
భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ ‘వీసా’ ఊరట
భారతీయ విద్యార్థులకు విదేశీ విద్యను మరింత చేరువ చేసే దిశగా ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్‌లో పర్యటిస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ బుధవారం న్యూఢిల్లీలో పలు విద్యా, శాస్త్రీయ సమావేశాల్లో పాల్గొని విద్యార్థుల కోసం భారీ ఊరటనిచ్చే ప్రకటనలు చేశారు. ముఖ్యంగా ఫ్రాన్స్‌లో చదువుకోవాలనుకునే భారతీయుల కోసం వీసా నిబంధనలను సరళీకరించడంతో పాటు, భాషా ఇబ్బందులు కలగకుండా ఆంగ్ల మాధ్యమంలోనే కోర్సులను అందుబాటులోకి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు.
వీసా జారీ ప్రక్రియ సులభతరం
ఢిల్లీలోని ఎయిమ్స్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో మాక్రాన్ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య విద్యార్థుల రాకపోకలను భారీగా పెంచడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏటా సుమారు 10 వేల మంది విద్యార్థులు ఫ్రాన్స్ వెళ్తుండగా, ప్రధాని మోడీతో చర్చించిన తర్వాత ఈ సంఖ్యను 2030 నాటికి 30 వేలకు పెంచాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇందుకోసం వీసా జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని, విద్యార్థుల అంచనాలకు అనుగుణంగా నిబంధనలను సరళీకరించి, అడ్డంకులను తొలగిస్తామని స్పష్టం చేశారు.
ఇంగ్లీష్‌లోనే పాఠాలు
ఫ్రెంచ్ భాష రాదనే భయంతో చాలా మంది విద్యార్థులు ఫ్రాన్స్‌కు వెళ్లేందుకు వెనకాడుతుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, ఇకపై అక్కడ అనేక రకాల కోర్సులను ఆంగ్ల మాధ్యమంలోనే అందుబాటులోకి తెస్తామని మాక్రాన్ స్పష్టం చేశారు. దీనివల్ల భాషా సమస్య తలెత్తకుండా, భారతీయ విద్యార్థులు అక్కడి ప్రపంచ స్థాయి విద్యాసంస్థల్లో తమ ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లభిస్తుంది.
ఆరోగ్య రంగంలో సరికొత్త ప్రయోగాలు
ఈ పర్యటనలో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఎయిమ్స్‌లో ‘ఇండో-ఫ్రెంచ్ క్యాంపస్ ఆన్ ఏఐ ఇన్ గ్లోబల్ హెల్త్’ను మాక్రాన్ ప్రారంభించారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధ వినియోగాన్ని పెంపొందించడం, నూతన ఆవిష్కరణలు చేపట్టడం, అంతర్జాతీయ స్థాయి విద్యా భాగస్వామ్యాన్ని పటిష్టం చేయడమే ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశం. ఈ చొరవతో ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి పరిశోధనలు సాగుతాయని, తద్వారా అత్యాధునిక వైద్య విధానాలు అందుబాటులోకి వస్తాయని నేతలు పేర్కొన్నారు.
అత్యుత్తమ పరిశోధనా కేంద్రాలు
ఫ్రాన్స్‌కు వచ్చే భారతీయ విద్యార్థులకు అక్కడ ఉన్న ప్రపంచ స్థాయి పరిశోధనా కేంద్రాల్లో పని చేసే అరుదైన అవకాశం లభిస్తుందని మాక్రాన్ తెలిపారు. వేర్వేరు రంగాలకు చెందిన మేధావులతో కలిసి పనిచేస్తూ, సరికొత్త విషయాలను నేర్చుకునే వాతావరణం అక్కడ ఉంటుందని ఆయన వివరించారు. ఉన్నత విద్య కోసం వచ్చే భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ ఎప్పుడూ సాదర స్వాగతం పలుకుతుందని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు.
