Let's talk: editor@tmv.in
భారత్‌తో సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

భారత్‌తో సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

Shaik Mohammad Shaffee
8 అక్టోబర్, 2025

త్వరలో స్వదేశంలో భారత్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌ల కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్లను మంగళవారం ప్రకటించింది. సొంతగడ్డపై జరిగే మూడు వన్డేలు, తొలి రెండు టీ20ల కోసం క్రికెట్ ఆస్ట్రేలియా వేర్వేరుగా జట్లను ఎంపిక చేసింది. నడుము నొప్పి నుంచి కోలుకుంటున్న రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ఈ సిరీస్‌లకు నాయకత్వం వహించనున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ వన్డే జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం విశేషం.

గత నెలలో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్క్, వెస్టిండీస్‌ టెస్ట్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆగస్టులో దక్షిణాఫ్రికాతో జరిగిన స్వదేశీ వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. స్టార్క్ చివరిసారిగా నవంబర్ 2024లో అడిలైడ్‌లో పాకిస్థాన్‌తో వన్డే ఆడాడు. స్టార్క్ వన్డే ఫార్మాట్‌లో తిరిగి రావడం టీమిండియా బ్యాట్స్‌మెన్‌కు గట్టి సవాల్ విస‌ర‌నుంది.

అక్టోబర్ 19 నుంచి వన్డే సిరీస్

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య అక్టోబర్ 19న పెర్త్‌లో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. స్టార్క్‌తో పాటు ఓపెనర్ మాథ్యూ షార్ట్, మాథ్యూ రెన్‌షా, మిచెల్ ఓవెన్ కూడా 50 ఓవర్ల జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఆరోన్ హార్డీ, మాథ్యూ కుహ్నెమాన్, మార్నస్ లబుషేన్‌లను వన్డే జట్టు నుంచి తప్పించారు. లబుషేన్ రాబోయే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కు సిద్ధమవుతూ దేశవాళీ షెఫీల్డ్ షీల్డ్ టోర్నమెంట్‌లో ఆడనున్నాడు. వన్డే సిరీస్‌లోని తొలి మ్యాచ్ (పెర్త్‌)కు అలెక్స్ క్యారీ దూరంగా ఉండనున్నాడు. న్యూజిలాండ్ పర్యటన కారణంగా షెఫీల్డ్ షీల్డ్‌లో తొలి మ్యాచ్ ఆడలేకపోయిన క్యారీ, అడిలైడ్ ఓవల్‌లో క్వీన్స్‌లాండ్‌తో జరిగే రెండో రౌండ్ షీల్డ్ మ్యాచ్‌లో ఆడతాడు.

టీ20 జట్టులోకి జోష్ ఇంగ్లిస్, నాథన్ ఎల్లిస్

సెలెక్టర్లు వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా వన్డే సిరీస్ తర్వాత భారత్‌తో జరిగే తొలి రెండు టీ20 మ్యాచ్‌ల కోసం మార్ష్ నాయకత్వంలో 14 మంది సభ్యులతో కూడిన జట్టును కూడా ప్రకటించారు. ఈ జట్టులో జోష్ ఇంగ్లిస్, నాథన్ ఎల్లిస్‌లకు చోటు దక్కింది. టీ20 ప్రపంచకప్, స్వదేశంలో టెస్ట్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఆటగాళ్ల పనిభారాన్ని సమన్వయం చేసేందుకే కేవలం రెండు టీ20లకు జట్టును ప్రకటించినట్లు సెలక్షన్ ఛైర్మన్ జార్జ్ బెయిలీ తెలిపారు.

తొలి వన్డే అక్టోబర్ 19న పెర్త్‌లో జరగనుండగా, రెండోది అక్టోబర్ 23న అడిలైడ్‌‌లో, మూడోది అక్టోబర్ 25న సిడ్నీలో జరుగుతాయి. ఆ తర్వాత ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అక్టోబర్ 29 (కాన్బెర్రా), అక్టోబర్ 31 (మెల్‌బోర్న్), నవంబర్ 2 (హోబర్ట్), నవంబర్ 6 (గోల్డ్ కోస్ట్),నవంబర్ 8 (బ్రిస్బేన్) తేదీల్లో జరుగుతాయి.

ఆస్ట్రేలియా వన్డే జట్టు

మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ క్యారీ, కూపర్ కొన్నోలీ, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా

ఆస్ట్రేలియా టీ20 జట్టు (తొలి రెండు మ్యాచ్‌లకు)

మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, టిమ్ డేవిడ్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కునెమాన్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా

కాగా భారత జట్టు ఇప్పటికే శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రీ ఎంట్రీతో బలంగా ఉంది. దీంతో రాబోయే సిరీస్‌లో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.

భారత్‌తో సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన - Tholi Paluku