదు. అస‌లు భారత్-పాక్‌ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ ఎక్కడా కనిపించలేదు. అప్పుడు మొదలైంది 'కరచాలనం' వివాదం. భారత ప్లేయర్లు పాక్ క్రికెటర్లకు షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడం, మ్యాచ్ విజయాన్ని పహల్గాం బాధితులు, సైన్యానికి అంకితం చేయడంతో టీమిండియా ఫ్యాన్స్‌ సంతృప్తి చెందారు. ఇక సూపర్-4 మ్యాచ్‌లో పాక్ ప్లేయర్లు రెచ్చగొట్టేలా ప్రవర్తించడంతో వాతావరణం మరింత వేడెక్కింది. ఇరుజట్ల ఆటగాళ్లపై ఐసీసీకి ఫిర్యాదులు చేయడం వరకూ వెళ్లింది. మూడోసారి కూడా భారత్-పాక్ తలపడనుండటంతో ఏమౌతుందోననే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అందుకే దుబాయ్ మైదానం సామర్థ్యానికి తగినట్లుగా 28 వేల టికెట్లూ అమ్ముడైపోయాయి. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో తొలిసారి భారత్-పాక్ ఫైనల్‌లో తలపడటం కూడా ఈ భారీ స్పందనకు ప్రధాన కారణమై ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

భారత్-పాక్ ఫైనల్‌కు దుబాయ్ స్టేడియం ఫుల్ - Tholi Paluku