
భారత్‌తో యుద్ధం తప్పదా?.. పాక్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
పొరుగు దేశం పాకిస్తాన్ మరోసారి భారత్‌పై విషం చిమ్మింది. భారత్ తమపై 'పరోక్ష యుద్ధం' చేస్తోందని, దీనివల్ల రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధం సంభవించే అవకాశం ఉందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్ 24 ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వంతో భారత్ చేతులు కలిపి పాక్‌లో అశాంతిని సృష్టిస్తోందని ఆరోపించారు.
ఆధారాలు లేవు.. కానీ ఆరోపణలే
ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌లో పెచ్చుమీరుతున్న ఉగ్రవాద కార్యకలాపాల వెనుక భారత్ హస్తం ఉందని ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఇస్లామాబాద్‌లో జరిగిన ఐసిస్ బాంబు పేలుళ్లు, సరిహద్దు వెంబడి తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) జరుపుతున్న దాడులకు భారతే కారణమని ఆయన ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఆయన ఎటువంటి నిర్దిష్ట ఆధారాలను చూపలేదు. కేవలం సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు, కాబూల్‌లోని తాలిబన్ పాలకులతో భారత్‌కు ఉన్న దౌత్యపరమైన సంబంధాలనే కారణంగా చూపుతూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
సరిహద్దులు దాటి దాడులకు సిద్ధం
అఫ్గాన్ గడ్డను పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా వాడుకుంటున్నారని ఆరోపించిన మంత్రి, అవసరమైతే తాము అఫ్గాన్ నగరాల్లోకి చొచ్చుకెళ్లి సరిహద్దు దాడులు చేస్తామని హెచ్చరించారు. పొరుగు దేశాల నుంచి తమకు ముప్పు పొంచి ఉన్నప్పుడు మౌనంగా ఉండబోమని బీరాలు పలికారు. 2025 మే నెలలో భారత్, పాక్ వాయుసేనల మధ్య జరిగిన భీకర ఘర్షణల తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు అత్యంత ఉద్రిక్తంగా ఉన్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
మౌనంగానే భారత్
పాక్ రక్షణ మంత్రి చేసిన ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలపై భారత్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ అంతర్జాతీయంగా ఒంటరైన పాకిస్తాన్, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే భారత్‌పై ఇటువంటి నిరాధార ఆరోపణలు చేస్తోందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మే 2025లో జరిగిన 'ఆపరేషన్ సిందూర్' వంటి పరిణామాల తర్వాత పాక్ మరింత ఆందోళనలో ఉన్నట్లు కనిపిస్తోంది.
