
భారతీయ నిపుణులకు ఐరోపాలో ఇక 'బంగారు భవిష్యత్తు'
భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య దాదాపు రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ మంగళవారం చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ప్రధాని నరేంద్ర మోదీ దీనిని "మదర్ ఆఫ్ ఆల్ డీల్స్" (అన్ని ఒప్పందాలకు తల్లి వంటిది) గా అభివర్ణించారు. ఈ ఒప్పందం ద్వారా ఐరోపాలోని 27 దేశాల్లో భారతీయ వస్తువులకే కాకుండా, భారతీయ నైపుణ్యానికి కూడా పెద్దపీట వేయనున్నారు. ముఖ్యంగా ఐటీ, పరిశోధన, ఉన్నత విద్యా రంగాల్లోని నిపుణులు అక్కడ సులభంగా పనులు పొందేందుకు ఈ ఒప్పందం ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసింది.
ఈ ఒప్పందంలోని కీలక అంశం ఏమిటంటే, భారతీయ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు ఐరోపాలోని తమ బ్రాంచ్‌లకు బదిలీ అయినప్పుడు, వారి జీవిత భాగస్వాములు, పిల్లలు కూడా వారితో పాటు ఉండేందుకు ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. దీనివల్ల భారతీయ కుటుంబాలు విదేశాల్లో కలిసి ఉండే అవకాశం లభిస్తుంది. అలాగే, ఐటీ, మేనేజ్‌మెంట్ వంటి 37 వివిధ సేవా రంగాలలో భారతీయ కంపెనీలు తమ సేవలను ఐరోపా క్లయింట్‌లకు నేరుగా అందించవచ్చు. స్వతంత్ర నిపుణులు కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా 17 కీలక రంగాల్లో తమ ప్రతిభను చాటుకోవచ్చు.
భారతీయ విద్యార్థులకు కూడా ఈ ఒప్పందం తీపి కబురు అందించింది. ఐరోపాలో చదువు పూర్తి చేసిన తర్వాత అక్కడే ఉండి ఉద్యోగ అవకాశాలు వెతుక్కునేందుకు 'పోస్ట్ స్టడీ వర్క్ వీసా' ప్రక్రియను మరింత సరళతరం చేయనున్నారు. అంతేకాకుండా, రాబోయే ఐదేళ్లలో అన్ని ఈయు సభ్య దేశాలతో 'సామాజిక భద్రత ఒప్పందాలను' కుదుర్చుకోవాలని నిర్ణయించారు. దీనివల్ల ఐరోపాలో పనిచేసే భారతీయులు తమ జీతం నుంచి సామాజిక భద్రత కోసం చెల్లించే కంట్రిబ్యూషన్లు వృధా కాకుండా ఉండే అవకాశం ఉంటుంది.
సేవా రంగమే కాకుండా, వస్తువుల ఎగుమతిలో కూడా భారత్ భారీ లాభాలను ఆర్జించనుంది. టెక్స్‌టైల్స్, తోలు ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాల వంటి రంగాల్లో దాదాపు 99% ఎగుమతులపై సుంకాలను రద్దు చేయడం లేదా భారీగా తగ్గించడం వల్ల భారతీయ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్‌లో గట్టి పోటీ ఇచ్చే శక్తి లభిస్తుంది. ప్రస్తుతం 80 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత సేవలు, వస్తువుల ఎగుమతులు ఈ ఒప్పందం ద్వారా రానున్న కాలంలో మరింతగా పుంజుకుంటాయని వాణిజ్య శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.
