
భారత్-కెనడా మధ్య చారిత్రాత్మక ‘యురేనియం’ ఒప్పందం
భారత ఇంధన రంగాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేలా కెనడాతో చారిత్రక యూరేనియం ఒప్పందం కుదిరింది. భారత అణు విద్యుత్ కేంద్రాలకు అవసరమైన యూరేనియంను దీర్ఘకాలికంగా సరఫరా చేసేందుకు కెనడాకు చెందిన 'కామెకో', భారత అణుశక్తి విభాగం మధ్య 2.6 బిలియన్ కెనడియన్ డాలర్ల (సుమారు రూ.17 వేల కోట్ల పైమాటే) భారీ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ప్రధాని నరేంద్ర మోడీ, కెనడా ప్రధాని మార్క్ కార్నీ మధ్య సోమవారం జరిగిన చర్చల్లో ఈ కీలక నిర్ణయం వెలువడింది. దేశీయ అణు ఇంధన అవసరాలకు ఈ ఒప్పందం వెన్నెముకగా నిలవనుంది.
స్నేహం చిగురించింది!
గత కొంతకాలంగా రెండు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు ఈ పర్యటనతో తెరపడింది. భారత ప్రధాని ఆహ్వానం మేరకు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2 వరకు కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో భారత్‌లో పర్యటించారు. 2018 తర్వాత కెనడా ప్రధాని భారత్‌కు రావడం ఇదే తొలిసారి. 'వసుధైవ కుటుంబకమ్' (ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు) నినాదాన్ని ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యానికి మార్గదర్శక సూత్రంగా ప్రకటించడం విశేషం.
ఇంధన భద్రత: అణు శక్తి నుంచి క్లీన్ ఎనర్జీ వరకు..
కేవలం యూరేనియం మాత్రమే కాకుండా, భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఇంధన వినియోగదారుగా ఉన్న నేపథ్యంలో, కెనడా నుండి భారీగా ముడి చమురు, ఎల్‌ఎన్‌జీ దిగుమతి చేసుకోవాలని నిర్ణయించారు. అంతర్జాతీయ సౌర కూటమిలో కెనడా సభ్యత్వం పొందడాన్ని భారత్ స్వాగతించింది. క్లీన్ ఎనర్జీ, హైడ్రోజన్, బయో ఇంధనాల రంగాల్లో సహకారం కోసం ప్రత్యేక ఎంఓయూలు కుదిరాయి.
రక్షణ, అంతరిక్ష రంగాల్లో..
భారత్, కెనడాలు రక్షణ రంగంలో కలిసి పనిచేయాలని కీలక నిర్ణయం తీసుకున్నాయి. ముఖ్యంగా దేశ భద్రతకు ముప్పుగా మారిన తీవ్రవాదం, సైబర్ నేరాలు, గ్యాంగ్‌స్టర్ల నెట్‌వర్క్‌లను ఉమ్మడిగా అరికట్టేందుకు ఇరు దేశాల భద్రతా సలహాదారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. సముద్ర మార్గాల్లో భద్రతను పెంచడంతో పాటు, రక్షణ రంగానికి కావాల్సిన విడిభాగాల సరఫరాలో ఒకరికొకరు సహకరించుకోనున్నారు. అటు అంతరిక్ష రంగంలోనూ ఇస్రో, కెనడా అంతరిక్ష సంస్థలు చేతులు కలిపాయి. దీని ద్వారా అంతరిక్ష రోబోలు, మానవ సహిత వ్యోమయాత్రలు, అత్యాధునిక కమ్యూనికేషన్ టెక్నాలజీ వంటి రంగాల్లో సంయుక్తంగా పరిశోధనలు చేయనున్నారు.
డిజిటల్ విప్లవం-వాణిజ్య లక్ష్యాలు
ఆర్థిక సంబంధాలను మరింత వేగవంతం చేసేందుకు ఇరు దేశాలు 'ఆర్ధిక మంత్రుల ఆర్థిక చర్చల'ను ప్రారంభించాయి. భారత యూపీఐ తరహాలో తక్షణ చెల్లింపుల వ్యవస్థను కెనడాలోనూ అనుసంధానించడంపై కసరత్తు మొదలైంది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 70 బిలియన్ కెనడియన్ డాలర్లకు (సుమారు రూ.4.65 లక్షల కోట్లు) చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలను 2026 చివరి నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు.
విద్య, సాంకేతికత రంగాల్లో..
ఏఐసీటీఈతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఏటా 300 మంది భారతీయ విద్యార్థులు కెనడా వర్సిటీల్లో రీసెర్చ్ చేసే అవకాశం లభిస్తుంది. అలాగే కెనడాలోని ప్రముఖ విద్యా సంస్థలు భారత్‌లోనే తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయబోతున్నాయి. వ్యవసాయం, వైద్యం, విద్యుత్ రంగాల్లో అత్యాధునిక 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' సాంకేతికతను వాడేందుకు భారత్, కెనడా, ఆస్ట్రేలియాలు చేతులు కలిపాయి. దీనివల్ల రైతులకు, రోగులకు మేలు జరుగుతుంది. మరోవైపు భారత్ ట్రైబల్ ఫెస్టివల్ 2026 ద్వారా గిరిజన కళలను, నైపుణ్యాలను ప్రపంచానికి చాటిచెప్పడంతో పాటు, హర్యానాలో పప్పుధాన్యాల పరిశోధన కోసం ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆహార భద్రతకు పెద్దపీట వేయనున్నారు.
భారత్ ఆతిథ్యంపై కెనడా ప్రధాని ప్రశంసలు
భారత్ అందించిన అపూర్వ ఆతిథ్యంపై కెనడా ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య నమ్మకం మరింత బలపడిందని, ఇది కేవలం వ్యాపార ఒప్పందాలకే పరిమితం కాకుండా.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాలకు ఒక గట్టి చిహ్నంగా నిలుస్తుందని ఇరు దేశాల అధినేతలు తమ ఉమ్మడి ప్రకటనలో స్పష్టం చేశారు.
