Let's talk: editor@tmv.in
భారతీయ సమాజపు చీకటి కోణం ‘స్టోలెన్’

భారతీయ సమాజపు చీకటి కోణం ‘స్టోలెన్’

FL - BHAVN
6 అక్టోబర్, 2025

మనదేశం విభిన్నతకు ఒక తార్కాణంగా కనిపిస్తుంది ప్రపంచానికి. విభిన్న కుల మతాలు, విభిన్న సంస్కృతులతో పాటు విభిన్న విభిన్న తరగతులు, వాటి మధ్య అంతరాలు కలిగిన సమాజం మనది. ఒక తప్పుడు సమాచారం చాలు సమాజంలో అంతరాన్ని మరింత పెంచి మూకల మధ్య దాడులను ప్రేరేపించేందుకు. ఇటువంటి సున్నితమైన స్థితిగతులను చర్చిస్తూ వాటి మాటున దాగిన భయానక వాస్తవాన్ని మన ముందుంచే పదునైన సామాజిక విశ్లేషణను అందించే సినిమా స్టోలెన్. ఈ సినిమా 2018 లో జరిగిన వాస్తవ సంఘటనల స్పూర్తితో రూపొందించారు. 90 నిమిషాల నిడివి మాత్రమే కలిగిన ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతుంది.

కథ....

ప్రతీ వ్యక్తికీ ఒక ప్రపంచం ఉంటుంది. అలా రెండు విభిన్న దృక్కోణాలతో రెండు ప్రపంచాలకు ప్రతినిధులుగా కనిపించే ఇద్దరు సోదరుల చుట్టూ తిరుగుతుంటుంది ఈ కథ. గౌతమ్ (అభిషేక్ బెనర్జీ) మరియు రమణ్ (శుభమ్ వర్ధన్). గౌతమ్, పట్టణంలో నివసించే, ధనవంతుడు, తన పని తప్ప ప్రపంచంతో పెద్దగా సంబంధం లేని ఒక అహంభావి. రమణ్, అతని కంటే కొంచెం సున్నితమైన వ్యక్తి. వారు ఇద్దరూ తమ తల్లి రెండో పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్తుంటారు. గౌతమ్ బీహార్ లోని ఒక చిన్న రైల్వే స్టేషన్ లో తన సోదరుడు రమణ్ ను పికప్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అదే సమయంలో ఝంపా (మియా మెల్జర్) అనే వలస కూలీ కి చెందిన 5 నెలల పసికందును ఎవరో దొంగిలిస్తారు. రమణ్ ఆమెకు సాయం చెయ్యాలని అనుకుంటాడు. కానీ గౌతమ్ కు ఈ తలనొప్పి లో తలదూర్చడం ఇష్టం ఉండదు. తప్పనిసరి పరిస్థితుల్లో బిడ్డను వెతికేందుకు తనూ సాయం చేసేందుకు ఒప్పుకుంటాడు. ఆక్రమంలో ఇద్దరు సోదరులు ఆపదలో పడతారు. వాట్సప్ ద్వారా ప్రచారం అయిన ఒక తప్పుడు సమాచారం వల్ల వీరే పిల్లల్ని దొంగిలించే వారిగా చిత్రికరించబడతారు. అన్నదమ్ములిద్దరూ ఝుంపాతో కలిసి కోపంతో రగిలిపోతున్న మూక నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవైపు కనిపించకుండా పోయిన బిడ్డ ఆచూకీ కోసం వెతడం, మరో వైపు పోలీసుల ఉదాశీన వైఖరి, అమానవీయమైన మూక చేసే దాడి నుంచి తప్పించుకోవడమే ఈ సినిమా ఇతివృత్తం.

వైఖరుల్లో మార్పులు…

గౌతమ్ పాత్ర కథ ప్రారంభంలో సంపద వల్ల వచ్చిన అహంకారంతో ఉంటాడు. పేదవారి సమస్యలు, ఇబ్బందులు, జీవన్మరణ స్థితిగతులేవీ అతడికి పరిగణించాల్సిన విషయాలుగా అనిపించవు. బిడ్డను పోగొట్టుకున్న ఝుంపా పరిస్థితి అతడికి కేవలం ఒక లాజిస్టిక్ సమస్యలాగే తోస్తుంది తప్ప మరేవిధంగానూ అతడిని కదిలించదు. తన పక్కనే బిడ్డకోసం తపిస్తూ రోధిస్తున్న ఝుంపాను ఏమాత్రం పట్టించుకోకుండా పెళ్లి ఏర్పాట్ల గురించి ఫోన్లో మాట్లాడడం అట్టర్ రియాలిటీకి దూరంగా ఉన్న అతడి పరిస్థితిని స్పష్టం చేస్తుంది. కానీ ఒక్కసారిగా అల్లరి మూక తనమీదకు దాడికి వచ్చినపుడు సంపడిని అనే అతడి అహంకారం ఒక్కసారిగా అదృశ్యమవుతుంది. అతి సామాన్య పేదవాడి మాదిరిగానే ప్రాణభయంతో, చిరిగిన బట్టలతో, బురదలో పడిపోవడం అంతా ఒక కనువిప్పులా ఉంటుంది. అహంకారం నుంచి అతడి ప్రయాణం మానవత్వం వైపు సాగేందుకు ఈ సన్నివేశం సినిమాకే కేంద్రబిందువుగా చెప్పవచ్చు. సమాజంలో ఉన్న నిస్సహాయ పరిస్థితులు ఒకరి మీద ఒకరు దాడులకు తెగబడే కౄరత్వంలోకి ఎంత త్వరగా పరిణమిస్తాయో చాలా చక్కగా చూపించిందీ సినిమా.

బిగువైన కథనం

దర్శకుడు కరణ్ తేజ్ పాల్ తన తొలి చిత్రంతోనే అద్భుత ప్రతిభ కనబరిచారు. సినిమా నిడిడి తక్కువగా ఉండడం వల్ల కథనంలో ఎక్కడా బిగువు తగ్గలేదు. అందువల్ల సినిమా ఆద్యంతం ఉరుకులు పరుగులుగా సాగుతుంది. హైవేథ్రిల్లర్ జానర్ కు దగ్గరగా ఉంటుంది. అయితే సినిమా అంతా హైవే మీదే సాగలేదు. పల్లెల్లోని వెనుకబడిన ప్రాంతాల చీకటి కోణాలు లోతుగా చర్చించాడు.

ఛేజింగ్ సన్నివేశాల్లో చీకటి, ధూళీ నిండిన లోకేషన్లు చూసేవారికి కచ్చితంగా కంగారు పుట్టిస్తాయి. ఈసినిమా నేపథ్య సంగీతం ప్రతి సన్నివేశపు గాఢతను మరింత పెంచుతుంది. కెమెరా పనితనం చాలా సహజంగానూ, పట్టుసడలకుండానూ ఉన్నట్టు సులభంగానే గుర్తించవచ్చు.

నటీనటులందరూ తమతమ పాత్రలకు జీవం పోశారని చెప్పవచ్చు. ముఖ్యంగా గౌతమ్ గా నటించిన అభిషేక్ బెనర్జీ నటన అద్భుతం. ఎడిటింగ్ కూడా చాలా పదునుగా ఉంటంది. అందువల్ల కథ చాలా వేగంగా సాగి ఎక్కడ సాగదీత అనేదే కనిపించదు.

అసలేం చెప్పాలనుకున్నారు?

స్టోలెన్ ఒక థ్రిల్లర్ మూవీ కాదు, ఇది భారతీస సమాజంలోని అత్యంత ప్రముఖ సమస్యలను చర్చించస్తుంది.

-

వాట్సప్ ను ఎంత బాగా దుర్వినియోగం చేస్తున్నారో, ఎంత త్వరగా ఒక అబద్ధపు వార్తను సమాజం మీదకు వదలవచ్చో, హింసాత్మకం చెయ్యవచ్చో ఈ సినిమా చూసి అర్థం చేసుకోవచ్చు.

-

ప్రబుత్వ యంత్రాంగం ముఖ్యంగా పోలీసుల మందకోడితనం, పేద ప్రజల సమస్యల విషయంలో ఉదాశీన వైఖరి సుస్పష్టం చేస్తుంది

-

వాస్తవాలను నిర్ధారించుకోకుండా కేవలం పుకార్లను ఆదారం చేసుకుని అమాయకులను చంపేందుకు కూడా వెనుకాడని మూక మనస్తత్వాన్ని, భయంకరమైన మాస్ మెంటాలిటిని కళ్లముందు ఉంచుతుంది.

స్టోలెన్ ఒక ఉద్వేగభరిత, ఉత్కంఠభరిత అనుభవాన్ని కచ్చితంగా ఇస్తుంది. మానవ హృదయంలోని చీకటికోణాల మీద ఒక వెలుగు ప్రసరింపజేసే కథ. చుట్టూ ఉన్న సామాజిక వాస్తవాల గురించి ఆలోచన రేకెత్తిస్తుంది. రియాలిటీ, పెర్ఫార్మెన్స్ ను ఇష్టపడే ప్రేక్షకులకు తప్పక నచ్చుతుంది. బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ గా చెప్పుకోవచ్చు. తప్పక చూడాల్సిన సినిమాల లిస్ట్ లో పెట్టుకోవచ్చు.

2023 వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 31ఆగస్టు 2023న ప్రదర్శించారు. అయినప్పటికీ కాస్త ఆలస్యంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో 4 జూన్ 2025 నుంచి అందుబాటులో ఉంది.14వ బీజింగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా దీన్ని ప్రదర్శించారు. అక్కడ ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి మరియు ఉత్తమ సినిమాటోగ్రఫీకి టియంటన్ అవార్డులను గెలుచుకుంది. ఇది "2024 స్కిప్ సిటీ ఇంటర్నేషనల్ డిజిటల్ సినిమా ఫెస్టివల్, జపాన్"లో ఉత్తమ దర్శకుడు మరియు ప్రేక్షకుల అవార్డులను పొందింది.

ఈ సినిమా చూడాలనుకునే వారు ఆన్లైన్ లో ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.

భారతీయ సమాజపు చీకటి కోణం ‘స్టోలెన్’ - Tholi Paluku