
భారత్‌కు ‘జావెలిన్’ క్షిపణులు.. డీల్‌కు అమెరికా ఆమోదం
భారత్, అమెరికా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతోంది. దీనికి నిదర్శనంగా దాదాపు 90 మిలియన్ డాలర్లకు పైగా విలువైన అధునాతన సైనిక పరికరాల విక్రయానికి అమెరికా ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. ఈ కీలక ఒప్పందం ద్వారా, మన దేశం జావెలిన్ యాంటీ-ట్యాంక్ క్షిపణి వ్యవస్థలను, ఎక్స్‌కాలిబర్ ప్రెసిషన్-గైడెడ్ ఆర్టిలరీ ప్రొజెక్టైల్స్‌ను అమెరికా నుంచి కొనుగోలు చేయనుంది.
ఒప్పందంలో ఏమేమి ఉన్నాయి?
డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ డీల్‌లో ప్రధానంగా రెండు రకాల ఆయుధాలు ఉన్నాయి. అందులో మొదటిది, ముఖ్యమైనది జావెలిన్ క్షిపణి వ్యవస్థ. దీని విలువ సుమారు 45.7 మిలియన్ డాలర్లు (రూ. 405 కోట్లు). దీని కింద 100 ఎఫ్ జీఎం-148 జావెలిన్ క్షిపణులు, 25 తేలికపాటి కమాండ్ లాంచ్ యూనిట్లు భారత్‌కు అందనున్నాయి. రెండోది ఎక్స్‌కాలిబర్ ప్రొజెక్టైల్స్. దీని విలువ సుమారు 47.1 మిలియన్ డాలర్లు (రూ. 417 కోట్లు). దీని కింద 216 ఎం982ఏ1 ఎక్స్‌కాలిబర్ ప్రెసిషన్ రౌండ్స్ వస్తాయి. ఈ ఆయుధాలతో పాటు, వాటి నిర్వహణ, శిక్షణ, సాంకేతిక సహాయం, విడిభాగాలను కూడా అమెరికా అందించనుంది.
జావెలిన్ క్షిపణి స్పెషల్ ఏంటి?
జావెలిన్ క్షిపణిని యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ అంటారు. ఇది ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన క్షిపణి వ్యవస్థ. దీనిని సైనికులు తమ భుజంపై నుంచే శత్రు ట్యాంకులకు గురిపెట్టి ప్రయోగించవచ్చు. అందుకే దీనికి జావెలిన్ అని పేరు వచ్చింది. ఇతర క్షిపణులు పేలిన వెంటనే పొగ, వేడి బయటకు వస్తాయి, శత్రువులు సులువుగా పసిగట్టగలరు. కానీ జావెలిన్ క్షిపణి మోటార్ ట్యూబ్ నుంచి కొంత దూరం వెళ్ళాకనే పనిచేయడం మొదలుపెడుతుంది. దీంతో ఎక్కడి నుంచి ప్రయోగించారో శత్రువు వెంటనే గుర్తించలేడు. ఈ లోపు మన సైనికులు సురక్షిత ప్రాంతానికి వెళ్లవచ్చు. శత్రు ట్యాంకులపై ఉండే రక్షణ కవచాన్ని కూడా ఛేదించేలా ఇందులో రెండు దశల పేలుడు పదార్థాలను అమర్చారు. మొదటి దశలో కవచం ఛేదిస్తే, రెండో దశలో వార్‌హెడ్ ట్యాంకును పూర్తిగా ధ్వంసం చేస్తుంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు చెందిన టీ-72, టీ-90 వంటి అనేక ట్యాంకులను ఈ జావెలిన్ క్షిపణులు ధ్వంసం చేశాయి. అందుకే వీటిని అక్కడ 'దేవదూత'తో పోల్చారు.
ఎక్స్‌కాలిబర్ ప్రొజెక్టైల్స్ అంటే ఏంటి?
ఎక్స్‌కాలిబర్ అనేది జీపీఎస్ సాంకేతికతతో పనిచేసే ఫిరంగి గుండు (ఆర్టిలరీ రౌండ్). సాధారణ ఫిరంగి గుండ్లతో పోలిస్తే, ఇవి చాలా ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తాయి. దీంతో మన సైన్యం చేసే మొదటి దాడిలోనే గురి తప్పకుండా శత్రువును దెబ్బతీయగలదు. అమెరికా రక్షణ సంస్థ ఈ ఒప్పందంపై మాట్లాడుతూ, ఈ విక్రయం వల్ల ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని తెలిపింది. ఈ అత్యాధునిక ఆయుధాలు భారత సరిహద్దు రక్షణ సామర్థ్యాన్ని, భవిష్యత్తులో ఎదురయ్యే ముప్పులను ఎదుర్కొనే శక్తిని మరింత పెంచుతాయి. ఇండో-పసిఫిక్, దక్షిణాసియా ప్రాంతాలలో రాజకీయ స్థిరత్వం, శాంతి, ఆర్థిక పురోగతికి భారత్ ఒక ముఖ్యమైన శక్తి అని అమెరికా పేర్కొంది. ఈ ఒప్పందంతో దక్షిణాసియాలో సైనిక సమతుల్యత ఏమీ మారదని అమెరికా స్పష్టం చేసింది. గతంలో కుదిరిన పదేళ్ల రక్షణ సహకార ఒప్పందం తర్వాత ఈ విక్రయానికి ఆమోదం లభించడం రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనం.
భారత్ ఈ ఒప్పందం ఎందుకు చేసుకుంది?
భారత్ ఈ ఆయుధ వ్యవస్థలను కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం చైనా-పాకిస్తాన్ సరిహద్దుల్లో పెరుగుతున్న భద్రతా బెదిరింపులను ఎదుర్కోవడం, ఖచ్చితమైన దాడి సామర్థ్యాన్ని పెంచుకోవడం. ఈ కొనుగోలుతో భారత్‌కు అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేసే అవకాశం, సైనికుల భద్రత పెరగడం, శత్రువు ట్యాంకులు, స్థావరాలను సమర్థవంతంగా లక్ష్యం చేసే సామర్థ్యం వంటి కీలక ప్రయోజనాలు లభిస్తాయి.
అయితే ఈ ఆయుధాలు చాలా ఖరీదైనవి. భారత్ అమెరికా నుంచి కొనుగోలు చేసే ఆయుధాలను (జావెలిన్ క్షిపణులు, ఎక్స్‌కాలిబర్ ప్రొజెక్టైల్స్ వంటివి) వాడుతున్నంత కాలం, వాటి నిర్వహణ, మరమ్మత్తులు, విడిభాగాలు, సాంకేతిక సహాయం కోసం భారత్ తప్పనిసరిగా అమెరికాపై ఆధారపడాల్సి వస్తుంది.
ఈ ఒప్పందం అమెరికాకు ఆర్థిక లాభాన్ని అందించడంతో పాటు, తన డిఫెన్స్ కంపెనీలకు భారీ వ్యాపారం కల్పిస్తుంది. అదేవిధంగా, భారత్‌తో వ్యూహాత్మక బంధం మరింత బలపడటం ద్వారా, చైనాను ఎదుర్కొనేందుకు భారతదేశాన్ని కీలక భాగస్వామిగా కొనసాగించే అవకాశం అమెరికాకు దక్కుతుంది.
