
భారత్-ఆస్ట్రేలియా సైనిక, ఉగ్రవాద వ్యతిరేక సహకారం విస్తరణ
2025 అక్టోబర్ 29 నుండి 31 వరకు కాన్‌బెర్రాలో జరిగిన తాజా ఆర్మీ-టు-ఆర్మీ స్టాఫ్ చర్చల్లో, ఉభయ దేశాలు ఉభయచర కార్యకలాపాలు (సముద్రం నుండి భూమిపైకి దాడి చేయడాన్ని లేదా దళాలను తరలించడo) లో మానవరహిత విమాన వ్యవస్థలు వాటి తయారీ రంగాలలో సైనిక సహకారాన్ని విస్తరించడం గురించి చర్చించాయి.
కాన్‌బెర్రాలో ఉగ్రవాద నిరోధకతపై 15వ భారత్, ఆస్ట్రేలియా సంయుక్త కార్యాచరణ బృందం జరిపిన చర్చల తర్వాత ఈ సమావేశం జరిగింది. అక్టోబర్ 29 నుండి 31 వరకు జరిగిన రెండు రోజుల ఉగ్రవాద నిరోధక సమావేశంలో, ఇరు దేశాల సైన్యాలు తమ ఉమ్మడి తీరప్రాంత భద్రతను 'ఇండో-పసిఫిక్' ప్రాంతంలో ఆపద సమయాల్లో స్పందించే సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ రంగంలో శిక్షణ, సమన్వయాన్ని విస్తరించాలని చూస్తున్నాయి. అలాగే డ్రోన్ ల తయారీ, వినియోగం వాటి ద్వారా సేకరించిన సమాచారాన్ని పంచుకోవడంపై సహకారం పెంచుకోవాలని చర్చించాయి.
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పత్రికా ప్రకటన ప్రకారం, ఈ సెషన్‌కు విదేశాంగ మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శి (ఉగ్రవాద నిరోధకత) వినోద్ బహదే, అలాగే ఆస్ట్రేలియా ఉగ్రవాద నిరోధక రాయబారి గెమ్మా హగ్గిన్స్ సహ-అధ్యక్షత వహించారు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి తమ ఉమ్మడి నిబద్ధతను ఇరు పక్షాలు దృవీకరించాయని భారత సైన్యం తెలిపింది.
హగ్గిన్స్ తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్‌లో ఇలా రాశారు - "ఇండో-పసిఫిక్ అంతటా ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదాన్ని నిరోధించడానికి, ఎదుర్కోవడానికి ఆస్ట్రేలియా, భారతదేశం కట్టుబడి ఉమ్మడి భాగస్వాములుగా ఉన్నాయి. 15వ వార్షిక ఆస్ట్రేలియా-భారత్ ఉగ్రవాద నిరోధక జాయింట్ వర్కింగ్ గ్రూప్‌లో ప్రదర్శించిన బలమైన, నిరంతర సహకారాన్ని మేము విలువైనదిగా భావిస్తున్నాము."అన్నారు.
పహల్‌గామ్‌లో జరిగిన దాడిని ఖండించిన ఆస్ట్రేలియా
రెండు దేశాల అధికారులు దేశీయ, ప్రాంతీయ, ప్రపంచ ఉగ్రవాద చర్యలను సమీక్షించారు, చట్ట అమలు, న్యాయ సమన్వయం, సముద్ర భద్రత రంగాలలో బలమైన సహకారంపై మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిని ఇరుపక్షాలు ఖండించాయి, ఆస్ట్రేలియా భారతదేశానికి తన "మద్దతు, సంఘీభావాన్ని" పునరుద్ఘాటించింది.
ఉగ్రవాద సమూహాలు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ఎక్కువగా ఉపయోగించడాన్ని కూడా ఈ చర్చలు గుర్తించాయి. ఆన్‌లైన్ రాడికలైజేషన్‌ను, ఉగ్రవాద కార్యకలాపాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడాన్ని ఎదుర్కోవడానికి సకాలంలో సమాచారాన్ని పంచుకోవడం, సామూహిక ప్రయత్నాలు చేయవలసిన అవసరం ఉందని భారత్, ఆస్ట్రేలియా అంగీకరించాయి.
ఐక్యరాజ్యసమితి, ఎఫ్‌ఏటీఎఫ్ గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం ఫోరం , ఆసియాన్ రీజినల్ ఫోరం వంటి బహుపాక్షిక వేదికలలో ఉగ్రవాదంపై ప్రపంచ పోరాటాన్ని బలోపేతం చేయడానికి క్వాడ్ ఫ్రేమ్‌వర్క్(భారత్, ఆస్ట్రేలియా, జపాన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత బహిరంగ వాతావరణాన్ని ప్రోత్సహించడానికి ఈ నాలుగు ప్రజాస్వామ్య దేశాలు ఏర్పాటుచేసుకున్న అనధికారిక వ్యూహాత్మక వేదిక) లో తమ సహకారం ఉంటుందని ఇరు పక్షాలు తెలిపాయి.
ఈ పర్యటన సందర్భంగా, భారత ప్రతినిధి బృందం ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ కౌంటర్ టెర్రరిజం యూనిట్, నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ, మారిటైమ్ బోర్డర్ కమాండ్ అధికారులను కూడా కలుసుకుని, ఆస్ట్రేలియన్ వాచ్ ఆఫీస్, క్రైసిస్ సెంటర్‌లో కార్యాచరణ సమన్వయాన్ని సమీక్షించింది. అలాగే భారత ప్రతినిధి బృందం ఆస్ట్రేలియన్ వార్ మెమోరియల్ వద్ద నివాళులర్పించి, రాయల్ మిలిటరీ కాలేజ్, డంట్రూన్‌ను కూడా సందర్శించింది. తదుపరి జెడబ్ల్యూజి సమావేశాన్ని పరస్పరం అనుకూలమైన తేదీలో న్యూ ఢిల్లీలో నిర్వహించడానికి రెండు దేశాలు అంగీకరించాయి.
