
భారత్-పాక్ ఉద్రిక్తతలను మేమే ఆపాం: చైనా
భారత్-పాకిస్తాన్ మధ్య ఈ ఏడాది మే నెలలో జరిగిన సైనిక ఉద్రిక్తతలపై చైనా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ రెండు దేశాల మధ్య తలెత్తిన ఘర్షణలను తామే మధ్యవర్తిత్వం వహించి సర్దుమణిగేలా చేశామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ వెల్లడించారు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో వాషింగ్టన్ జోక్యం వల్లే యుద్ధం ఆగిందని చెప్పుకోగా, ఇప్పుడు చైనా కూడా అదే తరహాలో వాదించడం అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది.
బీజింగ్‌లో జరిగిన “అంతర్జాతీయ పరిస్థితులు, చైనా విదేశాంగ విధానం” సింపోజియంలో మాట్లాడిన వాంగ్ యీ, ప్రపంచవ్యాప్తంగా పలు సంఘర్షణల్లో చైనా కీలక పాత్ర పోషించిందన్నారు. మయన్మార్ ఉత్తర ప్రాంతం, ఇరాన్ అణు సమస్య, పాలస్తీనా–ఇజ్రాయెల్ వివాదంతో పాటు భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల పరిష్కారంలో కూడా చైనా మధ్యవర్తిగా వ్యవహరించిందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తమ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పంచుకుంది.
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యం
ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ లోయలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతిగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేపట్టింది. ఈ ఘటనతో రెండు దేశాల మధ్య నాలుగు రోజుల పాటు తీవ్ర సైనిక ఉద్రిక్తత నెలకొంది.
మధ్యవర్తిత్వాన్ని ఖండించిన భారత్
అయితే ఈ సంఘర్షణలో ఎలాంటి మూడో దేశం మధ్యవర్తిత్వం జరగలేదని భారత్ స్పష్టంగా చెబుతోంది. భారీ నష్టం చవిచూసిన తర్వాత పాకిస్తాన్ డీజీఎంఓ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్) స్వయంగా భారత డీజీఎంఓకు ఫోన్ చేసి కాల్పులు నిలిపివేయాలని కోరారని భారత్ వెల్లడించింది. ఇరు దేశాలు మే 10 నుంచి భూ, వాయు, సముద్ర మార్గాల్లో అన్ని సైనిక చర్యలు నిలిపివేయడానికి అంగీకరించాయని భారత్ స్పష్టం చేసింది.
చైనా పాత్రపై అనుమానాలు
చైనా తాజా వ్యాఖ్యలతో మరోసారి దాని పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్‌కు అత్యధిక ఆయుధాలు సరఫరా చేసే దేశం చైనానే. ఈ నేపథ్యంలో చైనా నిజంగా మధ్యవర్తిత్వం చేసిందా? లేక రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలా చెప్పుతోందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇదిలా ఉండగా, నవంబర్‌లో అమెరికా కాంగ్రెస్‌కు సలహా ఇచ్చే యూఎస్–చైనా ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ ఒక నివేదిక విడుదల చేసింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత చైనా తప్పుడు ప్రచారాన్ని నడిపిందని ఆ నివేదిక ఆరోపించింది. నకిలీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఏఐతో తయారైన విమాన శకలాల చిత్రాలు పంచి, ఫ్రాన్స్‌కు చెందిన రఫేల్ యుద్ధవిమానాల ప్రతిష్ఠను దెబ్బతీయాలని, తమ జే–35 విమానాలను ప్రోత్సహించాలని చైనా ప్రయత్నించిందని ఆ నివేదిక పేర్కొంది.
ఆపరేషన్ ప్రారంభంలో చైనా స్పందన
ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైన తొలి రోజే చైనా స్పందిస్తూ ఇరు దేశాలూ సంయమనం పాటించాలని కోరింది. అదే సమయంలో భారత సైనిక చర్య పట్ల విచారం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. తాజా పరిణామాలను గమనిస్తే, భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించిన ఘనతను తమ ఖాతాలో వేసుకునేందుకు అగ్రరాజ్యాలు పోటీ పడుతున్నట్లు స్పష్టమవుతోంది. అయితే భారత్ మాత్రం ఈ వాదనలను కచ్చితంగా తోసిపుచ్చుతోంది. ఈ ఉద్రిక్తతలు కేవలం ఇరు దేశాల మధ్య నేరుగా జరిగిన సైనిక స్థాయి చర్చల ద్వారానే పరిష్కారమయ్యాయని స్పష్టం చేస్తోంది.
