Let's talk: editor@tmv.in
భారతీయ విద్యా వ్యవస్థలో సాంస్కృతిక సంక్షోభం!

భారతీయ విద్యా వ్యవస్థలో సాంస్కృతిక సంక్షోభం!

Dr.Chokka Lingam
28 నవంబర్, 2025

భారతీయ విద్యా వ్యవస్థ గత శతాబ్దపు నీడల్లో నడుస్తూనే, 21వ శతాబ్దపు పిల్లల మనసులు భవిష్యత్తు వైపు పరుగులు తీస్తున్నాయి. ఒకవైపు కృత్రిమ మేధా ప్రపంచం, గ్లోబల్ వర్క్ కల్చర్, మరోవైపు పాత సిలబస్, ఇంకా పరీక్షల ఆధారిత చదువు. ఈ రెండు ప్రపంచాల మధ్య పెరిగే వ్యత్యాసం, భారతీయ తరగతి గది నిజంగా 21వ శతాబ్దపు విద్యార్థుల అవసరాలకు, వారి బౌద్ధిక - సాంస్కృతిక మార్పులకు సరిపోతుందా అనే ప్రశ్నను ముందుంచుతోంది.

సాంస్కృతిక సంబంధం ఎందుకు ముఖ్యం?

సంస్కృతి అనే పదం పండుగలు, భాష, వేష ధారణ మాత్రమే కాదు. జీవన శైలులు, విలువలు, ఆలోచనా విధానాలు, వ్యక్తిత్వ వికాసం, సామాజిక వాస్తవాలు, అనుభవాలు ఇవన్నీ విద్యను ప్రభావితం చేస్తాయి. పిల్లలు ఏ కాలంలో జన్మిస్తే ఆ కాలపు సంస్కృతి వారి చుట్టూ నడిచే ప్రపంచాన్ని నిర్ణయిస్తుంది. ఇదిలా ఉంటే, మన తరగతి గది పూర్తిగా 20వ శతాబ్దపు విద్యా దృక్పథం, గైడ్‌లు, నోట్‌లు, పరీక్షలకే పరిమితమైన బోధనా శైలితో ముందుకు సాగుతున్నది. ఫలితంగా, పిల్లలు నేర్చుకుంటున్నది ఒక ప్రపంచం, జీవిస్తున్నది మరొక ప్రపంచంలో ఈ వైరుధ్యమే విద్యా అసమతుల్యతకు మూలం.

పరిశ్రమలు మారాయి… విద్య మాత్రం?

ఇప్పుడు దేశంలోని ప్రతీ రంగం వ్యాపారం నుండి వైద్యం, మీడియా నుండి వ్యవసాయం వరకు సాంకేతికత, ఆవిష్కరణ, సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాల ఆధారంగా నడుస్తోంది. కానీ తరగతి గదిలో మాత్రం పాఠం బోధించే విధానం గతాన్ని గుర్తు చేస్తుంది.మనం ఇంకా గురువు చెప్పినది వ్రాసుకోవడం పరీక్షకు చదవడం మార్కులు సంపాదించడం అనే అసలు లక్ష్యం లేని చక్రంలోనే పిల్లలను తిప్పుతూనే ఉన్నాం.21వ శతాబ్దపు విద్యార్థికి మల్టీమీడియా అనుభవం, ఇండస్ట్రీ-లింక్డ్ లెర్నింగ్, సహకార నైపుణ్యాలు, గ్లోబల్ విజన్, సాంస్కృతిక సున్నితత్వం, డిజిటల్ లిటరసీ వంటి అంశాలు అవసరం.కానీ మన పాఠశాలలు, ముఖ్యంగా ప్రభుత్వ రంగంలోని పాఠశాలలు, ఇవన్నీ ఇంకా ప్రాథమిక వసతుల స్థాయిలోనే అర్థం చేసుకుంటున్నాయి.

భాష - పిల్లల ప్రపంచాన్ని అర్థం చేసుకోని తరగతి గది

సాంస్కృతిక అనుసంధానంలో భాష అత్యంత సహజమైన వంతెన. కానీ భారతీయ తరగతి గదుల్లో భాషే చాలా సందర్భాల్లో అడ్డంకిగా మారుతోంది.పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష ఒకటి, పాఠశాలలో బోధన భాష పూర్తిగా వేరేది. ఈ వ్యత్యాసం చిన్న వయసులోనే పిల్లలలో భయాన్ని, తర్జన భర్జనను, నేర్చుకునే సామర్థ్యంపై అవిశ్వాసాన్ని పెంచుతోంది.వారు అర్థం చేసుకునే ప్రపంచం స్థానికం కానీ బోధించే ఉదాహరణలు, కథలు, పాఠాలు చాలావరకు పాశ్చాత్య లేదా పాతకాలపు కాన్సెప్ట్‌ల మీదే ఆధారపడి ఉన్నాయి. సాంస్కృతిక అనుభవం పిల్లల బుద్ధి వికాసానికి మూల బలం. కానీ మన పాఠ్యపుస్తకాలు పిల్లలు చూచే, అనుభవించే, మాట్లాడే ప్రపంచాన్ని ప్రతిబింబించడంలో వెనుకబడుతున్నాయి.

పరీక్షల సంస్కృతి - ఒకే కొలమానంతో కొలవబడే ప్రతిభ

భారతీయ విద్యా వ్యవస్థను ఇంకా “పరీక్షల ఆధారిత వ్యవస్థ” అని పిలవడంలో ఎలాంటి సందేహం లేదు. పిల్లల సామర్థ్యం, సృజనాత్మకత, కళలు, క్రీడా నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, తార్కికత ఏవీ కొలవలేని పరీక్షలు ఇప్పటికీ పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తున్నాయి. అందువల్ల వారి సాంస్కృతిక అనుభవాలు, వ్యక్తిత్వం, బహుముఖ ప్రతిభ తరగతి గదిలో కనిపించకుండానే పోతుంది.పరీక్షల రంగంలో మార్పులు వచ్చినా, బోధన విధానంలో మాత్రం పెద్ద మార్పు లేదు.కంటెంట్ మారితే చాలనుకునే దృష్టి, క్లాస్‌రూమ్ కల్చర్ ఎంత పాతదో తెలియకుండా పోతుంది.

డిజిటల్ జెనరేషన్ - అనలాగ్ తరగతి గదులు

నేటి విద్యార్థి డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరిగినవాడు. నేటి విద్యార్థికి సమాచారం ఒక క్లిక్ దూరంలో ఉంటుంది. కానీ పాఠశాలలో మాత్రం "టెక్స్ట్‌బుక్‌కు మించి ఏం లేదు" అనే వాతావరణం ఇంకా కొనసాగుతోంది.గురు - శిష్య సంబంధం కూడా ఇప్పుడు మారిపోయింది.విద్యార్థి ప్రశ్నించే వ్యక్తి, ఆలోచించే మనసు. కానీ తరగతి గదిలో ప్రశ్న అడగడం కూడా అనేక చోట్ల ఇంకా సంస్కృతికి విరుద్ధంగా కనిపిస్తోంది.డిజిటల్ టూల్స్ వాడకం పెరిగిన కొద్దీ, పిల్లల నేర్చుకునే శైలి కూడా విజువల్, ఇంటరాక్టివ్, మల్టీడైమెన్షన్‌గా మారింది.కానీ తరగతి గదిలో మాత్రం ఇంకా “కూర్చో విను వ్రాయి” అనే ఏకపక్ష బోధనా పద్ధతి కొనసాగుతున్నది

సాంస్కృతిక స్పందనపై దృష్టి లేని గురువుల శిక్షణ

ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమాలూ ఇప్పటికీ సాంప్రదాయ బోధనా పద్ధతుల మీదే ఎక్కువ ఆధారపడుతున్నాయి. 21వ శతాబ్దపు పిల్లలు ఎదుర్కొంటున్న సవాళ్లు, వారి మానసిక–సామాజిక మార్పులు, డిజిటల్ జీవనశైలి, బహుసాంస్కృతిక పరిసరాలు ఇవి గురువుల శిక్షణలో పెద్దగా ప్రాధాన్యం పొందడం లేదు.సాంస్కృతికంగా స్పందించగలిగే బోధన (culturally responsive teaching) అనేది ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ అవుతున్నా, భారతీయ పాఠశాలల్లో ఇంకా దీనిపై అవగాహన తక్కువ.

సాంస్కృతిక విభిన్నత - బలమా? లేక సవాలా?

భారతదేశం వంటి బహుళ భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, జీవన శైలులున్న దేశంలో తరగతి గదిని సాంస్కృతికంగా సంబంధితంగా మార్చడం క్లిష్టమైనదే.కానీ అదే సమయంలో, ఇదే మన బలమైన సామర్థ్యం కూడా.

పిల్లల నేపథ్యాలను తెలుసుకునే ప్రయత్నం, వారి కథలు వినిపించే వేదిక, స్థానిక జ్ఞానం, స్థానిక భాషలు, స్థానిక ప్రపంచాన్ని బోధనలో భాగం చేస్తే, తరగతి గది మరింత జీవంతో మారుతుంది.సాంస్కృతిక అనుసంధానం జరగని చోట విద్య కూడా అర్థరహితంగా మారుతుంది.పిల్లలు నేర్చుకున్నది జీవితానికి అన్వయించుకోలేని పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది.

మార్పు ప్రారంభమైంది - కానీ ఆచరణ ఇంకా దూరమే

నూతన విద్యా విధానం (NEP 2020) బహుళ భాషా ప్రోత్సాహం, స్థానిక పరిజ్ఞానానికి ప్రాధాన్యం, పరిశోధనాత్మక బోధన, హోలిస్టిక్ డెవలప్‌మెంట్ వంటి మంచి సంకల్పాలను తెచ్చింది.కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే స్కూల్ సంస్కృతిలో మార్పులు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.కానీ విధానాలన్నీ కాగితం మీద మంచి కనిపించినా, ఆచరణలో అమలు అయ్యే వేగం అంతంత మాత్రమే.తరగతి గది మారాలంటే భవనం నుంచి గురువు వరకు, పాఠ్యపుస్తకంనుంచి తల్లిదండ్రుల దృక్పథం వరకు ప్రతి దాంట్లో మార్పు రావాలి.అప్పుడు, అసలు ప్రశ్న ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం?

భారతీయ తరగతి గది 21వ శతాబ్దపు విద్యార్థికి పూర్తిగా అనుకూలంగా ఉందా?సూటిగా చెప్పాలంటే: కొంతమేరకు మాత్రమే. ఇంకా చాలా దూరం వెళ్లాలి.కొత్త పాఠశాలలు, ప్రైవేట్ సంస్థలు, ఆధునిక విధానాలు, సాంకేతిక వసతులతో కూడిన విద్యా సంస్థలు కొంతమేరకు మార్పుని సూచిస్తున్నాయి.కానీ భారతదేశంలోని లక్షలాది పిల్లలు ఇంకా పాత తరగతి గదులలో, పాత పాఠ్యపుస్తకాలతో, పాత బోధనా శైలిలోనే చదువుతున్నారు.

భవిష్యత్తు పిల్లలది - తరగతి గది కూడా వారి ప్రపంచాన్ని ప్రతిబింబించాలి

21వ శతాబ్దపు విద్యార్థి గ్లోబల్ సిటిజన్, డిజిటల్ నేటివ్, బహుళ సంస్కృతుల మధ్య సంచరించే మనిషి. అతని చదువు అతని ప్రపంచానికి దగ్గరగా ఉండాలి; అతని సంస్కృతిని గుర్తించాలి; అతని భాషను గౌరవించాలి; అతని కల్పనాశక్తిని ఉత్తేజపరచాలి.

భారతీయ తరగతి గది నిజంగా 21వ శతాబ్దపు విద్యార్థికి సంబంధించినదిగా మారాలంటే సంస్కృతిని అర్థం చేసుకునే విద్య, జీవన అనుభవాలను ప్రతిబింబించే పాఠ్యపుస్తకాలు, సృజనాత్మకతను ప్రోత్సహించే బోధన, భయమెరగని ప్రశ్నలు, బహుళ భాషలకు గౌరవం, డిజిటల్ ప్రపంచంతో అనుసంధానం తప్పనిసరి. మార్పులు అనివార్యమని గుర్తించిన క్షణం నుంచే భారతీయ విద్యా వ్యవస్థ తన తదుపరి ప్రధాన అడుగు వేయగలదు. కాలం చాలా వేగంగా మారిపోతున్నది. ఇప్పుడు మన తరగతి గదులు కూడా పిల్లల ప్రపంచం ముందుకెళ్తున్నంత వేగంగా మారాలి