
భారత్-ఆస్ట్రియా మధ్య బలపడుతున్న ద్వైపాక్షిక బంధం
న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి వేదికగా భారత శాశ్వత ప్రతినిధి అంబాసిడర్ పి. హరీష్, ఆస్ట్రియా రక్షణ శాఖ డిప్యూటీ మంత్రి ఆర్నాల్డ్ కామెల్ మధ్య కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఇరువురు రెండు దేశాల మధ్య శాంతి పరిరక్షణ, వాణిజ్యం, సాంకేతికత, ఆవిష్కరణల రంగాలలో పరస్పర సహకారాన్ని మరింత పటిష్టం చేసుకోవడంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ చర్చలు అత్యంత డైనమిక్‌గా సాగాయని తెలుపుతూ, భవిష్యత్తులో ద్వైపాక్షిక, బహుపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు ఇరుపక్షాలు సుముఖంగా ఉన్నాయని స్పష్టం చేశాయి.
గత కొద్ది కాలంగా ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు వేగవంతం అయ్యాయి. ఇటీవల జరిగిన మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆస్ట్రియా విదేశాంగ మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి తోడు, గతేడాది డిసెంబర్‌లో జరిగిన 8వ 'ఫారిన్ ఆఫీస్ కన్సల్టేషన్స్'లో రాజకీయ, ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక అంశాలపై లోతైన సమీక్ష నిర్వహించారు. తదుపరి సమావేశాన్ని న్యూఢిల్లీలో నిర్వహించాలని కూడా నిర్ణయించారు.
నూతన రాయబారి నియామకం:
ఇటీవల భారత్‌లో ఆస్ట్రియా కొత్త రాయబారిగా డాక్టర్ రాబర్ట్ జిష్గ్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన తన నియామక పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్-ఆస్ట్రియా మధ్య దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రజల మధ్య సంబంధాలు, ఆర్థిక సహకారాన్ని పెంపొందించడంపై తాను దృష్టి సారిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆస్ట్రియా ఎంబసీ ఎక్స్ ఖాతాలో "అంబాసడర్ జిష్ కు స్వాగతం. అతను భారత్ లో ప్రమాణపత్రాలను సమర్పించగా, అధికారికంగా తన పదవీ ప్రారంభం జరిగింది. ఆయన నాయకత్వంలో, రెండు దేశాల మధ్య అద్భుత ద్విపక్ష సంబంధాలను మరింత బలపర్చే ప్రయత్నం కొనసాగుతుంది."అని తెలిపింది.
ఇదిలా ఉంటే, ఆస్ట్రియాలో నైపుణ్యం కలిగిన కార్మికులకు ఉన్న డిమాండ్‌ను గుర్తించిన ఆ దేశ ప్రభుత్వం, భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రత్యేక చొరవ చూపుతోంది. ఆస్ట్రియాలోని ప్రముఖ సాంకేతిక విశ్వవిద్యాలయాలలో భారతీయ విద్యార్థులకు ప్రాధాన్యత ఇచ్చేలా గత సెప్టెంబర్‌లో ఒక భారీ ప్రాజెక్టును కూడా ప్రారంభించారు. దీనివల్ల ఇటు భారత్‌కు చెందిన ప్రతిభావంతులకు అవకాశాలు పెరగడంతో పాటు, అటు ఆస్ట్రియా ఆర్థిక అవసరాలు కూడా తీరే అవకాశం ఉంది.
సైన్స్ అండ్ టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ, రక్షణ రంగాలలో పరస్పర సహకారం కోసం ఇరు దేశాలు సిద్ధంగా ఉన్నాయి. అంతర్జాతీయ వేదికలపై పరస్పర మద్దతు తెలుపుకుంటూనే, ద్వైపాక్షిక వాణిజ్య లోటును తగ్గించడం, పెట్టుబడులను పెంచడంపై రెండు దేశాల ప్రతినిధులు దృష్టి సారించారు. ఈ పరిణామాలు చూస్తుంటే, యూరోపియన్ యూనియన్‌లో భారత్‌కు ఆస్ట్రియా ఒక కీలక భాగస్వామిగా ఎదుగుతోందని స్పష్టమవుతోంది.
