
భారత్‌కు 3 పురాతన విగ్రహాలు.. తిరిగి ఇవ్వనున్న అమెరికా
దశాబ్దాల క్రితం తమిళనాడులోని పురాతన ఆలయాల నుంచి అపహరణకు గురై, సముద్రాలు దాటి అమెరికా చేరిన మూడు అమూల్యమైన ప్రాచీన విగ్రహాలు ఎట్టకేలకు తిరిగి స్వదేశానికి చేరుకోనున్నాయి. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక 'స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్' వద్ద ఉన్న ఈ విగ్రహాలు దొంగిలించినవేనని పరిశోధనల్లో తేలడంతో, వాటిని భారత్‌కు అప్పగించేందుకు మ్యూజియం అధికారులు అంగీకరించారు. ఈ మేరకు అమెరికాలోని భారత రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ నమగ్యా ఖంపా, మ్యూజియం డైరెక్టర్ చేజ్ రాబిన్సన్ మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది.
విగ్రహాల నేపథ్యం
తిరిగి రానున్న విగ్రహాల్లో 9వ శతాబ్దానికి చెందిన శివ నటరాజ కాంస్య విగ్రహం, 12వ శతాబ్దపు శివ-ఉమ (సోమస్కంద) విగ్రహం, 16వ శతాబ్దానికి చెందిన భక్త సుందరార్-పరవి విగ్రహం ఉన్నాయి. ఇవన్నీ తమిళనాడులోని వివిధ ఆలయాల నుంచి అక్రమంగా తరలించబడినట్లు శాస్త్రీయ ఆధారాలతో నిరూపితమైంది. ఫ్రెంచ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాండిచ్చేరి వద్ద ఉన్న పాత ఫోటోలు ఈ విగ్రహాల అసలు మూలాలను గుర్తించడంలో కీలక పాత్ర పోషించాయి. 1950వ దశకంలో ఈ విగ్రహాలు ఆయా ఆలయాల్లో ఉన్నట్లు ఫోటో సాక్ష్యాలు లభించాయి.
ఆలయాల వారీగా వివరాలు
పరిశోధనలో తేలిన వివరాల ప్రకారం.. 16వ శతాబ్దపు 'సుందరార్-పరవి' విగ్రహం కల్లకురిచ్చి తాలూకాలోని వీరసోళపురం శివాలయం నుంచి అపహరణకు గురైంది. 12వ శతాబ్దపు 'సోమస్కంద' విగ్రహం మన్నార్గుడి తాలూకాలోని ఆలత్తూరు విశ్వనాథ ఆలయానికి చెందినదిగా గుర్తించారు. ఇక 9వ శతాబ్దపు 'శివ నటరాజ' విగ్రహం తంజావూరు జిల్లా తిరుత్తురైపూండిలోని శ్రీ భవ ఔషధీశ్వర ఆలయానికి చెందినది. ఈ నటరాజ విగ్రహాన్ని 2002లో న్యూయార్క్‌లోని ఒక గ్యాలరీ నుంచి మ్యూజియం కొనుగోలు చేయగా, మిగిలిన రెండు విగ్రహాలను 1987లో ఆర్థర్ ఎం. సాక్లర్ అనే వ్యక్తి విరాళంగా ఇచ్చారు.
సందర్శనార్థం నటరాజ విగ్రహం
ఒప్పందం ప్రకారం ఈ మూడు విగ్రహాలు భారత్‌కు చెందుతాయని మ్యూజియం స్పష్టం చేసింది. అయితే భారతీయ కళా వైభవాన్ని, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు వీలుగా 9వ శతాబ్దపు నటరాజ విగ్రహాన్ని ప్రస్తుతం మ్యూజియంలోనే సందర్శకుల వీక్షణ కోసం ఉంచనున్నారు. ఇది 'లోన్' (అప్పు) ప్రాతిపదికన అక్కడ కొనసాగుతుంది. ఈ విగ్రహాల వాపసు దేశ సంస్కృతిని కాపాడుకోవడంలో సాధించిన మరో గొప్ప విజయమని భారత రాయబార కార్యాలయం హర్షం వ్యక్తం చేసింది.
