Let's talk: editor@tmv.in
భారత్‌కు మరో 30 వేల పైలట్లు అవసరం

భారత్‌కు మరో 30 వేల పైలట్లు అవసరం

Panthagani Anusha
16 నవంబర్, 2025

భారతీయ విమానయాన రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాబోయే సంవత్సరాల్లో దేశానికి మరో 30 వేల పైలట్లు అవసరం అవుతారని కేంద్ర పౌర విమానయాన మంత్రి కే. రామ్మోహన్ నాయుడు తెలిపారు. విశాఖపట్నంలో జరుగుతున్న 30వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు.

1,700 కొత్త విమానాలు

ప్రస్తుతం భారతీయ ఎయిర్‌లైన్స్ కంపనీలు 1,700 విమానాల కొనుగోలు ఆర్డర్‌లు ఇచ్చమ ని, వీటి కోసం భారీ స్థాయిలో పైలట్లు కావాల్సి వస్తుందని మంత్రి తెలిపారు.

ప్రస్తుతం దేశంలో 834 విమానాల నౌకాదళానికి 8,000 పైలట్లు ఉన్నప్పటికీ వీరిలో 2,000 నుంచి 3,000 పైలట్లు ప్రస్తుతం డ్యూటీలో లేరని వివరించారు.

అయితే ఒక విమానాన్ని షెడ్యూల్ ప్రకారం నడిపేందుకు 10నుంచి15 పైలట్లు అవసరమవుతారని, ఈ లెక్క ప్రకారం రాబోయే సంవత్సరాల్లో దేశానికి 25,000 నుండి 30,000 పైలట్లు అదనంగా కావాల్సివస్తుంది అని ఆయన వివరించారు.

పైలట్ల తయారీలో లోటు

దేశంలో ఉన్న ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్లు పరిమితంగా పైలట్లను తయారు చేస్తున్నందున, వీటి సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. విమానయాన రంగంలో ఒక ఉద్యోగం ద్వారా 15 పరోక్ష ఉద్యోగాలు సృష్టవుతాయని, విమానయాన రంగం దేశ ఆర్థికవ్యవస్థకు ప్రధాన బలం అని వెల్లడించారు. అమెరికాలో ఫెడెక్స్ కంపెనీకి ఉన్న ప్రత్యేక కార్గో ఎయిర్‌పోర్టు తరహాలోనే భారత్‌లో కూడా ప్రత్యేక కార్గో విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని కేంద్రం ఆలోచిస్తుందని,కార్గో రవాణా రైలు, రోడ్డు రవాణా నుంచి పెద్ద ఎత్తున పోటీ ఎదుర్కొంటోందని, అందుకే ప్రత్యేక కార్గో సదుపాయాలు అవసరమని అన్నారు.

అదేవిధంగా ప్రస్తుతం భారత దేశం 2 బిలియన్ డాలర్ల విలువైన ఏరోస్పేస్ పరికరాలు తయారు చేస్తోందని, 2030 నాటికి దీన్ని 4 బిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. రోజుకు సగటున 4.8 లక్షల మంది దేశంలో విమాన ప్రయాణం చేస్తున్నారు నవంబర్ 10న 5.3 లక్షల మంది ప్రయాణించడం విశేషమని తెలిపారు.

భారత్‌కు మరో 30 వేల పైలట్లు అవసరం - Tholi Paluku