
భారత్-అమెరికా మధ్యంతర ఒప్పందానికి ఇరు దేశాల గ్రీన్ సిగ్నల్
భారత్, అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. రాబోయే కొద్ది వారాల్లోనే పరస్పర వాణిజ్య ప్రయోజనాలే లక్ష్యంగా ఒక 'మధ్యంతర ఒప్పందాన్ని' ఖరారు చేయాలని, తద్వారా సమగ్రమైన 'ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం' దిశగా అడుగులు వేయాలని వైట్ హౌస్ ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన చర్చల ఫలితంగా రూపొందిన కార్యచరణను వైట్ హౌస్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
అమెరికా విడుదల చేసిన అధికారిక 'ఫ్యాక్ట్ షీట్' ప్రకారం, ఈ ఒప్పందం వల్ల అమెరికా నుండి వచ్చే పారిశ్రామిక వస్తువులతో పాటు విస్తృత శ్రేణిలోని వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ సుంకాలను భారీగా తగ్గించనుంది లేదా పూర్తిగా ఎత్తివేయనుంది. ముఖ్యంగా ఎండు ద్రాక్షలు, బాదం, తాజా, శుద్ధి చేసిన పండ్లు, వైన్, స్పిరిట్స్ వంటి ఉత్పత్తులకు భారత మార్కెట్లో సులభతర ప్రవేశం లభించనుంది. దీనివల్ల అమెరికన్ రైతులు, వ్యాపారవేత్తలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరనుంది.
ఈ ఒప్పందంలో భాగంగా భారత్ ఒక భారీ కొనుగోలు ప్రణాళికను ప్రకటించింది. అమెరికా నుండి సుమారు 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను కొనుగోలు చేస్తామని భారత్ హామీ ఇచ్చింది. ఇందులో ప్రధానంగా ఇంధనం, సమాచార, కమ్యూనికేషన్ సాంకేతికత, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు వంటివి ఉన్నాయి. ఈ భారీ వాణిజ్య హామీ అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊతాన్ని ఇవ్వడంతో పాటు రెండు దేశాల మధ్య వాణిజ్య లోటును తగ్గించడానికి దోహదపడుతుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందాన్ని భారత మార్కెట్లోని 1.4 బిలియన్ల జనాభా అమెరికా వస్తువులకు చేరువయ్యే 'చారిత్రాత్మక అవకాశంగా' అభివర్ణించారు. గతంలో భారత్ అమెరికా వస్తువులపై 37శాతం నుండి 100శాతం వరకు అత్యధిక సుంకాలను విధించేదని, ఈ ఒప్పందం ద్వారా అటువంటి అడ్డంకులు తొలగిపోతాయని వైట్ హౌస్ పేర్కొంది. అమెరికా ఎగుమతిదారుల ప్రయోజనాలను రక్షించడమే లక్ష్యంగా ఈ 'రెసిప్రోకల్ ట్రేడ్' (పరస్పర వాణిజ్యం) విధానాన్ని అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఈ ఒప్పందంలో ఒక కీలక పరిణామం రష్యా చమురుకు సంబంధించింది. రష్యా నుండి చమురు కొనుగోళ్లను నిలిపివేయడానికి భారత్ అంగీకరించిన నేపథ్యంలో, దానికి ప్రతిఫలంగా భారతీయ ఉత్పత్తులపై గతంలో విధించిన 25శాతం అదనపు సుంకాన్ని అమెరికా తక్షణమే ఉపసంహరించుకుంది. ఈ మేరకు అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. అంతేకాకుండా, భారత్‌పై ఉన్న సాధారణ పరస్పర సుంకాన్ని కూడా 25శాతం నుండి 18శాతానికి తగ్గించాలని అమెరికా నిర్ణయించింది.
కేవలం వస్తువులకే పరిమితం కాకుండా, డిజిటల్ వాణిజ్యంలో కూడా కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. భారత్ ప్రస్తుతం విధిస్తున్న డిజిటల్ సేవల పన్నులను తొలగించడానికి అంగీకరించింది. ఎలక్ట్రానిక్ బదిలీలపై కస్టమ్స్ డ్యూటీలను నివారించడం పారదర్శకమైన డిజిటల్ నిబంధనలను రూపొందించడంపై ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఇది ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగాల్లో పనిచేసే కంపెనీలకు పెద్ద ఊరటనిస్తుంది.
మధ్యంతర ఒప్పందం ముగిసిన తర్వాత కూడా రెండు దేశాలు తమ చర్చలను కొనసాగించనున్నాయి. ముఖ్యంగా సేవలు, పెట్టుబడులు, కార్మిక అంశాలు, పర్యావరణం, మరియు మేధో సంపత్తి హక్కులు వంటి కీలక అంశాలపై చర్చలు జరగాల్సి ఉంది. ప్రభుత్వ కొనుగోళ్లు, సాంకేతిక అవరోధాలను తొలగించడం ద్వారా పూర్తి స్థాయి 'ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం' సాధించడమే లక్ష్యంగా భవిష్యత్తు కార్యాచరణను రూపొందించారు.
ఈ ఒప్పందం వల్ల సరఫరా గొలుసు మరింత పటిష్టం కానుంది. మూడవ దేశాల నుండి వచ్చే అన్యాయమైన వాణిజ్య పద్ధతులను ఎదుర్కోవడానికి, సాంకేతిక సహకారాన్ని పెంపొందించుకోవడానికి, ఎగుమతి నియంత్రణలపై పరస్పర సమన్వయం చేసుకోవడానికి భారత్-అమెరికా అంగీకరించాయి. ఇది కేవలం ఆర్థిక ప్రయోజనాలకే కాకుండా, ఇరు దేశాల జాతీయ భద్రత, వ్యూహాత్మక ప్రయోజనాలను కూడా కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని వైట్ హౌస్ విశ్వాసం వ్యక్తం చేసింది.
