Let's talk: editor@tmv.in
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై రాబోయే 4-5 రోజుల్లో ఉమ్మడి ప్రకటన: పీయూష్ గోయల్

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై రాబోయే 4-5 రోజుల్లో ఉమ్మడి ప్రకటన: పీయూష్ గోయల్

Dantu Vijaya Lakshmi Prasanna
6 ఫిబ్రవరి, 2026

భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి మొదటి విడత ప్రక్రియ సిద్ధమైందని, దీనిపై రాబోయే నాలుగు నుంచి ఐదు రోజుల్లో ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గురువారం ప్రకటించారు. దీనికి సంబంధించిన అధికారిక న్యాయపరమైన ఒప్పందం మార్చి మధ్యలో సంతకం అయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

ఉమ్మడి ప్రకటన వెలువడిన తర్వాత, అమెరికా దిగుమతి సుంకాలను 18 శాతానికి తగ్గిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసే అవకాశం ఉందని గోయల్ పేర్కొన్నారు. అలాగే వాషింగ్టన్ డీసీతో జరగబోయే ఈ భారీ ఒప్పందం గురించి వివరిస్తూ, అమెరికా నుండి మనం కొనుగోలు చేసే విమానాలు, ఇంజిన్ల విలువ ఒక్కటే 100 బిలియన్ డాలర్లు దాటుతుందని మంత్రి వెల్లడించారు. అలాగే ఇంధనం, సాంకేతికత బొగ్గు వంటి రంగాలలో అమెరికా నుండి దిగుమతులను భారత్ పెంచుకోనుందన్నారు.

2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రస్తుతం ఉన్న 191 బిలియన్ డాలర్ల నుండి 500 బిలియన్ డాలర్లకు పెంచడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యంఅని పీయూష్ గోయల్ అన్నారు. చర్చల సమయంలో భారత్ తన కీలక రంగాలైన వ్యవసాయం, డైరీ (పాడి పరిశ్రమ) ప్రయోజనాలను కాపాడుకుందని, రైతులు, మత్స్యకారుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా, వారి ఉత్పత్తులకు కొత్త మార్కెట్ అవకాశాలు కల్పించేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఇరు దేశాలు తమ సున్నితమైన రంగాలకు రక్షణ కల్పిస్తూనే గరిష్ట ప్రయోజనాలు పొందేలా చర్చలు జరిపాయని గోయల్ లోక్‌సభలో తెలిపారు.

ఈ ఒప్పందం ద్వారా భారతీయ చిన్న తరహా పరిశ్రమలు, రైతులు, మత్స్యకారులు యువతకు గొప్ప అవకాశాలు లభిస్తాయని గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్, మౌలిక సదుపాయాలు, పెట్రోకెమికల్ రంగాలు ఈ ఒప్పందంతో భారీగా లాభపడతాయని ఆయన పేర్కొన్నారు.

సాంకేతిక వివరణ:

వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ, అమెరికా సుంకాలు ఎగ్జిక్యూటివ్ అధికారాల పరిధిలో ఉంటాయని, అయితే భారత్ లో 'మోస్ట్ ఫేవరెడ్ నేషన్' సుంకాల తగ్గింపు కేవలం న్యాయపరమైన ఒప్పందంపై సంతకాలు పూర్తయిన తర్వాతే అమలవుతుందని స్పష్టం చేశారు.

ఈ ఒప్పందం వల్ల భారతీయ చిన్న తరహా పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, పెట్రోకెమికల్ రంగాలు భారీగా లాభపడనున్నాయి. చమురు కొనుగోళ్ల విషయంలో రష్యా నుండి అమెరికా వైపు మొగ్గు చూపడం వల్ల అంతర్జాతీయంగా భారత్ వ్యూహాత్మక బలం పెరగడమే కాకుండా, దేశీయ తయారీ రంగం మరింత బలోపేతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

నేపథ్యం:

ఫిబ్రవరి 2025లో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన తర్వాత ఈ చర్చలు వేగవంతమయ్యాయి. ఫిబ్రవరి 2న ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఈ ఒప్పంద ప్రకటనకు దారితీసింది.

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై రాబోయే 4-5 రోజుల్లో ఉమ్మడి ప్రకటన: పీయూష్ గోయల్ - Tholi Paluku