Let's talk: editor@tmv.in
భారత్‌కు వెనిజులా చమురు: ట్రంప్

భారత్‌కు వెనిజులా చమురు: ట్రంప్

Shaik Mohammad Shaffee
2 ఫిబ్రవరి, 2026

అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో భారత్ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇరాన్ నుంచి చమురు దిగుమతులకు స్వస్తి పలికి, ఆ స్థానంలో వెనిజులా నుంచి ముడి చమురును కొనుగోలు చేసేందుకు భారత్ సిద్ధమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు భారత్ ఇప్పటికే ఒక 'అవగాహన ఒప్పందం' కుదుర్చుకుందని ఆయన వెల్లడించారు. ఫ్లోరిడా పర్యటన నిమిత్తం 'ఎయిర్ ఫోర్స్ వన్' విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

వ్యూహాత్మక మార్పు.. ఇరాన్ స్థానంలో వెనిజులా

గతంలో ఇరాన్ నుంచి భారత్ భారీగా చమురును దిగుమతి చేసుకునేది. అయితే 2019లో అమెరికా విధించిన ఆంక్షల నేపథ్యంలో ఆ దిగుమతులు నిలిచిపోయాయి. ప్రస్తుతం రష్యా నుంచి రాయితీపై చమురు పొందుతున్న భారత్, ఇప్పుడు వెనిజులా వైపు మొగ్గు చూపుతోందని ట్రంప్ పేర్కొన్నారు. "భారత్ రంగంలోకి దిగుతోంది. వారు ఇరాన్ నుంచి కాకుండా వెనిజులా నుండి చమురు కొనబోతున్నారు. ఇది ఇప్పటికే ఖరారైన ఒప్పందం" అని ఆయన స్పష్టం చేశారు. కేవలం భారత్ మాత్రమే కాకుండా, చైనా కూడా వెనిజులా చమురును కొనుగోలు చేయడాన్ని తాము స్వాగతిస్తామని ట్రంప్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

అమెరికా పర్యవేక్షణలో వెనిజులా చమురు విక్రయాలు

వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలాస్ మదురోను సైనిక చర్య ద్వారా అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిందని, ఆ ప్రభుత్వంతో అమెరికాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ నేపథ్యంలో వెనిజులా సుమారు 5.2 బిలియన్ డాలర్ల విలువైన 50 మిలియన్ బ్యారెళ్ల చమురును విక్రయించేందుకు ఆఫర్ చేయగా, అమెరికా దాన్ని అంగీకరించినట్లు ఆయన చెప్పారు. వెనిజులాలోని సహజ వనరులు, ముఖ్యంగా చమురు నిల్వలపై అమెరికాకు పూర్తి అధికారం ఉండాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే 500 మిలియన్ డాలర్ల విలువైన వెనిజులా చమురును అమెరికా విక్రయించగా, ఆ విక్రయాల ద్వారా వచ్చిన నగదును ఖతార్‌లోని ప్రత్యేక బ్యాంకు ఖాతాల్లో భద్రపరుస్తున్నట్లు వెల్లడించారు.

మోడీ- రోడ్రిగ్జ్ చర్చల ప్రాధాన్యత

ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు సరిగ్గా ఒకరోజు ముందే ప్రధాని నరేంద్ర మోడీ వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ఫోన్ ద్వారా మాట్లాడటం విశేషం. ఈ సంభాషణలో వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, ఆరోగ్యం, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ అంశాలపై సమన్వయంతో పాటు ‘గ్లోబల్ సౌత్’ దేశాల అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని ఇరు దేశాలు అంగీకరించినట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

భారత్‌పై ఆంక్షల ఒత్తిడి

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా ఇప్పటికే భారత్‌పై 50 శాతం టారిఫ్‌లు విధించింది. ఇందులో సగం అంటే 25 శాతం కేవలం రష్యా చమురు దిగుమతుల కోసమే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో అమెరికా అండతో వెనిజులా నుంచి చమురు దిగుమతులు చేసుకోవడం భారత్ ఇంధన భద్రతకు కీలకం కానుంది. అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.