
భారత్-చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు
భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సాధారణ స్థితికి తీసుకొచ్చేలా మరో కీలక ముందడుగు పడింది. అక్టోబర్ నెలలోనే ఇరుదేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులను పునఃప్రారంభించనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం స్పష్టం చేసింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలు, వాణిజ్య కార్యకలాపాలను సులభతరం చేయడమే ఈ నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశమని విదేశాంగ శాఖ పేర్కొంది.
విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ, దాదాపు ఐదేళ్ల తర్వాత ఇరు దేశాల మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. "భారత, చైనీస్ పౌరుల నుండి నేరుగా విమాన సేవలను పునరుద్ధరించాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. విద్యార్థులు, వ్యాపారవేత్తలు డైరెక్ట్ విమానాలు లేకపోవడంతో సింగపూర్, బ్యాంకాక్, దుబాయ్ వంటి నగరాల మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది. దీని వలన సమయం, డబ్బు వృథా అవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని సంబంధాలను కొంతవరకు సాధారణ స్థితికి తీసుకొచ్చే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నాం" అని విదేశాంగ ప్రతినిధి తెలిపారు.
సరిహద్దు అంశంపై వైఖరిలో మార్పు లేదు
డైరెక్ట్ విమానాల పునరుద్ధరణ అంటే సరిహద్దు సమస్యలపై భారత వైఖరిలో మార్పు వచ్చిందని అర్థం కాదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. "సరిహద్దు అంశంపై మా వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న సమస్యలను పరిష్కరించడానికి మేము చైనాతో సైనిక, దౌత్య మార్గాల ద్వారా చర్చలు జరుపుతూనే ఉన్నాం. డైరెక్ట్ విమానాలను అనుమతించడం అనేది ఆ చర్చలకు ఏ విధంగానూ ఆటంకం కలిగించదు" అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
ఈ తాజా పురోగతికి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఆగస్టులో భారత్‌లో పర్యటించిన సమయంలో తీసుకున్న నిర్ణయాలే కారణం. ఆగస్టులో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో వాంగ్ యీ జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో ఇరువురూ చైనా, భారత్‌ల మధ్య నేరుగా విమాన సర్వీసులను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని అంగీకరించారు. ఇరు దేశాల మధ్య పర్యాటకులు, వ్యాపారులు, మీడియా, ఇతర సందర్శకులకు వీసాల మంజూరును సులభతరం చేయడానికి కూడా వారు ఆమోదం తెలిపారు.
వాణిజ్యం, విద్యకు ఊతం
2020లో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అప్పటినుండి విమాన సర్వీసులు నిలిచిపోవడంతో వేలాది మంది భారతీయ విద్యార్థులు చైనాకు తిరిగి వెళ్లడానికి, ఇరు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా తాజా నిర్ణయం ముఖ్యంగా చైనాలోని విశ్వవిద్యాలయాలలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు, అలాగే ఇరు దేశాల మధ్య విస్తృతమైన వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న వ్యాపారవేత్తలకు గొప్ప ఉపశమనం కలిగించనుంది.
మొదటి దశలో వారానికి పరిమిత సంఖ్యలో విమానాలను నడపడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. రాబోయే నెలల్లో ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి, విమానాల సంఖ్యను పెంచే అవకాశం ఉంది. ఈ చర్య కేవలం ప్రయాణ సౌలభ్యాన్ని పెంపొందించడానికి మాత్రమే కాకుండా, కొంతవరకు ఇరు దేశాల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించడానికి ఒక సానుకూల సంకేతంగా చెప్పవచ్చు.
